పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Yasaswi Sateesh కవిత

యశస్వి|| జయ ఉగాదితో.. మాటా-మంతీ|| {జయ నామ సంవత్సర ఉగాది సందర్భంగా దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్ నిర్వహించిన కవిసమ్మేళనం లో చదివిన కవిత: నిన్న ప్రసారమైంది..} || జయ ఉగాదితో.. మాటా-మంతీ|| ** రా జయా! రా!! ఇదేనా రావడం? ఎక్కడ్నించీ రాక? అమెరికా నించేనా!! అక్కడంతా కులాసాయేనా! ఏడేళ్ళైందన్న మాటేగానీ.. సర్వధారికొట్టిన ఆర్ధికమాంద్యం దెబ్బకి మా గూబలు.. ఇంకా గుయ్యమంటున్నాయబ్బా! అందుకే అడుగుతున్నా!! ఈ మధ్య తెలుగుదనమంతా ప్రవాసంలోనే నివాసమటగా!! మంచినీళ్లేమైనా తాగుతావా! మినరల్ వాటరేలే!! ఇంకా ఆ నీళ్ళ గొడవలు మొదలు కాలేదిక్కడ ముందొచ్చిన విజయ పాత డైరీ పట్టుకుని మాపటివేళే ప్రయాణం కట్టింది వెళ్తూ- వెళ్తూ మా అన్నదమ్ముల మధ్య పంపకాల పని పెట్టింది నీకేమైనా దారిలో ఎదురై మంచీ-చెడు చెప్పిందా ఏమిటి!! నిరుడు కల్పించిన ఆశలన్నీ ఇక్కడే వదిలి పెట్టింది డబ్బున్న బిడ్డనే గెలిపించాలని ఊరూరూ యాత్ర చేపట్టింది కబుర్లు.. ఎవరితో పంచుకోవాలో తెలియక ఇప్పటిదాకా ఎదురుచూసాను జరిగినయవి కొన్ని నేను చెబుతాను జరగాల్సినవి నువ్వే చెప్పాలి. ** సాగి ఆగిన ఉద్యమాలన్నిటిలోనూ కాలం కాళ్ళుచాచి ఇరుక్కుంది ప్రజా సమస్యలు పట్టని ప్రస్థానాలు, ఎవరికోసమో తెలియని యాత్రలతో జన జీవితానికి తిక్కెక్కింది ఎన్నిసార్లు బందులు జరిగాయో! ఎన్ని బతుకులు నలిగాయో! చెప్పేదెవరా!! అనిచూస్తే.. గట్టి లెక్కల శకుంతలక్కయ్య కాలం చేసిందని తెలిసింది అరమరికలు అవసరమయ్యాక తెలుగునేల నలిగింది విజయానికి మొహం వాచి ‘పేరుగొప్ప’గా మిగిలింది ఎక్కడైనా తన పేరు మనిషితో నిలబడాలని ‘విజయ’ తన ముద్ర కనపడాలని ‘ఆమ్ ఆద్మీ’కి చీపురిచ్చి ఢిల్లీ దర్బారుకి పనికి పంపించింది వాడేమో కమలాన్ని తెంపలేక, కళ్ళాపు జల్లిన చేతి వాసన పడక నగరవీధుల్లో లొల్లి చేసి పోయాడు అవినీతి అన్నింటా అంటకాగిఉన్నప్పుడు ఏ ఇంట ఉండాలని మామిడిపళ్ళ మనిషిలా అరచిపోయాడు ఓదినం.. పేపరు చదువుతుంటే పసిపిల్లల మరణాలలో ప్రధమ స్థానం మనదేశానిదేనని తెలిసిందట ఇదేమి శివా! అని కేదార్నాధుడ్ని అడగబోయింది వసువుల్ని ముంచిన గంగమ్మకు ఉక్రోషం వచ్చినట్టుంది అప్పట్నించి మీ అక్క చావుల్నీ లెక్కెట్టలేకపోయింది టీవీ చూస్తేనే తెలిసింది తెలుగునేలలోనే కాదు.. టర్కీలోనూ ప్రజా ఉద్యమం పతాకస్థాయికి చేరిందని అసలు కధ వేరని నాణెం రెండోవైపు చూపించబోయినా విజయవిలాసం అప్పటికే ఖరారైపోయింది అన్నట్టు టెలిగ్రాం అందిందా నీకు.. నువ్వొచ్చేదాక ఆగలేక పంపాను ముందే ఓ పెద్ద నిజం పంచుకుందామని ప్రపంచంలో అతిశక్తిమంతుల జాబితాలో మన ప్రధాని కూడా ఉన్నారని. నీ అడ్రెస్ తెలియక బట్వాడా చేయమని రేస్ కోర్స్ రోడ్డులో ఏడో నెంబరు ఇంటికి పంపా. తర్వాత ఆ సర్వీసే రద్దయ్యింది అప్పుడు అర్థమయ్యింది జాబితా నిజమే చెప్పిందని జీవితమే అబద్దాలాడుతుందని బయటోళ్ళకు ఉన్న గౌరవం లోపల వారికి ఉండదని బ్రిటన్ ప్రభుత్వం మాత్రమే ఉమ్మడాన్ని తీవ్రనేరంగా నిర్ణయించిందని తల్లీ! ఈ మధ్య..లోకం చాల మారిపోయింది అన్నదమ్ములకు అభిప్రాయ భేదాలొస్తే ఇల్లు ముక్కలైపోయిందంటున్నారు పంపకాలు జరగకుండానే కుంపట్లు కొనుక్కుంటున్నారు చెవిలో ఇల్లుకట్టుకునే పుకార్ల హోరు దేశ మంతా వినపడుతుంది. భూతద్దంలో దొరకలేనిదేదో టీవీ ఛానళ్ళలో కనపడుతుంది మొన్నీ మధ్య ప్రజా ప్రభుత్వం రద్దయినప్పుడు పాతరోజులు గుర్తుకు తెచ్చావు అరవై ఏళ్ళ నాటి మాట ఆంధ్రకేసరినే ఒక్కఓటుతో ఓడించావని రాష్ట్రపతిపాలన మొదటి సారి రుచి చూపించావని.. * లోకమంతా ఎన్నికల కోడై కూస్తుంటే.. ఇప్పుడే లేచి ఇలా కుర్చున్నాను ఇంతలో నువ్వొచ్చావు.. చెప్పు.. నువ్వేం కబుర్లు మోసుకొచ్చావు? ** మన సిధ్ధాంతి గారికి తెలుసో-లేదో ప్రజానాయకుల యోగ కరణాలు ఏ చారుదత్తుడ్ని ఇక్కట్లపాలు చేస్తుందో ఈ జయవసంతసేన విన్యాసాలు యజమానుల జెండాకు లోబడే.. వార్తాఛానళ్ళ వంశోత్తర దశల ప్రసారాలు! పంచాంగ శ్రవణాలలో తారుమారై వినిపిస్తున్నాయి రాజపూజ్య- అవమానాలు సామాన్యుడ్ని అందలమెక్కిస్తానంటూ అందరూ అబద్దాలే వినిపిస్తున్నారు తీపి కబురు చెబుతానంటూ ప్రతిసారీ చేదే తినిపిస్తున్నారు ఏ సంవత్సరమైనా .. ఇంతేనా అని అన్నిసార్లూ అనిపిస్తున్నారు కొత్తగా వచ్చావని కోటి కోర్కెలు కోరను నేను షడ్రుచుల వశంకాని సుఖ సంతోషాలు కలగలిపిన కమ్మని జీవితం కోసం ఎదురు చూపులు చూస్తున్నాను మీ తమ్ముడు మన్మధుడొచ్చి* మాయ చేసేలోగా మంచిరోజులు ఆశిస్తున్నాను చెప్పు.. నీ సంచుల నిండా ఏం మోసుకొచ్చావు? ఎవరికందించి వడ్డిస్తావు!! సీలుతీయని ప్రేమలేఖలా ఇలా ఎన్నిరోజులు ఊరిస్తావు చెప్పు.. నీ సంచుల నిండా ఏం మోసుకొచ్చావు? ఎవరికందించి వడ్డిస్తావు!! =1.4.2014=

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fJfi1s

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి