పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Swatee Sripada కవిత

రెండు సమాంతర సముద్రాల మధ్య.... స్వాతీ శ్రీపాద పోగేసుకోడం పోగొట్టుకోడం రెండు సమాంతర నదులూ నిర్విరామంగా అటూ ఇటూ ప్రవహిస్తూనే ఉంటాయి ఖాళీ చేతులతో రెంటి మధ్యా ఒడ్డులా కళ్ళప్పగించి కాస్త కాస్త చెక్కుకుంటూ పోయే అబ్రకదబ్ర మంత్రాలమారి సమయం ముందు తలవంచి ఎవర్ని వాళ్ళు సమర్పించుకు, సరిపెట్టుకు సరిగమలవుతూ .... ఉగ్గుపాలతో కాలుష్యాన్ని తాగితాగి అలవాటుపడి బోసి నవ్వుల్లోనే నీలి నీడల చాయలు ఆట మరబొమ్మలా అలుపనేది లేకుండా ఇటునుండి ఆ తీరానికీ ఆ వైపును౦డి ఈ నదిలోకీ ఎగిరెగిరిపడుతూ తుంపరలు తు౦పరలుగా ఊహలు.. కనురెప్పలు వాలీ వాలకమునుపే కాచుక్కూచున్న కలలు చటుక్కున చీకటి తెరలను జరిపి ము౦దుకొస్తాయి ఆగిపోయిన కాలం పాయలు పాయలుగా చీలి నిద్రకూ మెళుకువకూ మధ్య హరివిల్లు లెన్ని౦టినో గాలిపటాలుగా ఎగరేస్తుంది మసక వెలుతురులో నడిరోడ్డున పరచుకున్న తోకమల్లె పూల పరిమళాల సంభాషణలకూ ఉండీ ఉండీ అక్షంతలుగా రాలుతున్న పూల జల్లుల్లో పులకరిస్తూ తొలి వెలుగు రేఖలను తెల్లగన్నేరు గుత్తులలో నింపుకు పక్కనుండే సరసరమని జారిపోయే దేవసర్పాల కాంతులు కళ్ళల్లో వంపుకు మళ్ళీ ఓ సారి మొలుస్తుంది ఎప్పుడో ఎండిపోయిన బాల్యం. సాయం సంధ్య ఎర్రని కళ్ళలో చుక్కలుచుక్కలుగా చనుబాలై అప్పుడప్పుడే విచ్చుకునే తెల్లని బొడ్డుమల్లెల చల్లదనం ఆకుచేతుల్లో మొహాలు దాచుకు వేళ్ళ సందుల్లోంచి దూరి వచ్చే వెన్నెల తీగలమీద నిశ్శబ్ద గానమవుతూ దిగ౦తాలకు రాయభారాల పర్వమవుతూ నవయౌవనం నీడలు తెరలు తెరలుగా కలవరిస్తున్న మాటల గుసగుసలనో పక్కకు నెట్టి హోరు గాలిలా చుట్టుకుపోతు౦ది హద్దులు మరచిన ఆకాశమై ఒకప్పటి చెరిగిపోని సంక్రాంతి ముగ్గు నిండిన జీవన ప్రాంగణం పెదవుల వెనకా , లోలోపలి అదృశ్య మధు భా౦డంనిండా పొంగి పొరలే తీపి కలల ఆవిరులు అగరు పొగలై కాస్సేపు ఉక్కిరిబిక్కిరి చేసే వేళ ఇటూ ఇటూ ప్రవాహాల్లోకి జారిపోయిన క్షణాలు తలపోస్తూ వచ్చిపడుతున్న సుమధుర గీతాలాపనలు ఆస్వాదిస్తూ రెండు సమాంతర సముద్రాల మధ్య ఒదిగిన చెలియలి కట్టని...................

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imTvPJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి