పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మే 2014, సోమవారం

బాలసుధాకర్ మౌళి కవిత

ఈ పొద్దున్నే లేవగానే వొక అద్భుతమైన కవిత చదివాను. వస్తువు గానీ, అభివ్యక్తి గానీ విష్మయం కలిగించేటట్టు - మరీ యింత కొత్తగా, యింత విన్నూత్నంగా కవిత్వాన్ని సృజించొచ్చా ! ఆశ్చర్యానందం ! కవిత చదువుతున్నాను - అది మనసు మీద వేసిన అనుభూతి పొరలను ఆలోచనా స్పర్శతో విప్పుకుంటూ విప్పుకుంటూ - కవితా శీర్షిక వైపు 'మళ్లొక్కసారి వెనక్కి, మళ్లొక్కసారి వెనక్కి' - అంటూ తలతిప్పుకోకుండా వుండలేకపోయాను. ఆలోచననను రేకిత్తించే స్వభావమే - కారణం. ఈ కవిత ఆకలి కేంద్రీకృతంగా నిర్మించబడినా - లోలోన రగులుకుంటున్న వొక ప్రవాసవేదన, ఆ దుఃఖం నేపథ్యంగా లేకుండా ఈ కవిత యిలా రాకపోవచ్చు. ఈ కవితకు ఎత్తుగడ ప్రాణభూతమైంది - కవితను, కవిత చదివే పాఠకుణ్ణి లోలోపకు లాక్కునేటట్టు - వొక అయాస్కాంత తరంగం ఆవరిస్తూ ! కవి యిక్కడో మాట అనేసి పోయాడు. ఏం లేదు వొక మాట.. వొక పదునైన మాట ! ఏ మానసిక అలజడి కేంద్రం నుంచో ! ఏ ఆకలి సముద్రాల తీవ్ర సుడిగుండాల ప్రవాహఉధృతి నుంచో ! ? ? కవి : అఫ్సర్ నోరు, చెయ్యి అను ఆ రెండు దేశాలు ----------------------------------------- దూరాల మాటే కదా అనుకుంటున్నదిప్పుడు నోరూ చెయ్యి - ఈ రెండు దేశాల మధ్య దూరాన్ని దేనితో కొలవాలో ఎవరూ ఇంకా చెప్పలేదు పోనీ, ఏదయినా వొక కొలమానం కనిపెట్టి, ఈ దూరాల లెక్క అయినా తేల్చలేదు ! 1 నోరు దీంట్లో మన్నుపడ ! దీని నోట్లో ఎన్ని భూఖండాలూ ఎన్ని సముద్రాలూ ఎన్ని శూన్యాలూ ఎన్ని ఆకాశాలూ ఎన్ని సూర్యగోళాలూ, అన్నీ గప్ చూప్ లే ! దాగుడు మూతా దండా కోర్ లే ! అన్నీ పెదాల దాకా వచ్చి సర్వసమాధి అయిపోతాయి చెయ్యి దీన్ని తుంచి పొయ్యిలో పెట్ట ! ఇది ఎన్ని చేస్తుంది ? కత్తులు పట్టీ, కటార్లు తిప్పీ, గొంతులు కోసీ, కడుపులో ఇంకా కన్ను కూడా తెరవని ఆడ పిండాల్ని నొక్కీ, నిలుచున్న పణాన నిలువెత్తు మనిషిని శవాన్ని చేసీ, అయినా... దీని వేళ్లు ఎంతకీ నోటి దాకా వెళ్లవే ! 2 దూరాల లెక్కే కదా అందరూ అడిగేది ఈ దూరాల్ని చెరిపెయ్యాలనే కదా ఎల్లరూ భూమ్యాకాశాలు కలపెట్టేది చెయ్యి వొక దేశం నోరు వొక దేశం నువ్వూ నేనూ శరీరఖండాలం ఇంకా తెగిపోతాం సరిహద్దులు తెంపి పోతాం వొకే వొక అన్నం మెతుకు నీ, నా వునికి ! మిన్ను విరిగి మీదనే పడనీ భూమి బద్దలయితే బద్దలవ్వనీ - మరి, ఆ క లి ! ( వివిధ - 19 మే 2014 )

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mKXjOy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి