పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, జూన్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

www.suryaa.com బిందువులో సింధువును దాచుకున్న ‘గజల్‌’ ‘గజల్‌’ తెలుగు కవితాప్రక్రియల మధ్య తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న ఒక మధుర కవితాప్రక్రియ. ‘తఘజ్జల్‌’ అనే అరబ్బీ పదమే ‘గజల్‌’ గా మారిందని చెప్తా రు. వేటగాని బాణపు గురిని తప్పిం చుకోడానికి పరుగుపెడుతున్న లేడిపిల్ల పొదలలో చిక్కుపడి ఇక తప్పించుకునే దారిలేక చివరిగా చేసే ఆర్తనాదమే ‘గజల్‌’ అని అంటారు. అరబ్బీ, పార్శీ దేశాల నుంచి ప్రవహించిన గజల్‌ నది మొఘలాయిల కవితా సౌందర్య పిపాసను తీర్చుతూ ఉర్దూ గులాబీ అత్తరును పులుముకొని సుగంధ కెరటమై తెలుగు తేనె వాకలో సమ్మిళితమౌతున్నది.‘గజల్‌’ పై మనసుపడి మన తెలుగుకు గజల్‌ని పరిచయం చేసిన ఘనత మహాకవి దాశరథిదే. 1966లో తెలుగులో దాశరథి రచించిన తొలి గజల్‌ మత్లా ఇది- ‘రమ్మంటె చాలుగాని రాజ్యాలు విడిచిరానా! నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా!!’ దాశరథి రాసినవి నిజానికి పదకొండు గజళ్ళే అయినా చక్కని గజళ్ళు! ఇక తెలుగులో గజల్‌ ప్రక్రియను సుసంపన్నం చేసిన ఘనత జ్ఞానపీఠాన్నధిరోహించిన డా సి.నారాయణ రెడ్డిది. ఉర్దూలో ఖసీదా, రుబాయత్‌ లాంటి కవితా ప్రక్రియలు ఉన్నా ‘గజల్‌’ ప్రక్రియ ఆకర్షించినంతగా, ఏ ప్రక్రియా సరసహృదయాలను ఉయ్యాలలూపలేకపోయిందనేది నిస్సంశయంగా చెప్పచ్చు! నిజానికి పన్నెండవ శతాబ్దిలో మొఘలారుూల పాలనా కాలంలో అమీర్‌ఖస్రూ భారతదేశంలో గజల్‌ రచన ఆరంభించాడు. fbookకవితా వస్తువు అనేక వైవిధ్యాలకు గురైనా ‘గజల్‌’ అనగానే ‘ప్రేమ’ అనే అర్థం స్థిరపడిపోయింది-అందునా భగ్న ప్రేమ! సామాజికమైన కట్టుబాట్లకు వ్యక్తి కట్టుబడినా, బంధనాలకతీతమైన మనసు ఎప్పుడు ఎవర్ని ఎందుకు ప్రేమిస్తుందో ?! ఆ భావన హృదయపు అరలో దాచుకున్న మొగలి రేకులా పరిమళిస్తూ అపుడపుడూ ముళ్ళను గుచ్చుతూ తీయని వ్యధను రగిలిస్తుంటుంది. ఇటువంటి భావనకి ఏ వ్యక్తీ అతీతం కాదు! సరిగ్గా అటువంటి భావనతో నిండి సుతారంగా హృదయాన్ని కలవరపెట్టే గజల్‌ మోహంలో పడని సాహిత్యకారుడు, రసహృదయుడు ఉండడు! ఇదీ గజల్‌ వస్తువు. గజల్‌ రూపురేఖల విషయానికోస్తే- ఇది మన ‘ద్విపద’ లాంటిదే! ముత్యాల సరంలా మాత్రాఛందస్సుతో కూడినది. రెండ్రెండు వరుసల ఈ కవితాప్రక్రియలో రెండువరసలను కలిపి ‘షేర్‌’ అంటారు. ఇంలాంటి షేర్లు అయిదుకు తక్కువగాకుండా ఎన్నయినా ఉండచ్చు! దాశరథి మరీ ఎక్కువగా 25 షేర్లు రాశారు. అయితే అసమ సంఖ్యలో షేర్లు ఉండాలన్నది ఓ మధురభావనతో పెట్టిన నియమం. అంటే ఐదు, ఏడు, తొమ్మిది లాంటి షేర్లన్నమాట! ఎందుకీ అసమసంఖ్య అంటే ప్రియురాలు అసమానసౌదర్యరాశి కాబట్టి! ఆమె కొరకు రాసే గజల్‌ అసమసంఖ్యలో ఉంచాలని ఉద్దేశం! ఇక్కడ మొదటి షేర్‌ని ‘మత్లా’ అని, చివరి షేర్‌ని ‘మక్తా’ అని అంటారు. మత్లాలోని రెండు పాదాల్లో చివర ఒకే పదం లేదా ఒకే రైమింగ్‌ ఉంటుంది. దానిని ‘రదీఫ్‌’ అంటారు. gbookఈ రదీఫ్‌ పందం మాత్లా కాకుండా మిగిలిన ‘షేర్‌’ లలో రెండవపాదం చివరి పందంగా ఉంటుంది. ప్రతి రదీఫ్‌కి ముందు పదం చివర అంత్యప్రాస ఉంటుంది. దాన్ని ఖాఫియా అంటారు. ‘రదీఫ్‌కి మద్దెల నాదమైతే ఖాఫియానూ పురఝంకారంలాంటిదని’ సదాశివం మాట! ఇక ‘తఖల్లూస్‌’ సాధారణంగా మక్తాలో ఉంటుంది. మాత్రలు ప్రతి షేర్‌లోను సమానంగా ఉండాలి! ఉదాహరణకు ఇరవై మాత్రలు ఒక పాదంలో వస్తే అన్ని పాదాలలోను ఆంతే రావాలి! పాదాలు మరీపొడవైన కొద్దీ ‘గజల్‌’ అందం పోతుంది. ఈ ఖాఫియా రదీఫ్‌ల వల్ల ‘గజల్‌’ శ్రవణపేయంగా గాన యోగ్యంగా అద్బుతంగా ఉంటుంది! ఇక గజల్‌ లోని భావుకత, ఆర్థ్రత, చమత్కారం గజల్‌ జీవనాడి! వీటిని సాధించడం సామాన్య అంశంకాదు! ఈ మధ్యనే రసరాజు ఒక గజల్‌లో ‘ఒక్క గజలు రాయాలని ఎంత చచ్చి బతికానో’ అని రాసుకున్నారు. ఆ మాట వాస్తవం! గజల్‌ ఒక జీవితానుభవం. ఒక మధుర విషాదపేటిక. ఒక అపూర్వాభివ్యక్తి. ఒక ప్రేమవేదం. తన తరుపున వాదించుకునే ప్రేమ వాదం. లేదా మరో కోణంలో ఒక సామాజిక చైతన్యదీపం, మానవతానినాదం. పతనమైపోతున్న సాంస్కృతిక పతాకని నిలబెట్టే ఓ జీవగర్ర! సమాజం అనేక సమస్యలతో సతమతమవుతున్న నేటి తరుణంలో‘ ప్రేమను ప్రస్తావించేవి గజళ్ళు’అని ఈసడించనక్కరలేదు! చిన్నచూపు చూడనక్కరలేదు! సామాజిక సమస్యాపరమైన అంశాలను కూడా బంగా గజల్స్‌లో చెబుతున్నారు... అయితే గుండె గాయం నుండి పుట్టని గజళ్ళు మనసును కదిలించలేవనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన నిజం! ఆరంభంలో భగ్నప్రేమ మాత్రమే వస్తువైన గజళ్ళు అన్ని భాషలలోనూ క్రమక్రమంగా ఇతర అంశాలనూ వస్తువుగా చేసుకున్నాయి. దేశభక్తి, సామాజిక చైతన్యం, భక్తి ఆత్మావిష్కృతి మొదలైనవి, సూఫీభక్తి భావనలు పరోక్షంగా గజల్‌లోనిండి ఉండి ఒకో సందర్భంలో ప్రియుడు ప్రేయసి తోటి చెప్పుకునే వేదన- భక్తుడు భగవంతుడి తోటి చేసుకొనే నివేదనగా స్ఫురిస్తుంది. లౌకికమైన స్త్రీ పురుషుల ప్రేమను ‘మజాజీ’ అని, భగవద్భక్తి తో కూడినదానిని ‘హకీకి’ అని అంటారు. తెలుగులో సాధికారంగా గజల్‌ను గూర్చి మాట్లాడగలిగినవారు ఉర్దూ సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషలలో పండితుడు, ముఖ్యంగా ఉర్దూ గజల్‌ సౌందర్య దర్శనం చేసినవారు డా యస్‌. సదాశివ, అలాగే నోముల సత్యనారాయణ. సదాశివ ఉర్దూ కవితాసౌందర్యం గురించే వ్రాసిన అనేక వ్యాసాలు గజల్‌ ప్రేమికుల మార్గదర్శకాలు. ఉర్దూ భాషలోని మార్ధవం తెలిసిన డా సి. నారాయణరెడ్డి అనేక గజళ్ళను తెలుగులో వ్రాసి ఒక గొప్ప సాహితీ ప్రక్రియకు విస్త్రృత ప్రచారాన్ని కల్పించారు! గజల్‌ శ్రీనివాస్‌ తమ అమర గానంతో సాహితీవేత్తలకు మాత్రమే పరిమితమైన గజల్‌ను సామాన్యుల దాకా తీసుకెళ్ళగలిగినారు! వీరందరి కృషితో ఈ నాడు తెలుగులో గజల్‌ రచన యిప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఉర్దూ గజల్‌ లక్షణాలను, భగ్నప్రేమను కవితా వస్తువుగా తీసుకుని ప్రముఖకవి పెన్నా శివరామకృష్ణ వ్రాసిన ‘సల్లూపం’ గజల్‌ వ్రాయాలనుకునే కవులకు మార్గదర్శకమైన గ్రంథం! సామాజికమైన అంశాలను తీసుకొని గజల్‌ వ్రాస్తున్న కవులలో రెంటాల వెంకటేశ్వరరావు, గజల్‌ శ్రీనివాస్‌, సూరారం శంకర్‌, రసరాజు, తటపర్తి రాజగోపబాల, అద్దేపల్లి రామ్మోహనరావు ఉన్నారు. వీరిలో శంకర్‌ ‘సౌగంధిక’ అనే గజల్‌ కవితాసంపుటిని, తటపర్తి రాజగోపబాల ‘హృదయం చిరునామా’ అనే గజల్‌ కవితా సంపుటిని, అమన్‌ ‘మధుశాల’ను, వెంరాల సుబ్రహ్మణ్యం వెంపరాల గజల్స్‌ను, డా అద్దేపల్లి రామ్మోహనరావు ‘అద్దేపల్లి గజల్స్‌ను’, డా ఎం.బి.డి. శ్యామల ‘సుహృల్లేఖ’ గజల్‌ కవితా సంపుటిని తీసుకువచ్చారు. సరస్వతీమూర్తులు ఉండేల మాలకొండారెడ్డి, ముక్తేవిభారతి మొదలైన ప్రముఖులు ఈ సుకుమార ప్రక్రియపట్ల మక్కువ చూపడం ముదావహం! ఇంకా వర్ధమాన కవులు ద్యాపరి నరేందర్‌ రెడ్డి, ఇందిర, రాజేష్‌, పెద్దలు కాసోజు లక్ష్మీనారాయణ, పాలపర్తి శ్రీధర్‌, రేగులపాటి కిషన్‌రావు, మాధవరావు గజల్‌ ప్రక్రియను సుసంపన్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా డా సదాశివ- పెన్నా ‘సల్లాపం’ గజల్‌ గ్రంథానికి రాసిన ముందు మాటను ఓసారి ప్రస్తావించుకొవాలి. ‘తెలుగు గజళ్ళు రాసే వాళ్ళకొక మనవి- ‘ఖాఫియారదీపులు కుదిరెనా మంచిదే! కుదరకపోతే తంటాలు పడనవసరంలేదు, మన సంప్రదాయం ప్రకారం అంత్యప్రాసలతో అలరించినా సరిపోతుంది. ఉర్దూ గజళ్ళు రాసే కొందరు మహాకవులకే ఖాఫియాలు దొరకవు. మాత్రల కూర్పు సరిగావుంటే చదివేవారికి సౌకర్యం... వినేవారికి ఆనందం’ అన్నారు! అంతమాత్రం చేత ఖాఫియా రదీపులు పాటించవద్దనికాదు! అవి పాటిస్తే వాటి అందమే వేరు! గజల్‌కు లయాత్మకత ముఖ్యం! తిస్రచతురస్ర ఖండగతులతో లయబద్ధంగా నడిచే తూగు గజల్‌లో ఉండాలి! అపడే గజల్‌ గానయోగ్యమవుతుంది!’ మాత్రలను మీటర్లను రదీఫ్‌ ఖాఫియాలను పేర్చి తయారు చేసినంత మాత్రాన అది ‘గజల్‌’ కాదు! నిజానికి గజల్‌ ఆంటే ఏంటో మనకు తెలియాలంటే మన ప్రసిద్ధ కవువులు ఎవరెవరు గజల్‌ని ఏమన్నారో తెలుసుకోవడం అవసరం. ‘గజల్‌ వ్రాయడమంటే రవ్వను చెక్కడం లాంటిది, బిందువులో సింధువుని కుదించడం లాంటిది’ అని దాశరథి, ‘సరసభావన, చమత్కార ఖేలన, ఇంపూ కుదింపు గజల్‌ జీవలక్షణాలు’ అని డా సి.నారాయణరెడ్డి అన్నారు! ‘ఉర్దూకవిత్వాన్ని ఇప్పటికి రసరమ్యంగా శృతిపేయంగా భావుక జనాహ్లాదకరంగా, సహృదయ హృదయరంజకంగా పఠితలను, శ్రోతలను భావాంబర వీధిలో విహరింపజేస్తూ పరవశింప జేసేది ఖసీదాకాదు, మస్నవీకాదు, ఖవ్వాలీ కాదు, నంజం కాదు మరేమిటి అంటే- ఖచ్చితంగా అది గజలే!’ అని సదాశివ, ‘గజల్‌ అంతగా సహృదయుల మనస్సులను సమ్మోహితం చేసిన కవితారూపం మరొకటి లేదు’ అని నోముల సత్యనారాయణ అన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ గజల్‌ గురించే చెప్పిన ప్రత్యక్షరసత్యం పరమ సుందరం! ‘గజల్‌ చేతిలోకి వచ్చివాలిన ఒక రంగుల పక్షి, రెండు రెక్కలు, ఒక గొంతు, ఇంతే దాని సంపదంతా కలిపి! ఎవరైనా ఒక పక్షిని చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది! దాని పిడికెడు శరీరమంతా ఒక గుండె అయి స్పందిస్తుంటుందని, దాని చంచల నేత్రాలు దిశలు చూస్తూ ఉంటాయి! పొదివి ముద్దు పెట్టుకుందామన్పిస్తుంది! ఆకాశంలో విడిచిపెదడామనిపిస్తుంది! గజల్‌ అంత నాజూకు జీవి! దానికన్నవాడు ఎంత దుఃఖం మోసి కన్నాడో- మనసున్నవాడికే తెలుస్తుంది’. ‘శరీరమంతా గుండై కొట్టుకునే వెచ్చని ఆ పక్షి గుండె స్పందనే గజల్‌’ అన్న ఈ భావన అద్భుతం! పెన్నా గజల్‌ ఆత్మను ఒకింత భావుకతతో అందంగా ఆవిష్కరించారు. గజల్‌ అంటే ‘ముల్లుకాటుకు వేలుమీద వికసించిన చిన్ని గులాబీని వాడకుండా కన్నీరు చిలకరిస్తూ కాపాడుకోవడం! బలవన్మరణం పాలౌతున్న జీవన లాలస కార్చిన చివరి కన్నీటి బిందువు, లౌకిక వ్యాపకాల వ్యామోహాల పరుగులో ఏదో గుర్తొచ్చినట్లు హఠాత్తుగా వెనుదిరిగి చూడడం, జ్ఞానాన్ని అజ్ఞానంగా, ఆజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమింపచేస్తున్న లోకాన్ని అందంగా వెక్కిరించడం!’. బహుశ గజల్‌ గురించీ ఇంతకన్నా ఎవరే చెప్పలేరనుకుంటాను. ఇదంతా ఎందుకంటే గజల్‌ వ్రాయాలనుకేవాళ్ళు దాని ఆత్మను పట్టుకోవాలి! పైపై భావాల డొల్లతనంతో తేలిపోయే పదాలను పేర్చడం గజల్‌ కాదు! అంశమేదైనా మనిషిని కదిలించే ఆర్థ్రత ముఖ్యం! ఉదాహరణకు పెన్నా గజల్‌ లోని ఒక మత్లా- ‘ఆవారా గాలి ఆటలాడుతూనే ఉన్నది/ ప్రతి వెదురూ గుండె పగిలి పాడుతూనే ఉన్నది’ ‘ఆవారా’ అనే ఉర్దూ పదం వల్ల ఇక్కడ మనం కోరుకున్న అర్థం బలియంగా వ్యక్తమవుతోంది! అల్లరి చిల్లరి గాలి ఆటలాడుతూనే ఉంది. దానికి ప్రతిగా ప్రతి వెదురూ గుండె పగిలి పాడుతూనే ఉన్నది- అనేది ఎంత గొప్ప భావన! ఈ అభివ్యక్తిని సమాజంలోని అనేకాంశాలకు అన్వయించుకోవచ్చు! ధనికుల ఆటకు బలైన నిరుపేదలు కావచ్చు, లేదా ఆకతాయి ఆటకు బలైన ఓ అబల కావచ్చు! ఇలా ఎన్నైనా ఊహించవచ్చు! బిందువులో సింధువుని ఇమడ్చడం అంటే ఇదే! అభివ్యక్తిలో బలం ఉండాలి. భావంలో ఔన్నత్యం ఉండాలి. పదాలలో లాలిత్యం ఉండాలి. సూరారం శంకర ‘సౌగంధిక’ లోని ‘మత్లా’ ఇది! ‘ఒకే చూపు! వేలపున్నములు... ఎలా నిన్ను చూసేది? ఒకే పాట ! వేల భావనలు... ఎలా నిన్ను పాడేది ?’పై మత్లాలో ప్రియుడు ప్రేయసితో అనడం ఒక లౌకిక భావన అయితే, భగవంతుని గూర్చిన భావన అంతర్లీనంగా దాగుంది. నిజానికి వేల పున్నముల కాంతి... వేవభావనల మూర్తి భగవంతునిదే కదా! నాకున్నది ఒకే దృష్టి! వేలపున్నమి వెన్నెలల కాంతిని చూడగలనా? నే పాడగలిగేదొకే పాట! వేల భావనల కలుగుపైన నిన్ను పాడగలనా?! అనేది బలమైన అభివ్యక్తి! చెప్పే అంశం ఏదన్నది కాదు ముఖ్యం, ఎంత అందంగా ఎంత సుతారంగా ఎంత హృదయావర్ణకంగా చెప్పగలిగామన్నదే ముఖ్యం! డా రెంటాల ఈ గజల్‌లో వస్తువు ప్రకృతి సౌందర్యంలో ఒక భాగమైన గోదావరి నదీ సౌందర్యం! కానీ ఆంత చిన్న గజల్‌లో ఎంత వెన్నెల ఒలికించారో చూడండి! ‘పాపికొండల నోట పలికిన పాట గోదావరి/ పారుతున్నది వెన్నెలై రుూపూట గోదారి/ రెప్పలను తెరచాపలెత్తి కంటి పడవను మెత్తగా/ నడుపుతున్నది వింతగా రుూ పూట గోదారి’ ఈ ఊహాశక్తి ఎంత బలీయంగా ఉందంటే- సాధారాణ పాఠకుడు సైతం కళ్ళముందు ఈ చిత్రాన్ని దృశ్యీకరించుకోగలడు! రెప్పలపు తెరచాపలుగా కంటిని పడవగా చెప్తూ- తన సౌదర్య కెరటాలపై ఆ కంటి పడవను నడిపే ఒయ్యారి ఎవరో కాదు గోదావరే అని చెప్పడం ఎంతో బాగుంది. అన్ని విధాల అంటే భౌతిక ఆత్మిక సౌందర్యాలతో, అన్ని షేర్లు సమ మాత్రాకంతో, కవినామ ముద్ర (తఖల్లూస్‌)తో కూడుకున్న మృదయాన్ని కదిలించే ఒక మంచి గజల్‌‌‌లో గజల్‌ లక్షణాలను చూద్దాం! మత్లా : దూరాలు పెంచె వెలుగు కంటే తిమిరమే ఎంతో నయం/ హృదయాన్ని కోసే మాట కంటే మౌనమే ఎంతో నయం/ షేర్‌: మమకారమును రుచి చూపి ప్రేయసి పయనమైనది ఎచటికో/ మోహాన్ని పెంచే ముద్దు కంటే గాయమే ఎంతో నయం మక్తా: ఏ మందు లేనిది ప్రేమ జబ్బని తెలిసే పెన్నా నేటికి/ లోలోన కాల్చే ప్రేమ కంటే మరణమే ఎంతో నయం. ఈ గజల్‌లో ఒక షేరే ఉదహరించడం జరిగింది. మత్లాకి మక్తాకి మధ్యలో అటువంటి షేర్లు నాలుగయిదు దాకా ఉంటాయి. రదీఫ్‌ పదం ‘ఎంతో నయం’ అనేది ‘మత్లా’ రెండు పాదాల్లోనూ మిగిలిన షేర్లలో రెండవ పాదం చివర వచ్చింది! ఇక ఖాఫియా ‘మే’ అనే అక్షరం. వీటిని ‘రవీ’ అంటారు. సహాంత్యప్రాస పదాలు తిమిరమే, మౌనమే గాయమే మరణమే అనేవి! ఈ గజల్‌లో ప్రతిపాదం ఇరవై ఎనిమిది మాత్రలతో ఉన్నది. ‘మక్తా’లో కవి నామముద్ర తఖల్లూస్‌ ‘పెన్నా’ అనేది ఉంది! ఇక భావం ఎంత హృదయంగమమో సహృదయ హృదయైక వేద్యం! పారశీ ఉర్దూ కవులు తమ గుండెను పిండి పెద్ద చేసిన ఈ గజల్‌ పూదోట తెలుగు కవుల ఆదరణతో మరింత సరస సుందరారామంగా మారాలని, అనేక మంది ప్రతిభావంతులైన తెలుగు కవులు మనసారా రుూ ప్రక్రియను చేపట్టాన్నదే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం! రాయప్రోలు, ఆదిభట్ల నారాయణదాసు, దువ్వూరి, బూర్గుల రామకృష్ణారావు వంటి అనేకమంది ప్రముఖ సాహితీవేత్తలు ఉర్దూ గజల్‌ పరిమళానికి సోలిపోయి, పారశీ ఉర్దూ గజళ్ళను, తేటగీతులుగా ద్విపదలుగా, ఆటవెలదులుగా, తెలుగులోకి ఆనువందించారు. సమాజం అనేక సమస్యలతో సతమతమవుతున్న నేటి తరుణంలో‘ ప్రేమను ప్రస్తావించేవి గజళ్ళు’అని ఈసడించనక్కరలేదు! చిన్నచూపు చూడనక్కరలేదు! సామాజిక సమస్యాపరమైన అంశాలను కూడా బంగా గజల్స్‌లో చెప్తున్నారు. arachaitha‘గజల్‌ ప్రేమ ప్రపంచంలోంచి ప్రపంచ ప్రేమలో పడింది’ అని సి.నా.రె. చెప్పడమే గాక తమ గజళ్ళను సామాజికాంశాలతో వ్రాశారు! అయితే గుండె గాయం నుండి పుట్టని గజళ్ళు మనసును కదిలించలేవనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన నిజం! చివరిగా గణేశ్‌ బిహారీ తర్జ్‌ వ్రాసిన ఒక్క షేర్‌:‘దోహే రుబాయి నజ్మ్‌ కభీ తరథే మగర్‌/ అస్నాఫె షాయిరీ కా ఖుదా బన్‌ గరుూ గజల్‌’ (సాహితీ ప్రక్రియలెన్నో ఉన్నాయి. అయినా ‘గజల్‌’ ఆ ప్రక్రియలకన్నింటికీ ఈశ్వరుని స్థానం పొందింది).

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://www.suryaa.com/

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి