పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మార్చి 2014, శుక్రవారం

Abd Wahed కవిత

గాలిబ్ కవితల్లో ఈ రోజు మొదటి కవిత గాలిబ్ సంకలనంలోని 10వ గజల్లో 7వ షేర్ ఉగా హై ఘర్ మేం హర్ సూ సబ్జా వీరానీ తమాషా కర్ మదార్ అబ్ ఖోద్నే పర్ ఘాస్ కే, హై మేరే దర్బాం కా ఇంట ఎటుచూసినా గడ్డిగాదాల నిర్మానుష్య దృశ్యం కావలి వాని పని కలుపును తీయడమే ఇప్పుడు ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఉగా అంటే మొలకెత్తడం, హర్సూ అంటే అన్నివైపులా, సబ్జా అంటే గడ్డిగాదం, కలుపుమొక్కలు, వీరానీ అంటే మానవసంచారం లేకపోవడం, మదార్ అంటే ఆధారం, దారో మదార్ అన్న పదబంధాన్ని ఎక్కువగా వాడుతుంటారు, అంటే అర్ధం ఆధారమని. ఆమాల్ కా దారోమదార్ నియ్యత్ పర్ హై అంటే ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయని భావం. దర్బాం అంటే కావలి వాడు, వాచ్ మేన్. ఒక నిరాశకరమైన పరిస్థితిని కాస్త హాస్యం, మరికాస్త వ్యంగ్యం జోడించి ఈ కవితలో గాలిబ్ చెప్పాడు. తన పతనావస్థనే గాలిబ్ ఇందులో వర్ణించాడు. చదివిన వారికి బాధతో పాటు నవ్వు కూడా వస్తుంది. గాలిబ్ తన ధనసంపదలన్నీ ప్రేయసి మోజులో ఖర్చుపెట్టేశాడు. తన ప్రేయసి సంతోషం తప్ప మరి దేన్నీ ఆయన లక్ష్యపెట్టలేదు. ఒకప్పుడు ఆయన ఇల్లు ఒక మహలులా ఎంతో అందంగా, ఆడంబరంగా ఉండేది. కాని ఆయన ప్రేమలో పడి ఏదీ లక్ష్యపెట్టనందువల్ల ఇంటిపై శ్రద్ధ పెట్టలేదు. శుభ్రం చేసేవారు లేరు. ఇంట్లో ఎటుచూసినా గడ్డిమొక్కలు, కలుపుమొక్కలతో అడవిలా తయారైంది. గాలిబ్ ఇంటికి ఒక వాచ్ మేన్, ఒక నమ్మిన బంటు ఉన్నాడు. ఒకప్పుడు ఈ నమ్మినబంటు ఆయన ఇంటి రక్షణ చూసేవాడు. కాని ఇప్పుడు ఆ నౌకరు పని కలుపుమొక్కలు పెరకడంగా మారింది. ఎందుకంటే ఇంట్లో విలువైన వస్తువులేవీ మిగల్లేదు. కాబట్టి ఇంట్లో దొంగలు పడే ప్రమాదం లేదు. గడ్డిమొక్కలు ఇంటిని ఆక్రమించుకునే ప్రమాదాన్ని అరికట్టడమే నౌకరు పనిగా మారింది. ఈ కవితలో చమత్కారమేమంటే, తన ఇంటికి అవాంఛనీయ వ్యక్తులు ఎవరు రాకుండా కాపాడ్డానికి గాలిబ్ నియమించుకున్న నౌకరు ఇప్పుడు అవాంఛనీయ మొక్కలు పెరక్కుండా చూసుకుంటున్నాడు. మనుష్యులు ఎలాగూ అక్కడికి రావడం లేదు. ఉర్దూలో కలుపుమొక్కలను సబ్జ యే బేగానా అంటారు. సబ్జ అంటే పచ్చదనం అన్న అర్ధం ఉంది. నిర్మానుష్య ప్రదేశంగా తన ఇంటిని వర్ణించడం ద్వారా కూడా గాలిబ్ తన ఉనికి కూడా లేదన్న భావాన్ని ప్రకటించాడు. ఈ కవిత విఫల ప్రేమను ప్రకటించే కవిత అయినప్పటికీ ఇందులోని సున్నితమైన వ్యంగ్యం వల్ల భిన్నమైన సందర్భాల్లో కూడా అన్వయించే కవితగా మారింది. ఉదాహరణకు, ఏదన్నా వ్యాపారం చాలా బాగా నడుస్తున్నప్పుడు సందడిగా కళకళలాడుతూ ఉంటుంది. అందరూ పనిలో బిజీగా ఉంటారు. కాని అదే వ్యాపారం దెబ్బతిని, సందడి లేక కళావిహీనమైనప్పడు, పాత వస్తువులనే అటూ యిటూ సర్దుతూ గడపడం జరుగుతుంది. ఇలాంటి అనేక సందర్భాల్లో వచ్చేపోయే వారు ఎవరు లేకపోయినా, పెరిగిన గడ్డిగాదాన్ని తొలగించే పని ఉందికదా అనుకోవడం లాంటిది ఈ కవిత. గాలిబ్ కవితల్లో ఉన్న ప్రత్యేకత ఇదే. విభిన్న సందర్భాలకు అతికినట్లు ఈ కవితలను కోట్ చేయవచ్చు. ఈ రోజు గాలిబ్ కవితల్లో రెండవ కవిత, గాలిబ్ సంకలనం 10వ గజల్లోని 9వ కవిత హనూజ్ ఏక్ పర్తూ యే నక్షె ఖయాలె యార్ బాకీ హై దిలె అఫ్సుర్దా గోయా హుజ్రా హై యూసుఫ్ కే జిందా కా ఇప్పుడు ప్రేయసి ఆలోచనల నీడల చిహ్నమే మిగిలింది యూసుఫ్ ను నిర్భందించిన జైలులా.. భగ్న హృదయమా.. ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. హనూజ్ అంటే ఇప్పటి వరకు లేదా ఇప్పుడు అని అర్ధం. పర్తూ అంటే నీడ, నక్ష్ అంటే చిత్రం, ఖయాలె యార్ అంటే ప్రేయసి ఆలోచన, దిలె అఫ్సుర్దా అంటే నిరాశపడిన, లేదా భగ్నపడిన హృదయం. గోయా అన్నది పోలిక చెప్పడానికి ఉపయోగించిన పదం. హుజ్రా అంటే జైలు గది, జిందాం అంటే జైలు. ఈ కవితలో గాలిబ్ విఫల ప్రేమికుడిని వర్ణించాడు. ఆ ప్రేమికుడు మరెవరో కాదు తానే. ప్రేయసి జ్ఙాపకాలతో, ప్రేయసి మాటలతో ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు. కాని ప్రేయసి అతడిని తిరస్కరించింది. గాలిబ్ హృదయం వక్కలయ్యింది. భగ్న హృదయమా అంటూ సంబోధిస్తూ, ఇక తన హృదయంలో తీయని జ్ఙాపకాలు కూడా మిగల్లేదని, కేవలం ఆ జ్ఙాపకాల నీడల చిత్రం మాత్రమే మిగిలిందంటున్నాడు. అంటే జ్ఙాపకాలు వదిలి వెళ్ళినా గాలిబ్ మాత్రం మరిచిపోడానికి సిద్ధంగా లేడు. ఈ కవితలో గాలిబ్ దివ్యఖుర్ ఆన్ లో యూసుఫ్ ప్రవక్త (జోసెఫ్) జైలు కధను ప్రస్తావించాడు. యూసుఫ్ అసాధారణమైన అందగాడు. ఆయన్ను రాజుభార్య జులేఖా మోహించింది. కాని యూసుఫ్ దైవభీతితో ఆమె కోరికను తిరస్కరించాడు. మహారాణి జులేఖా ఆగ్రహంతో యూసుఫ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. రాజు కోపంతో మండిపడి యూసుఫ్ ను కారాగారంలో పడేశాడు. చీకటి కొట్టం లాంటి ఆ కారాగారం కూడా యూసుఫ్ అద్భుత సౌందర్యం వల్ల దేదిప్యమైన కాంతితో వెలిగిపోయింది. యూసుఫ్ ను ఆ కారాగారం నుంచి విడుదల చేసిన తర్వాత కూడా ఆ కాంతి అలాగే ఉందంట. ఎందుకంటే యూసుఫ్ నీడ ఒక చిత్రంగా అక్కడే ఉన్నందువల్ల ఆ కారాగారం ప్రకాశించేదట. ఇక్కడ గాలిబ్ తన ప్రేయసిని అలాంటి అద్భుత సౌందర్యరాశిగా వర్ణిస్తున్నాడు. తన హృదయం యూసుఫ్ ప్రవక్తను బంధించిన కారాగారం లాంటిదని, అందులో నుంచి ప్రేయసి ఆలోచనల నీడలు కూడా వెళ్ళిపోయినా, వాటి చిహ్నాల వల్ల ప్రకాశవంతంగా తన హృదయం వెలుగుతుందని పోల్చాడు. తన హృదయాన్ని యూసుఫ్ ను బంధించిన కారాగారంగాను, తన ప్రేయసి జ్ఙాపకాన్ని యూసుఫ్ వంటి అద్భుత సౌందర్యంతో కూడిన భావంగాను పోల్చడం ద్వారా తన ప్రేమకు పవిత్రతను ఆపాదించడం కూడా ఇందులో కనబడుతుంది. ఈ కవితను మరోకోణంతో చూస్తే, దేవుని పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి దైవాదేశాలను పాటిస్తూ జీవితాన్ని గడుపుతాడు. కాని, దైవాదేశాలను అతిక్రమించడం అంటే దేవుని ప్రేమను కోల్పోవడమే. కాని దేవుని ప్రేమ ఎంత ప్రకాశవంతమైనంటే, హృదయం నుంచి ఆ ప్రేమ తాలూకు నీడ కూడా నిష్క్రమించినా, దాని చిహ్నాలు ప్రకాశవంతంగా గుండెను తేజోవంతం చేస్తూనే ఉంటాయి. దాన్ని గుర్తించి మళ్ళీ ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేయాలన్న భావం కూడా ఇందులో ఉంది. ఈ రోజు మూడవ కవిత గాలిబ్ సంకలనంలోని 10వ గజల్లో 12వ షేర్ నజర్ మేం హై హమారీ జాదా యే రాహె ఫనా గాలిబ్ కె యే షీరాజా హై ఆలమ్ కే అజ్ జా యే పరేషాం కా వినాశమార్గం పై నా దృష్టి కేంద్రీకరించే ఉన్నాను చిందరవందరైన ప్రపంచభాగాలను కలిపే సూత్రం ఇదే కదా ఉర్దూ పదాలను చూద్దాం. జాదా అంటే మార్గం, బాట, రాహె యే ఫనా అంటే వినాశం వైపు వెళ్ళే దారి, షీరాజా అంటే పుస్తకంలో పేజీలను కలిపి కుట్టే దారం, జుజ్ అంటే ఒక భాగం దీనికి బహువచనం అజ్ జా అంటే అనేక భాగాలు. ఫరేషాం అంటే సాధారణంగా ఆందోళన, బాధలను సూచిస్తూ వాడుతాం, కాని పరేషాం అంటే చిందరవందరై పోవడం అని అర్ధం. ఆలమ్ అంటే ప్రపంచం. ఈ కవిత తాత్విక చింతన ప్రకటించే కవిత. వినాశానికి వెళ్ళే మార్గాన్ని తన చూపులు ఎన్నడూ మరిచిపోలేదు. ఆ మార్గంపైనే ఆయన దృష్టి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతిభాగం వినాశపథానే పయనిస్తోంది. అన్ని భాగాలను కలిపే సూత్రం అదే. చివరకు అన్నీ మూలంతో కలిసిపోవలసిందే. ప్రపంచంలోని ప్రతిదీ, ప్రతివస్తువు, అది స్వతహాగా విభిన్నమైనదైనా, విశిష్టమైనదైనా ఎలాంటిదైనా చివరకు అంతం కావలసిందే. మూలపదార్ధంతో కలిసిపోవలసిందే. అంటే ప్రపంచమనే పుస్తకంలోని అన్ని పేజీలను కలిపి కుట్టిన దారం లాంటిది వినాశం. చివరకు అన్నీ పంచభూతాల్లో కలిసేవే. రాగద్వేషాలు కూడా అంతరించక తప్పదు. ’’కుల్లు మన్ అలైహా ఫాన్‘‘ అంటుంది ఖుర్ ఆన్. భూమిపై ఉన్న సమస్తమూ అంతరించక తప్పదు. ఇదే మాటను గాలిబ్ తనదైన శైలిలో చెప్పాడు. ఎవరికైనా మరణం తప్పదు. అందుకే వి ఆర్ ఆల్ యునైటెడ్ ఇన్ డెత్ అంటారు. చిందరవందరగా ఉన్న ప్రపంచం అనే పుస్తకంలోని పేజీలన్నింటినీ కలిపి కుట్టిన దారం వంటిది వినాశం అని వర్ణించడంలో గాలిబ్ తాత్వికదృష్టి గమనించ దగ్గది. ప్రపంచంలో వివిధ జాతులు, మతాలు, వర్గాల మనుష్యుల మధ్య ఎన్ని విభేదాలున్నా అందరూ చివరకు మరల వలసిన గమ్యం ఒక్కటే. జీవితమనే పుస్తకంలో వివిధ పేజిలన్నింటిని చివరకు కలిపేది ఒక్కటే. చదివిన కొద్ది కొత్త భావాలను అందించే లోతయిన కవిత. మొత్తం గజల్లో ప్రేమభావాన్ని రాస్తూ వచ్చిన గాలిబ్ చివరి షేర్ లో చెప్పిన ఈ మాటలు గమనించదగ్గవి. విశ్వంలో మనిషి, మనిషిలో ఉన్న రాగద్వేషాలు, ప్రేమలు, నిరాశలు, విషాదాలు, విభేదాలు ఏవయినా కాని చివరకు మనం ప్రయాణిస్తున్న మార్గం తన గమ్యానికి చేరక తప్పదన్న తాత్విక చింతనతో ప్రేమకవితను ముగించాడు గాలిబ్. ఇది ఈ రోజు గాలిబానా. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0U3PW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి