పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, సెప్టెంబర్ 2012, గురువారం

జగద్ధాత్రి || పతంగ్ ||


రంగు రంగుల కాగితాలతో
నన్ను ప్రియంగా అందంగా చేసావు
నాకో అస్తిత్వాన్నిచ్చ్చావు
నీ ఆశల తోక తగిలించి గాలిలోనికి వదిలావు
ఆకాశాన్ని చేరమన్నావు
నీ ఆశలు వమ్ము చేస్తూ
మొదటిసారి తిరిగి పడ్డాను కింద
నన్ను ఏమీ అనకుండా
మళ్ళీ ప్రయత్నం తో నన్ను ప్రేమ గా ఎగరేసావు
ఈ సారి నీవనుకున్న దాని కంటే ఎత్తు ఎదిగాను
నీ కళ్ళలో ఆనంద భాష్పాలు చూసి పొంగి పోయాను

ఇంతలో తూఫాను గాలి వీచింది
నేను కిందకి రాలేకా ఎగరలేక
జీవితపు చెట్టు మీద చిక్కుకున్నాను
నా కష్టానికి నువ్వే కారణమని దుఖం తో నువ్వు
కుంగి కుమిలిపోయావు .....

కారణం నీవు కాదని నేనెంత ఓదార్చినా
నీ బాధతో చివరికి ప్రాణం అర్పించావు
నీ ప్రేమ దారం తెగి నేను మాత్రం
ఆకడే చిక్కుకుని ఆ జీవన వృక్షం పై
అప్పుడప్పుడు పచ్చని ఆకుల సందిలిలో
సేద తీరుతూ .... అదాటున వచ్చి పడే వర్షం లో
తడిసి పోతూ, కొద్ది కొద్దిగా రంగు వెలుస్తూ
సాగే కాలం తో బాటు నీ ప్రేమ చిహ్నంగా
మిగిలి ఉన్నాను ...

ఎప్పుడో చివికి జీర్ణించు కు పోయి రాలి పోతాను
కానీ ఊపిరున్నంతవరకూ నీ కన్న ప్రేమ కు
గురుతుగా మనిక సాగిస్తూ
నా తర్వాతి వారికి కూడా
ఒక్కింత స్ఫూర్తినిద్దామని
ప్రతి క్షణం నన్ను నేనే ప్రేరణ చేసుకుని
ఆఖరి శ్వాస వరకూ ....జీవిస్తాను

అప్పుడు విజయ గర్వంతో నీ దరి జేరుతాను
మళ్ళీ నీ కళ్ళల్లో ఆనందపు పువ్వులు పూయిస్తాను
ఇది నా వాగ్దానం కాదు
జీవిత ధ్యానం !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి