పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, సెప్టెంబర్ 2012, గురువారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || రాయినే, పరాయిని కాను

రాయినని పరాయిగా చూడకు
నువ్వు కొలిచే దైవానికి రూపమిచ్చింది నేనే

ఉలి దెబ్బల పురిటి నొప్పుల్లో

సౌందర్యమై పుట్టాను నేను
కనువిందు చేసాను నీకు

నువ్వు కట్టిన ఇంటికి

నువ్వు వేసిన దారికి
ఇసుక రేణువునై మారింది నేనే
నీడనిచ్చింది నేనే
నీకు దారి చూపింది నేనే

నేను పుట్టినప్పుడు లేని నువ్వు

నాకు రాగాలు నేర్పకు
నేనెప్పుడో కరిగి పోయాను
నీ గతానికి
నేను బొమ్మనై నిలిచాను

పెను గాలికి జారి నాపై నేనే పడ్డప్పుడు

తగిలిన గాయాన్ని మరిచి
నీకు ' నిప్పు'నిచ్చాను
నీ బ్రతుక్కి వెలుగునిచ్చాను

ఒంటరిని చేసి వేధించినప్పుడు

అందరూ నిన్ను అనిచివేసినప్పుడు
నీ తొలి పోరాటానికి ఆయుధాన్ని నేనే
నీ తొలి ఉద్యమానికి బలగాన్ని నేనే

రాయినని పరాయిగా చూడకు

రాజ్యానికి సరిహద్దు గురుతును నేను
నీకు రక్షణగా నిలబడ్డ
నిలువెత్తు గోడను నేను

06-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి