పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, సెప్టెంబర్ 2012, గురువారం

వాసుదేవ్ II అంతర్ముఖం II


జ్ఞాతం నుంచి అజ్ఞాతంలోకో
ఇట్నుంచి అటో
ఓ వలస.....
కళ్ళంతా గుచ్చుకుంటున్న
వెలుగు నుండి నిశీధిలోకో
అట్నుంచి ఇటో
ఓ నత్తనడక....
దిగులుకొండపై మౌనముద్ర....
వెనక్కి తిరుగుతున్న గడియారపు ముల్లు!

ఏ నగిషీ వెలుగుల మారుముఖాలూ పొసగవు,
మైనపురంగులూ అంటవు
మనసు చీకటి గదుల్లో తచ్చాడే
అస్పష్ట భావనల్లో
నిజాన్ని కప్పే నివురేదీ సృష్టించుకోలేను!
నిజంచెప్పే నాలుకెండిపోయింది.

రక్తమోడుతున్న ఓ అక్షరమో
వానకారుతున్న ఓ మేఘమో
తట్టిలేపుతుంటాయి
కళ్ళనుతవ్వి కలలను పట్టుకుంటూండగా.....

ఖాళీ గుండెకీ, నిండుకున్న మెదడుకీ
మధ్య అస్తవ్యస్త ఆలోచనలు
మరణించిన పేషేంట్ చుట్టూ
పరుగెడుతున్న నర్సుల్లా....

కాలానికి చేసిన రంధ్రంలో పరుగెడుతుంటాను
ముందుకీ వెనక్కీ....పెండ్యులంలా!
కొత్త ప్రేమికుడిలా!
హవర్ గ్లాసులో ఇసుకరేణువుల్లా
ఒత్తిడిపరుగు
కోట్లకొద్దీ నిరర్ధక పరుగులు

గంటస్తంభం గడియారం
గంటా కొట్టదు, అలారం వినిపించదు
చుట్టూ చూస్తున్న దారుణాలన్నింటినీ
కడుపులోకి లాగేసుకుని
అంతర్ముఖంలోకి జారిపోతూనే ఉంటుంది
నాలా!

ప్రసవించే వాక్యమో, స్రవించే పదమో
తోడుంటాయి....ఓదార్పుతో
ఓ పద్యంకింద నలిగిపోతుంటాను....

గుండె తెరిచిన ఏ జలపాతమూ
అంతర్ముఖంగా ఉండలేదన్నప్పుడు
ఓ పొలికేక....గుండె బద్దలుకొట్టుకుంటూ!

మనిషి మనిషిని మనిషిగా
కౌగలించుకునే రోజు
ఈ కుబుసం విడుస్తానేమొ!
ఓ మనిషీ తిరిగి రా!
మనిషిగా రా!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి