పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

కర్లపాలెం హనుమంత రావు || హైకూ-ఒక ధ్యాన మార్గం ||


దేశమంటే మట్టి కాదోయ్…కవిత్వమే.కొండలలో నెలకొన్న రాయడు వాడు…కవిత్వమే.వందే వందారు మందారమిందిరానంద కందలమ్…కవిత్వమే. చచ్చిన రాజుల పుచ్చిన గాథల మెచ్చే చచ్చు చరిత్రకారులను ముక్కు చెవులు కోసి అడగాలనుంది… ఇదీ కవిత్వమే.


కవిత్వానికి లిట్మస్ టెస్టులు, రంగు రుచి వాసనాదులు నిర్ద్రారించె పని వ్యర్థం. అలాగని పుటలను నలుపు చేసిన ప్రతి రాతను కవిత్వమే అనాలా!


కవి నిరంకుశుడే…కదా అని చంపకమాల రాసి కందమని దబాయిస్తే సహించాలా! పద్యం రాయాలనుకున్నప్పుదు పద్య నియమాలకి బద్ధుడయ్ ఉండాలి కదా!




హైకూల పేరుతో ఇప్పుడొస్తున్నసర్కస్ ఫీట్స్…ను గురించే ఈ ఘోషంతా!


సంప్రదాయక కవిత్వానికి ఉన్నది నియమబద్ధ వ్యాకరణ సూత్రాలే…హైకూల వెనుకున్నది ఒక కచ్చితమైన ఫిలాసఫీ!


హైకూ అంటే 5,7,5 అక్షరాలను ఉపయోగించి రాసే కవితా రూపం మాత్రమే అనేది ఒక అపోహ.


Haiku-Expression of a single impression of natural object or a scene without intellectual interuption...


భాషాప్రావీణ్యతకు,పాండిత్య ప్రకర్ష్ వ్యక్తీకరణలకు హైకూ వేదిక కాదు.హైకూ వెనుక ఒక మతం కాని మతం ఉంది. జైన్ మతం.నియమ శృంఖలాల బంధన లేకుండా మనిషికి నైసర్గిక స్వేచ్చను కోరుకునేది ఆ మతం. ప్రకృతితో మమేకం అవడమే ముక్తికి సాధనం అని దాని ప్రతిపాదన. కళ్ళు మూసుకుని కాదు…తెరిచి ధ్యానించు. ప్రకృతి ఉన్నది దర్శించడానికే. నిర్యాణానికి ఇంద్రియానుభూతి ఎంత మాత్రం అవరోధం కాదు.సామాన్య మానవుని కన్నా అసామాన్య అస్తిత్వం మరొకటి లేదు.-ఇదీ ఆ మత సిద్ధాంతం.


హైకూ వరకు వస్తే-ప్రకృతిలో మమేకమయే క్రమంలో దృశ్యానుభవాన్ని తృటి కాలంలో మెరుపులా కవి వ్యక్తీకరించాలి.ఇంద్రియగ్రహణ ద్వారా చైతన్యవాహినిఏర్పడేందుకు మనిషికి కావలసింది కేవలం 17 చిత్తక్షణాలే (thought instants)అంటారు. తొలి దశలో మూడు పాదాల్ని, 17 మాత్రల్ని(syllables) హైకూ లక్షణంగా నిర్ణయించడానికి ఇదే కారణం.





జపనీస్, ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉన్న మాత్రాసౌలభ్యం తెలుగుకి లేదు.ఈ మాత్రానియమం వల్ల హైకూ సౌదర్యం కోల్పోయే ఇబ్బంది ఉంది.





ముఖంపై ప్లస్సు


వీపు మీద మైనస్సు


చెయ్యిపై ఇంటూ… దీన్ని హైకూ అంటే భరించగలమా!





దోసిట్లో నీళ్ళు


ముఖచిత్రం కరిగి


కారిపొతుంది… ఇదీ హైకూ.





ఆకాశానికి రోడ్డుకీ మధ్య/చక్రాలు తిరుగుతాయి/అధిక భాగం ఆకాశంలోనే/అంగుళం మేర మాత్రం/అంటిపెట్టుకునుంటుంది నేలని/నా కవిత్వం లాగే…అంటూ తన కవిత్వాన్ని స్థూలంగా నిర్వచించుకున్న మహాకవి ఇస్మాయిల్ తెలుగుకి ఒదగని మాత్రల జోలికి పోకుండా కూడా అద్భుతమైన హైకూలని ప్రకటించారు.





కాళ్ళకి కాళ్ళు తొడుక్కుని


నీళ్ళల్లో నిలుచున్నాడు కుర్రాడు


పై కింది మొహాల్లో ఆశ్చర్యం ఆశ్చర్యం...





తలకి మబ్బూ


కాళ్ళకీ సరస్సూ తొడుక్కోకపోతే


కొండ కొండే కాదు...





పటిక బెల్లమ్ తింటుంటే


పాప చూసి ఆగింది.


దానికి పెట్టాక ఇంకా తీపెక్కెంది బెల్లం...





కవికి స్ఫురించిన మెరుపును మూడు పాదాల్లో ఇలా హృద్యంగా అందించడమే హైకూ లక్ష్యం. మేథో ప్రమేయం లేని జ్ఞాన జ్యోతే హైకూ కవిత ఆంతర్యం.


మామూలుగా కవి అంతగా స్పృహలో లేని ధ్యాన దశలోనె గదా హైకూ వెలువడేది! మితిమీరిన మేథో ప్రదర్శన హైకూ సౌందర్యాన్ని చెరుస్తుంది. వేరే కవిత్వం రాసే వేళ అలవాటుగా చేసే హంగామా హైకూ కవిత్వం రాసే సమయంలో ప్రదర్శించడమే చాలా మంది కవులు చేసే పొరపాటు.





భిన్నత్వం విశ్వజనీన గుణం.ఓ భావ జాలంతో ఏకీభవించ వచ్చు.విభేదించవచ్చు. కానీ ఒక స్థిర భావం నుంచి మొలకెత్తిన రూపాన్ని అదే పేరుతో రసాభాస చేయడం అన్యాయం.అది పేరడీ మాత్రమే అవుతుంది.


హైకూను మరొ విధమైన మినీ కవితా ప్రక్రియగా భావించడం కూడా దుర్ వ్యాఖ్యే.





అందరం గుర్తుంచుకోవలసింది…హైకూ కవిత ఆత్మకు ప్రధాన రూపం(Form) కాదు. విషయం(content) మాత్రమే.





"The flame of life lies in the heart of each passing second"


జెన్ బౌద్ధపు ఈ చైతన్య దీప్తే ... హైకూ


(నరేష్ నున్నా-"కొట్టివేతలు…దిద్దుబాట్లు" వ్యాస సంకలనంలోని 'హైకూ-ఒక ధ్యాన మార్గం'-స్ఫూర్తితో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి