పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

వంశీదర్ రెడ్డి || ‎* కించిద్విషాదం *.||

చెయ్యి తడిపితే, చేతిలోకొద్దామని
కాచుక్కూర్చున్న ఉద్యోగం, తలరాతలో

చచ్చిన కోడి, బావర్చిలో,
కడుపులో దూరడానికెదురుచూస్తూ

కంటినిండా రమ్మని పిలుస్తున్న
సినిమా పోస్టర్ సంగీత్ లో

మధుశాలలో "వాట్ 69",
వంద వాట్ల కాంతితో మెరుస్తూ,

ఫుట్పాత్ మీద షాప్ లో,
నిశ్శబ్దంగా నవ్వుతున్న "అసమర్ధుడి జీవయాత్ర"

బద్దకంగా కదులుతూ క్లాక్ టవర్ ముల్లు
నగరం నడిబొడ్డున

ప్రతి అమ్మాయిని గుచ్చే చూపుల
బడాయికి పాంట్ జేబులో పెట్టాల్సొచ్చిన చేతులకి
తగలని పర్సు,
సిటీ బస్సెక్కినట్టు గుర్తు

ఆటోవాడుమ్మిన కిళ్ళీ
నా తెల్ల చొక్కా మీద రంగవల్లిగా మెటమార్ఫసై..

కోపం పెంచిన ఆకలిని నాలుగోసారి చంపుకుని
ఆశలు రేపిన ఊహల్ని తప్పించుకు తిరుగుతూ
నాలోంచి నేను బైటకొచ్చి చూస్తే,
ఎటుచూసినా నాలాగే కన్పించే జనాలు..

ఏదో సాధించాలన్న
తపననీ, తొందరనీ వొదిలించుకుని,
కన్పించని "రేపు"ని
గొప్పగా కలలు కంటూ, గడుపుతూ..

ధైర్యం వచ్చింది, నేనొక్కడినే కాదని,
వాళ్ళకెపుడు తెలుస్తుందో,
అందరం ఒకటే అని..
*26-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి