పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

స్కైబాబా || వింగ్స్ ||

లోపల- ఏ అలారం మోగుతుందో
టంచనుగా లోపలి కన్ను విచ్చుకుంటుంది
నా కుంచెకు అందిన బొమ్మ చకచకా రూపుదిద్దుకుంటూ..
పక్కింటి పచ్చపచ్చని లంగావోనీ
మనసు వాకిలి ఊడుస్తూ..
ఎంతకూ అడగక
అసలెంతకూ నాలో మంచివాడు తగలబడిపోక..
గింజుకొనీ గిల్లుకొనీ
అటు తిరిగి పడుకుంటాను
పక్కలో ప్రత్యక్షమై
గుండీలో గుండెలో విప్పుతూంటే
అల్లకల్లోలమై సుడితిరుగుతుంటాను
నన్నెక్కడికో నడిపించుకుపోయి
నా చేయి పట్టుకుని
అవతలికి దూకేస్తుంది
ఎక్కడికో ఇంకెక్కడికో పడిపోతూ..
లేదు లేదు
రివ్వున దూసుకెళ్తూ..
బట్టలూ ఆచ్ఛాదనలన్నీ
లోకం అరుపులూ గుసగుసలన్నీ
ఎగిరిపోతున్నాయి గాల్లోకి..
దూసుకుపోతూన్నాం..
నేనూ, తప్పిపోయిన మేక పిల్లా
లేదు, నా చిన్న నాటి స్నేహితుడూ నేనూ
అహ–, నేనూ నన్ను వెంటాడే దెయ్యమూ
కిళుక్కున నవ్వుతూ మాజీ ప్రేయసి
దూసుకెళ్తూ ఎళ్తూ ఉన్నాం
ఇంకా అడుగు అందనే లేదు..

అంతలోనే రెక్కలు మొలుచుకు వచ్చాయ్!
తడిమి చూసుకున్నాను, ఆశ్చర్యంగా
అవి నేను
ఎక్కడో పోగొట్టుకున్నవే..!
*26-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి