పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

పుష్యమీ సాగర్ కవిత-ఓ పుట్టుక వ్యథ





విమర్శలో సామాజిక వాస్తవికత(social reality)అనేఅంశాన్నొకదాన్ని చూస్తాం.సమాజంలోని అంశాలని గమనించిసృజన చేసినప్పుడు దాని సామాజిక వాస్తవికతగా చెబుతాం.ఈక్రమంలోనే సవిమర్శక వాస్తవికత(Critical reality)ఒకటి కనిపిస్తుంది.సమాజంలోని అన్యాయాలను,వ్యత్యాసాలను గుర్తించి వాటిని విశ్లేషిస్తూ రచనలు చేయడం.కేవలం సమస్యను చూడటంతోనే ముగించేసిందని విమర్శకుల నిందల్నిమోసినా ఈ అంశం అనేక సూక్ష్మాంశాలని వెలికితెచ్చింది.

అభ్యుదయ భావనని తీసుకొని వెలికి వచ్చిన అనేక వాదాలలో ఈవాస్తవ ప్రతిఫలనాలున్నాయి.ఏ సృజనకారుడైనా తానున్న కాలానికి సమాజానికి కట్టుబడకుంటే అతనిలోఈ వాస్తవాంశ ఆశించిన స్థాయిలో కనిపించదు.

సమాజంలోని ఒక అమానవీయ సంఘటనని,సందర్భాన్ని ఉద్వేగంగా వ్యక్తంచేసారు సాగర్.నిర్మాణపరంగా చూస్తేఇందులో రెండు అంశాలున్నాయి. కొంత సేపు ప్రథమ పురుష కథనం ,మరో భాగంలో ఉత్తమ పురుష కథనం ఈరెంటిలోనూ సారవంతమైన ఉద్వేగాన్ని పలికించారు.

"కోట్ల కణాల యుద్ధంలో గెలిచి
చొరబడింది మాతృగర్భంలోకి
రేపటి భవితకి పునాదిలా"--ఇది నిజానికి ఒక అనిర్దిష్ట వాక్యం కవి దేన్ని గురించి చెబుతున్నాడో తెలీకుండా పరోక్ష స్పృహ కలిగిస్తాడు.ఇలా ప్రాణం గర్భంలో చేరడందగ్గరనుంచి,అందులో నిలదొక్కుకోవడం దాకా కవిత సహజంగా సాగిపోతుంది.

"ప్రతిక్షణం పోరాటమే నీలో నిలబడటంకోసం"..ఈ వాక్యం నుంచే కవియొక్క దర్శనం కవితపై ప్రభావం చూపుతుంది..నిజానికి ఇక్కడ కవి స్వరం మారింది.పాత్ర లోకి లీనమై నాటకీయమైన (Drametic0వాక్యాల్ని ఇక్కడ నిర్మిస్తారు.

"వివక్ష నీ నరనరాననింపి /విత్తనంలా మొలవ బోతున్న నన్ను /విచ్చిత్తి చేస్తున్నావు"...సవిమర్శకవాస్తవికత భవిష్యత్తును దర్శిస్తుంది..ఈకవిత ఇలాంటి వాక్యాలతోనే ముగుస్తుంది..

"నీ గుడ్డి తప్పుకి మూల్యాన్ని చెల్లిస్తావు
ఒక్కో నలుసుని నలు దిక్కులా వెదుకుతూ"

వర్తమాన సమాజాన్ని ఎక్కువగా పీడుస్తున్న అనేక సమస్యల్లో భ్రూణ హత్యలొకటి..ఈఅంశాన్ని సమాంతరానుభవాన్ని పొందేలా అందించారు పుష్యమీ సాగర్.ఇలాంటి కొత్త అంశాలని(ఈ అంశంపై కవితలు గతంలోవచ్చినప్పటికి..అవితక్కువే మిగత అంశాలతోపోలిస్తే)కవులందరూ లోకనికి అందిచాలని ఆశిద్దాం.మంచి కవిత అందించి నందుకు పుష్యమీ సాగర్ గారికి అభినందనలు.

12.8.2013

                                                                          
                                                                                        

                                                                                                             ____ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి