పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Kavi Yakoob కవిత

కవిసంగమం - నిరంతర కవిత్వధార ! .............................................. మిత్రులారా ! ఆశ్చర్యంగా ఉంటుంది ఇంతమంది కవుల్ని,ఇన్ని కవితల్ని ఇలా 'కవిసంగమం' వేదిక మీద చూస్తున్నప్పుడు. ! చాలా కష్టపడి,శ్రమించి రెండున్నర ఏళ్ళ క్రితం- తెలుగులో కవిత్వం లేదు అంటున్న మాటల్ని వినీ వినీ విసిగిపోయి - ఉన్నారు,అద్భుతమైన కవిత్వం తెలుగులో ఉంది, అని నిరూపించడానికి - కవిసంగమం ప్రారంభించాం. ఇవాళ -కవిత్వం లేదు-అనడానికి ఎవరూ సాహసించరు. ఫేస్ బుక్ లో ఈ వేదిక ప్రారంభించడానికి ముందు ఇలా కవిత్వం రాసుకోవడానికి వేదికలు ఉన్నాయని సాహిత్యకారులకి తెలియదు. 'కవిసంగమం' ఇటు ఫేస్ బుక్ లోనూ, అటు నెలనెలా కవిత్వ సభలతోనూ ,పోయెట్రీ ఫెస్టివల్స్ తోనూ విస్తృతంగా కవిత్వం గురించిన ఆసక్తిని కల్గించిందనడం అందరూ ఇవాళ ఆమోదించే విషయం. కొత్తగా రాస్తున్నవారు ప్రసిద్ధులైన కవులను కలుసుకునే అవకాశం కలిగింది.వారితో ముచ్చటించే సందర్భాల్ని సృష్టించింది. నిరంతరం రాసేందుకు వీలుగా,ప్రేరణ పొందేందుకు వీలుగా కవిత్వ వాతావరణాన్ని సృష్టించింది. మిగతా ఫేస్ బుక్ గ్రూప్ ల్లా కలుసుకునే 'గ్రూప్ మీట్స్'అనే దశనుంచి కవిత్వ చర్చోపచర్చల సందర్భంగా ఆ కలయికల్ని మలిచింది. 'కవిసంగమం'లో రాస్తున్న కవులవైపుకు ఆసక్తిగా అందరూ చూచేటట్లు,వారి కవితలవైపు దృష్టి మరల్చేటట్లు కవితల విశ్లేషణలతో,సందర్భాలతో ఉత్సాహపరిచింది. కవిత్వం అంటే ఒకానొక సీరియస్ అంశమనీ, కవిత రాయడం అంటే 'అంతరాంతర జ్యోతిస్సీమల్ని'బహిర్గతం చేసే సాధన అని తెలుసుకున్నవారు ఇన్నాళ్ళ ఈ కవిత్వ వాతావరణంలో మెరుగుపడ్డారు, కవిత్వంలో తమదైన ముద్రను కనబరుస్తున్నారు. ఇవాళ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.జయహో ! రాసిన ప్రతి కవితా గొప్పది కానట్లే, రాస్తున్న ప్రతివారూ కవిత్వమే రాస్తున్నారని చెప్పలేం. కానీ రాయగా రాయగా 'కవిత్వ దివ్యరూప సాక్షాత్కారం' ఎప్పుడో ఒకప్పుడు అవుతుందని మాత్రం నమ్ముతూ రాసుకుంటూ సాగడమే చేయాల్సిన పని. అలా రాస్తూ వినమ్రంగా కవిత్వ మెళుకువల్ని ఆకళింపు చేసుకుంటూ ;చదువుతూ; రాస్తూ తుడిపేస్తూ ఎవరైతే కవిత్వం కోసం తపిస్తారో వాళ్ళు మాత్రమే మిగులుతారు, వారి కవిత్వమే నిలుస్తుంది. "చాలా రోజులనుంచి రాస్తున్నమండీ 'అని దబాయించేవారికి ఒకటే సమాధానం -ఎప్పుడొచ్చామన్నది కాదు,ఎలా రాస్తున్నామన్నది ముఖ్యం. కవిత్వం పాఠకుడిని హత్తుకుందా ,లేదా ముఖ్యం. లైను కింద లైను గా అక్షరాలు రాసుకుంటూ పొతే అది కవిత అయిపోదు. అందులో ఆత్మను కవిత్వ నైపుణ్యంతో ఆవిష్కరించావా ,లేదా ? అన్నదే ముఖ్యం". "ఫేస్ బుక్ లో గ్రూపులు కొన్నాళ్ళ తర్వాత చప్పబడి పోతాయి'' అని ఆమధ్య ఒక మిత్రుడు మాటల సందర్భంలో అన్నాడు. సంతోషించే విషయం ఏమిటంటే , 1.రోజురోజుకీ 'కవిసంగమం'లో Join request లు పెరుగుతూ ఉండటం. కొత్తగా వస్తున్నవాళ్ళలో మెరుగైన కవిత్వ సృజన చేస్తున్నవాళ్లు కన్పిస్తుండటం.2.ఇదొక పోయెట్రీ హబ్ లాగా మిగతా సాహిత్య పత్రికలకు, e పత్రికలకు ఉపయోగపడుతుండటం.3. కవిత్వరంగంలోకి వస్తున్నవారికి సంతోషించదగ్గ ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తూ ఉండటం. కవిత్వంలో ఉత్సాహం నింపుతున్న ఇటువంటి కవిసంగమం నిలబడాలి. నిలబడాలంటే నిత్యమూ కవిత్వరచన, అభిప్రాయాలు -కవిసంగమంలో కన్పించాలి. కొత్తగా వస్తున్నవారిని ప్రోత్సహించాలి. నిరంతరం కవిత్వం..కవిత్వం ..కవిత్వం ! జయహో కవిత్వం !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ixsJpO

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి