పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, సెప్టెంబర్ 2012, గురువారం

డా.పులిపాటి గురుస్వామి॥కాలకూటరసం॥



ఎప్పటికీ ఓ రహస్యం తెగని గోళాకార నివృత్తి లోంచి
బయటకు పోలేక

ఎప్పటికీ కాసిని దోసిలి నిండని ప్రేమ గింజల్ని
చప్పరించే యోగ్యతని మెప్పించలేక

ఎప్పటికీ జ్వలించే అంతర దీపాలకు
చేతుల దాపు సరిపడా చూపించలేని
నిర్వీర్యాన్ని తిరస్కరించలేక

ఎప్పటికీ లోలోపలి నరాలకి
వెలుతురు వెంట తీసుకుపోలేని
కుంటితనాన్ని భరించలేక

ఎప్పటికీ మిణుకు మిణుకు సౌందర్యపు ముఖ భాగాలను
స్పష్టంగా క్రీడించలేని వేదనని ఒప్పించలేక

ఎప్పటికీ కిటికీ కింద వేలాడుతున్న
దుఃఖపు పీలికలను
ధైర్యంగా గదిలోకి చేర్చుకోలేని
నిస్సహాయ జ్ఞానాన్ని క్షమించుకోలేక

ఎప్పటికీ శూన్యాల చుట్టూ పెనవేసుకుంటున్న
మిక్కిలి మోహ కాంతులను ఆర్పేయలేని
భార జడభావనకి ఊపిరి నింపలేక

ఎప్పటికీ పరుగెడుతున్న రధచక్రాల ప్రేమను
తిరస్కరించలేని నిమిత్త వాన్చాకి భజనచేయలేక

ఎప్పటికీ
ఎప్పటికీ
నన్ను నేను చేరుకోలేని
బాహ్యాంతర మైనపు దారుల్ని
శుద్ధి చేయలేని ఆవేశ శకలాల నశ్చలింపలేని
ప్రయత్నాల తట్టుకోలేక .

.....

4-9-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి