పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

జగతి జగద్దాత్రి || ఆ ఒక్కటీ .... ||

ఆమె విరహం లో , నిరీక్షణ లో, ఆనందం లో , ఆవేదన లో
అతని గురించి కవిత రాస్తుంది
ఆమెలో కరిగి కలిసి పోయిన ప్రతిసారీ
నీకోసం ఒక మంచి కవిత రాస్తాను అంటాడు అతను
ఆమె కళ్ళలో కోటి నక్షత్రాలు మెరుస్తాయి
ఎప్పటికప్పుడు కలలు చివురు లేస్తాయి
ఆశతో అడుగుతుంది"నిజంగా?"
నమ్మకంగా చెప్తాడతను "నిజమే రా! ఈసారి తప్పకుండా !"
కధ మళ్ళీ మొదలౌతుంది
ఆమె ఆశతో అతని వాంఛ తో
ముగుస్తూనే ఉంటుంది ఎన్నో మార్లు
ఆమె నిరాశతో...అతని ప్రమాణంతో
అతని ప్రేమను అక్షరంగా చూడాలని ఆమె ఆకాంక్ష
రాద్దామనే అనుకుంటాడు ప్రతిసారీ అతను కూడా
ఒక్క వాక్యం తో ఆమె మనసు మురిపించగలనని
తెలుసు అతనికి
ఆ ఒక్క వాక్యం మాత్రం ఏమిటో తట్టడం లేదు మరి
అంటాడు నేను ఎప్పుడడిగినా ....
*26-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి