పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

ఆర్.వి.ఎస్.ఎస్ శ్రీనివాస్-తొలకరి విరి ఝరి




భావకవిత్వానికి(romantic poetry)కి ఈవలి దశలో తెలుగులో అనుభూతి కవిత్వం (poem of feeling/pure poem)ఒకటి కనిపిస్తుంది.నిజానికి ఈరెంటిలోనూ వర్ణనే ప్రధానం.కాని వీటినిర్వహణలో వెంట్రుకవాసి అంతరం ఉంది.భావకవిత్వంలో సందేశం,ఆనందం రెండూ ఉంటాయి.అనుభూతిలో అనుభూతివల్ల కలిగే ఆనందమే ఉంటుంది.

వర్ణన విషయానికి వస్తే వస్తుగత వర్ణన(Conceptual discription)కళాత్మక వర్ణన (easthetic discription)అని రెండు భాగాలున్నాయి.చాలవరకు ప్రబంధకాలం నుండి కనిపించేది కళాత్మక వర్ణనే.కావ్యాల్లో ఇతిహాసాల్లో నదులు,వర్షం ,హిమాలయాలు వంటివి దొరికితే కవులు అద్భుతమైన వర్ణనలు చేసేవారు.

శ్రీనివాస్ గారు వర్షాన్ని అనేక భావచిత్రాల ద్వారా అందించారు.కావ్యాల్లో సంస్కృత భారతంలో వ్యాసుడు,తెలుగు భాగవతంలో పోతన,హరివంశంలో ఎర్రన..ఈకాలానికి వస్తే ఇస్మాయిల్ వర్షాన్ని గురించి అద్భుతమైన వర్ణనలు చేసారు.ఈ కవితలోనూ ఆసంప్రదాయాలు కనిపిస్తున్నాయి.


"చినుకు శరాలెలా గుప్పిస్తున్నాడో ఆ ఇంద్రుడు
మేఘాల విల్లుతో.
చినుకుబాణాలు ఎలా వదులుతున్నాడో
మెరుపు నారి సారిస్తూ.
చినుకుల శరసంధానం చేసే ఇంద్రుని ధనుష్టంకారం
ఉరుమై తరుముతుంటే,
నీటియజ్ఞం మొదలెట్టింది ధరణి వరుణుని జలయంత్రాల సాయంతో"
చాల అందమైన ఊహలు చేసారు శ్రీనివాస్.ఉరుముని>ధనుష్టంకారమని
..చినుకుని>బాణమని..మెరుపు>నారి అని ఒక యుద్ద దశని చూపినట్టుగా వర్ణించారు..
కావ్యాలల్లోనూ "ఇంద్రుని"పేరే ఎక్కువ.దిక్పాలకులకు అధిపతి గనుక..ఈ వాక్యాల్లో ప్రాబంధిక సృజన కనిపిస్తుంది.


"తొలకరి అలవోకగా అల్లేస్తూ ఉంటుంది
నీటితివాచీలను...చినుకు దారాలతో.
చిందేస్తూ చినుకుల చిన్నది
మేఘ తాళాలకి ధీటుగా."...చినుకుల్ని దారాలుగాచెప్పటం ఆధునిక దశ..బహుశః మొదట ఈ ప్రయోగాన్ని సాదించింది ఇస్మాయిల్ గారు."రేకు డబ్బాను పొట్లమని..చినుకుల్ని దారాలని"ఆయన రాసిన గుర్తు?-ఇక్కడ మేఘాల ఉరుములని తాళాలుగా చెప్పటమూ కనిపిస్తుంది.ఈ వాక్యంలో భాషకూడా ఆధునిక స్థాయికి వచ్చింది.ఈ కోణం లో పరిశీలించి చూస్తే శ్రీనివాస్ గారిలో పఠనానుభవ ప్రభావం కనిపిస్తుంది.


అడుగడుగునా శ్రీనివాస్ గారు చిత్రించిన భావ చిత్రాలు,కళాత్మక వాక్యాలు ఆహ్లాద పరుస్తాయి.

"ఆకాశం ఆరేసిన ఏడువారాల కోకలనెలా తడిపేస్తోందో
ఆ తుంటరి మేఘం."

"
ఎక్కడ నేర్చిందో ఆ కొండ
చినుకుచుక్కలని క్షీరధారలుగా మార్చే విద్య."

ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి.శ్రీనివాస్ గారిలో మంచి ఊహా చాతుర్యం ,ప్రత్యేకించి ప్రకృతిని బాగా అనుభవించ గల అనుభూతి దారుఢ్యం కనిపిస్తుంది.ఈకాలంలో వచనం కొంత ముందుకు చేరింది.దాన్ని అర్థం చేసుకోడానికి ఆధునిక కవిత్వాన్ని ,భాషాశైలిని అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.అందువల్ల రెండురకాల భాషాశైలుల నుండి తనదైన దారివెదుక్కోగలుగుతారు.కాలానికి తగిన వస్తువు శ్రీనివాస్ గారు ..జయహో..

16.08.2013





                                       












                                                            ____ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి