పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

కె. కె. || నిరాశ నుంచి ఆశ ||

నిర్విరామంగా చలిస్తూ
చరా,చర సృష్టిని మోస్తూ
క్షమ,సహనాలకి మారురూపుగా
లోకాన్ని లాలించే ధరిత్రి
అప్పుడప్పుడు ఆగ్రహిస్తుంది.
ఆ ప్రకంపనాలు సమగ్ర జీవకోటిని
కలవర పరుస్తుంది,నిలువెల్లా కూల్చేస్తుంది.

లోకమంతా,తన శాఖలతో నింపివేసి
చల్లగాలి,పిల్లగాలిగా తాకే నేస్తం గాలి
ఆశ్రయించిన ప్రాణికోటిని
కౌగిలించుకుని ఆదరిస్తుంది.
హఠాత్తుగా కోపగిస్తుంది,
ప్రాణవాయువే విషపూరితమై
విజృంబిస్తుంది, జీవం పీల్చేస్తుంది.

హరిత వర్ణం,నేలపై కళ్ళాపి చల్లే,
దప్పిక తీర్చి,అక్కున జేర్చుకునే
చిరుజల్లుల వర్షం చిరునవ్వులతో పలకరిస్తుంది.
జగమంతా నిండిన ఆనందం తో పులకిస్తుంది.
ఎప్పుడైనా ఆవేశం కల్గితే ఉప్పెనై ముంచేస్తుంది.

ఆకస్మికంగా ఎదురుపడే ఆప్తుల కోపాలెన్నో
ఖంగున మోగుతూ,నిశ్శబ్దం గా నిష్క్రమిస్తాయి.
విపత్తులు సంభవించాయని విచారం వ్యక్తం చేస్తే
కర్తవ్య విముఖునివైతే మనుగడ ఎలా???
తుళ్ళే కెరటం పై దూకితేనే తీరం చేరేది.
నైరాశ్యం నుంచి ఆశను చేదుకున్నప్పుడే విజయం సిద్ధించేది.
*26-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి