పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జూన్ 2014, గురువారం

Kavi Yakoob కవిత

యాకూబ్ || మిగిలుండాలి ! - అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి ,ఊరుండాలి కనీసం ఒక మనిషైనా మిగిలుండాలి మాటలన్నీ పగిలిపోయి ,కరిగిపోయి అర్ధాలన్నీ చెదిరిపోయి,బెదిరిపోయి భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెలవుండాలి కోర్కెలు అంతరించి ,దేహం ఒట్టి పుల్లైనప్పుడు ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లయినప్పుడు దారులన్నీ మూసుకుపోయి చిమ్మచీకటి మాత్రమె మిగిలినప్పుడు మళ్ళీ కొత్తగా మొలిచేందుకు ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి గతంలోకి ,భవిష్యత్తులోకి లోలకమై వేలాడుతున్న వర్తమానంలో లుంగీ బనీనును మోస్తున్న ఒకానొక ఆకారంలా కాక నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి అర్ధరహితంగా ముఖాలమీంచి జారే చిరునవ్వులలోంచి వ్యూహాల ఉత్తి సందర్భాలలోంచి నీవేప్పుడైనా ప్రవేశించగలిగే నీదనే నిజమైన జీవితం ఒకటుండాలి కనీసం గూటిలోకి దూరేముందు టపటపా కొట్టుకునే పక్షి రెక్కల ఒడుపులా జీవితాన్ని ఒడుపుగా చేరుకోగలగాలి పారుతున్న నీళ్ళను చేతుల్తో కళ్ళిగొట్టి,తేర్చి దోసిళ్ళతో నీళ్ళను నోటికందించి దాహం తీర్చుకున్నట్లు మిగిలిన దాహంలోంచి దేహాన్ని సేదతీర్చాలి. చిప్పిల్లే చిల్లుల్లోంచి పిండి విసిరేసిన మైనపుముద్దలాంటి తేనెపట్టు మీద చివరిగా విలపిస్తున్నతేనెటీగలాంటి దేహంలోంచి అవశేషమే నిజమైన ప్రాణవంతజీవితమన్నట్లు ఎదగాలి నీలోకి ఇమిడిపోయి రగిలిపోయి నీకులా నువ్వు మిగిలిఉండేందుకు ఎక్కడైనా ఒక చోటుండాలి ,ఊరుండాలి కనీసం ఒక్క మనిషైనా మిగిలి ఉండాలి * *జనవరి 2013

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1spFpG3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి