పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఉర్దూ కవిత్వ నజరానాలో గత కొన్ని వారాలుగా మనం గాలిబ్ కవిత్వాన్ని చదువుతున్నాం. ఈ వారం గాలిబ్ సంకలనంలోని 15వ గజల్ మొదటి షేర్లు చూద్దాం షబ్ కీ బర్కె సోజె దిల్ సే జహ్రా యె అబ్ర్ ఆబ్ థా షోలా యే జవ్వాలా హర్ ఎక్ హల్కా యె గర్దాబ్ థా ఈ రేయి, గుండెమంటలకు మబ్బు నీరుగారిపోయింది మనసువేడి సెగతో నీటిసుడిగుండం అగ్నిగుండమయ్యింది ఈ కవితలో ఉర్దూ పదాలను చూద్దాం. బర్క్ అంటే విద్యుత్తు లేదా మెరుపు, బర్క్ యె సోజె దిల్ అంటే బాధాతప్త హృదయంలోని మంటల మెరుపు. జహ్రా అంటే పిత్తాశయం దీన్ని ఉర్దూలో పిత్తా అని కూడా అంటారు. పిత్తా పాని పానీ హోనా అనేది ఒక సామెత. అంటే అర్ధం భయంతో నీరుగారిపోవడం. పై కవితలో జహ్రా యే అబ్ర్ ఆబ్ థా అని గాలిబ్ వాడాడు. పిత్తా పానీ పానీ హోనా అనే సామెతను తన కవితకు తగినవిధంగా మార్చుకున్నాడు. అబ్ర్ అంటే మబ్బు, ఆబ్ అంటే నీరు. మబ్బు భయంతో నీరుగారిపోయిందన్నది ఈ పంక్తి భావం. జవ్వాలా అంటే తిరిగేది లేదా పరిభ్రమించేది అని అర్ధం. గర్దాబ్ అంటే సుడిగుండంలో కేంద్రం, ఇంగ్తీషులో vortex. షోలా అంటే నిప్పుకణం. ఈ కవితలో నీరు నిప్పుల వైరుధ్యాన్ని వాడుకున్న విధానం గమనించదగ్గది. ఈ కవిత అతిశయోక్తులతో విరహబాధను వర్ణించిన కవిత. ప్రేయసి వస్తానని మాట ఇచ్చి రాని రాత్రి ఎలా గడిచిందో గాలిబ్ ఇందులో వర్ణించాడు. ఆమె వచ్చి కలుస్తానని చెప్పంది. కాని రాలేదు. వర్షం కురుస్తుంది కాబట్టి రాలేదన్న సాకు చెప్పింది. ఈ కవితలో గాలిబ్ అనితరసాధ్యమైన కల్పన, ఊహాశక్తితో వర్ణించిన దృశ్యం ఆ విరహం ఎలాంటిదో చెబుతోంది. రాలేదన్న నిరాశ, ఎడబాటు విరహం ఇవి రెండు కలగలిసిన స్థితి. దుఃఖంతో మనసు రోదిస్తుంది. కన్నీళ్ళు ప్రవహిస్తాయి. గుండెలో మంటలు చెలరేగుతాయి. ఎగసిపడే గుండెమంటలను చూసి ఆకాశంలో మబ్బులు భయంతో నీరుగారిపోయాయట. ఆ నీటిలో సుడిగుండాలు ఆయన గుండెవేడి వల్ల అగ్నిగుండాల్లా మారాయంటున్నాడు. ఆకాశంలో కనిపించే మెరుపులను మబ్బుల్లో కురిసే నీటినే ఆయన వర్ణించాడు, కాని తన మనోస్థితిని, తనలో విషాదపు కన్నీళ్ళు, విరహపు మంటలను ఆకాశంలో మబ్బునీళ్లుగాను, మబ్బుల్లో మెరుపులు పిడుగుల అగ్నిగుండాలుగాను మార్చేశాడు. రెండవ కవిత వాం కరమ్ కో ఉజ్రె బారిష్ థా అనాగీరె ఖుర్రామ్ గిర్యా సే యాం పంబా యె బాలిష్ కఫె సైలాబ్ థా అక్కడ ఆమె నడకకు కురిసే వర్షం కళ్ళెమయ్యింది ఇక్కడ విరహబాధతో తలగడలో దూది కన్నీటిపై నురగయ్యింది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. వాం అంటే అక్కడ. కరమ్ అంటే దయచూపే వారు (ఇక్కడ ప్రేయసి అని అర్ధం). అనా అంటే కళ్ళెం. అనాగీర్ అంటే కళ్ళెం లాగేవారు. ఖిరామ్ అంటే మందగమనం, వయ్యారంగా నెమ్మదిగా నడవడం. గిర్యా అంటే దుఃఖం, యాం అంటే ఇక్కడ. పంబా అంటే దూది, బాలిష్ అంటే తలగడ. పంబా యే బాలిష్ అంటే తలగడలోని దూది. కఫ్ అంటే నురగ, సైలాబ్ అంటే వరద. కఫె సైలాబ్ అంటే వరదపై కనబడే నురగ. ఈ కవితలో కూడా విరహబాధను గాలిబ్ అతిశయోక్తులతో వర్ణించాడు. ఇచ్చిన మాట తప్పిన ప్రేయసి రాలేదు. రాకపోడానికి కారణం వర్షం. వర్షం వల్ల ఆమె రాలేనంది. తనపై దయచూపి కలవడానికి వస్తానన్నఆమె వయ్యారపు మందగమనానికి వర్షం కళ్ళెం వేసిందని వాపోతున్నాడు. అక్కడ ఆమె వర్షం సాకు చెప్పి రానంది, కాని ఇక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ, విరహంతో గాలిబ్ దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖాన్ని వర్ణించిన తీరు గమనించదగ్గది. అక్కడ ఆమె వర్షం సాకు చెప్పింది కాని ఇక్కడ దుఃఖంతో కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి. తలగడపై శిరస్సు తాకిడికి లోపలి దూది బయటకు వచ్చింది. అది కన్నీళ్ళ వరదపై నురగలా మారింది. విరహబాధను అతిశయోక్తులతో వర్ణించినట్లు కనిపించినా ఆ బాధను చవిచూసిన వారికి ఇందులో అతిశయం ఏమాత్రం లేదనిపిస్తుందేమో... మూడో కవిత వాం ఖుద్ ఆరాయీ కో థా మోతీ ఫిరోనే కా ఖయాల్ యాం హుజూమె అష్క్ మేం తారె నిగాహ్ నాయాబ్ థా అక్కడ సింగారించుకుంటూ ముత్యాలు దండలో కూర్చడం ఇక్కడ కన్నీళ్ళ వరుసను చూపుల దారంలో కూర్చడం ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. వాం అంటే అక్కడ, ఖుద్ ఆరాయీ అంటే తన్ను తాను సింగారించుకోవడం, అలంకరించుకోవడం. మోతీ అంటే ముత్యాలు. ఫిరోనే దండకూర్చడం. మోతీ ఫిరోనె కా ఖయాల్ అంటే ముత్యాల దండ కూర్చేపనిలో నిమగ్నం కావడం. యాం అంటే ఇక్కడ. హుజూమె అష్క్ అంటే కన్నీళ్ళ వరద. తారె నిగాహ్ అంటే చూపుల దారం. నాయాబ్ అంటే అలభ్యం. ఈ కవిత కూడా అతిశయోక్తులతో కూడుకున్నదే. పై రెండు కవితల్లో ప్రేయసి ఇచ్చిన మాట తప్పడం, విరహబాధ గురించి రాశాడు. ఎడబాటుతో కూడిన ఆ రాత్రి గురించి వర్ణిస్తున్నాడు. వర్షం సాకు చెప్పిన ఆమె అక్కడ సింగారించుకుంటూ ముత్యాల దండ కూర్చుతోంది. కాని ఇక్కడ విరహబాధతో కన్నీళ్ళు వరదయ్యాయి. కన్నీటి బొట్టును ముత్యంగా వర్ణిస్తూ కన్నీటి బొట్లు వరుసగా చూపుల దారంలో కిక్కిరిసిపోయాయని, అందువల్ల చూపుల దారం కనబడకుండా పోయిందంటున్నాడు. అంటే కన్నీటితో చూపు ఆనడం లేదు, ఏదీ కనబడడం లేదు. కన్నీటి దండ చూపుల దారంలో కూర్చడం వల్ల చూపు నాయాబ్ (అలభ్యం) అయ్యింది. ఈ కవితలో గాలిబ్ ఎక్కడ పోలికలు, ప్రతీకలు వాడలేదు. కాని రెండు సంఘటనలను చెప్పాడు. కవితా నిర్మాణంలో ఇది గమనించదగింది. ఉర్దూ పంక్తిలో గాలిబ్ కన్నీటి బొట్టును ముత్యంతో పోల్చలేదు. అక్కడ ఆమె ముత్యాలు దారంలో కూర్చుతోంది. ఇక్కడ కన్నీటి బొట్లను చూపుల దారంలో కూర్చుతున్నానని మాత్రమే చెప్పాడు. ఇద్దరు చేస్తున్న పని ఒక్కటే. ప్రేయసి తన సింగారానికి ముత్యాలు దండ కూర్చుతోంది. ప్రియుడు విరహంతో చూపులదారంలో కన్నీళ్ళను కూర్చుతున్నాడు. ఇక్కడ గమనించదగిన మరో విషయమేమంటే, ఆమె మరింత అలంకరించుకోడానికి చేస్తున్న పని ఇక్కడ విరహబాధను మరింత పెంచే పనిగా మారుతోంది. ఇలాంటి కవితానిర్మాణ కౌశలం గాలిబ్ కే సాధ్యం. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే వారం మరిన్ని కవితలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RsPMIX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి