పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

Kapila Ramkumar కవిత

తెలంగాణ కవిత్వ దృక్పథం తెలంగాణ కవిత్వానికి ఒక స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం వుంది. ఇది సంకుచితమైందో, కేవలం రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షకు మాత్రమే పరిమితమైందో కాదు. అంతకు మించిన దృక్పథాన్ని అది వ్యక్తం చేస్తున్నది. నిర్దిష్టత నుంచి సార్వజనీనతను వ్యక్తం చేసే అత్యుత్తమ కవిత్వానికి తెలంగాణ ప్రాంతీయ కవిత్వం ఇవాళ్ల ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల్లో తెలంగాణ కవిత్వం ప్రాసంగికత మరింత పెరిగింది. లాటిన్‌ అమెరికా దేశాల్లో ఊపందుకుంటున్న న్యూ లెఫ్ట్‌ ఉద్యమాలు, నేపాల్‌ రాజకీయ పరిణామాలు తెలంగాణ కవిత్వ ప్రాసంగికతను పెంచుతున్నాయి. కళ్లకు కనిపించే శత్రువు కన్నా కనిపించని శత్రువును ఎదుర్కోవడం ఇప్పుడు ప్రధానావసరంగా మారింది. ప్రపంచీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాల్సిన కర్తవ్యం మన ముందున్నదనేది ప్రపంచ రాజకీయాలు ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేస్తూనే వున్నాయి. సామ్రాజ్యవాదం అత్యున్నత రూపమే ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరకు వ్యతిరేకంగా అమూర్త ఆచరణలు పనికి రావనేది తెలంగాణ కవులు గుర్తించారు. నిర్దిష్ట కార్యాచరణ నుంచే దానికి ధీటైన జవాబు చెప్పగలమనే విషయాన్ని వారు పసిగట్టారు. ఆర్థిక పోరాటాలకు సైదోడుగా సాంస్కృతిక ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం వుందని గమనించడం నేటి అవసరం. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ఆ కోణం బలంగా వుంది. తెలంగాణ కవులు తెలిసో తెలియకో దీన్ని బలంగా వ్యక్తీకరిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి, ప్రపంచీకరణ వ్యతిరేకోద్యమానికి మధ్య వైరుధ్యం ఏమీ లేదు. దాదాపుగా రెండూ ఒకటే. ఈ విషయాన్ని తెలంగాణ కవులు బలంగా వ్యక్తీకరించారు. తెలంగాణ కవిత్వ దృక్పథం స్థానిక వనరులపై ఆధిపత్యం, స్థానిక సంస్కృతి పరిరక్షణ గురించి మాట్లాడడం ద్వారా ప్రపంచీకరణ వ్యతిరేక గళాన్ని తెలంగాణ కవులు ఎత్తుకున్నారు. శిరసు పేర శివకుమార్‌, గుడిహాళం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన 'నల్ల వలస' దీర్ఘ కవిత మొత్తం సాంస్కృతిక వివక్ష గురించి మాట్లాడుతుంది. బహుశా తెలంగాణ కవిత్వంలో సాంస్కృతిక, సాహిత్య స్పృహను బలంగా వ్యక్తీకరించిన బలమైన మొదటి కవిత ఇదే. అయితే తెలంగాణ సంస్కృతిని, ప్రత్యేకతను కీర్తిస్తూ, గౌరవిస్తూ చాలానే కవితలు వచ్చాయి. ఇదంతా తన ఉనికిని వెతుక్కుంటూ నిర్దిష్టతను గుర్తించడం. ఈ నిర్దిష్టత నుంచే చేయాల్సిన యుద్ధాలను బేరీజు వేసుకోవడం చూస్తాం. ''పెయ్యంత సిటసిట పుట్టే జాగే ఇది ఏ కాసిని రవ్వలు నా కంటబడ్డా పాణం పాణమంతా పీరీల గుండమయ్యే అడ్డే ఇది పాణదాహమంతా కరువు దీరే కయితే ఇది'' (కరువు దీరే కయిత, ఆర్క్యూబ్‌) అని తన నేల గురించి నిర్దిష్టంగా పాడడం నిర్దిష్ట పరిష్కారాల కోసం అన్వేషణ ప్రారంభించడమే. ''సమ్మక్క, సారక్క జాతరలే చేస్తది బతుకమ్మ పాటలనే పాడుతూ ఉంటుంది కొమురెల్లి దేవున్ని కోర్కెలు తీర్చమంటది అయిలోని దేవునికి పట్నాలు ఎసివస్తది ఎమడాల రాజన్నకు కోడెలను కట్టేస్తది'' (నా తెలంగాణ, టి. కృష్ణమూర్తి యాదవ్‌) అని కీర్తించడం ద్వారా తెలంగాణ కవులు పరాయి ఆధిపత్యాన్ని నిరసిస్తున్నారు. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటున్నారు. కచ్చురం పయనిస్తుంటే జీవితాన్ని అతి దగ్గరగా అనుభవిస్తున్నట్లుగా ఉండేది అనుభవాల అనుభూతులు స్థిరాస్తుల్లా మిగిలేవి నాకు నిద్రిస్తున్నట్లు ఉండేది నిద్రలో స్వప్పవిహంగంలో ఎగిరినట్లు ఉండేది'' (కచ్చురం, తుమ్మల దేవరావ్‌) అని గత జ్ఞాపకాలను తీయగా నెమరేసుకోవడం వెనక్కి జారిపోవడం కాదు, వర్తమాన దౌష్ట్యాన్ని, దుస్థితిని నిరసించడం. గతాన్ని తలుచుకుంటూ వెనక్కి పోతున్నట్లు కనిపించినా, అది భవిష్యత్తు మార్గాన్ని అందిస్తుంది. మంచి భవిష్యత్తు కోసం తొవ్వలు తీసే అన్వేషణకు కారణమవుతుంది. ''బతుకమ్మ - తెలంగాణ నేల పూల కవాతు అలికి ముగ్గులు పెట్టిన లోగిళ్ళు సింగారించుకున్న చెల్లెల్ల చేతి నైపుణ్యం వెలిసిన పూల పిరమిడ్ల ఇంధ్ర ధనువులు'' (నేల మీది చందమామలు, కాసుల లింగారెడ్డి) అని బతుకమ్మను తెలంగాణ సాంస్కృతిక చిహ్నంగా చేసుకుని నెత్తిన ఎత్తుకోవడంలో మిగతా ప్రాంతాల నుంచి వేరుపడి తన ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకోవడమే. ఇదంతా కవి అంతర్గత, బాహ్య వలసాధిపత్యాలను వ్యతిరేకించే క్రమంలో చేసే కవితా గానమే. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం సాహిత్యంలో మొదట వివక్షను ప్రశ్నించడంతో మొదలై, తమ తెలంగాణ అన్ని రకాలుగా మిగతా ప్రాంతాలకు భిన్నమైనదని చాటుకోవడం దాకా పయనించి, క్రమంగా ఒక ప్రాపంచిక దృక్పథానికి మార్గం వేస్తున్నది. ఆ ప్రాపంచిక దృక్పథం అంతర్గత వలస పాలకుల ఆధిపత్యాన్ని నిరసించడంగా మొదలై అమెరికా సామ్రాజ్యవాదానికి దళారులుగా పనిచేస్తున్న పాలకవర్గాలను నిలదీయడంగా సాగుతున్నది. ఆంధ్ర వలసాధిపత్యానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి మధ్య గల అవినాభావం సంబంధం గుట్టును తెలంగాణ కవులు విప్పుతున్నారు. ఆంధ్ర పాలకవర్గాలు అమెరికా సామ్రాజ్యవాదానికి దళారులుగా పని చేస్తూ తెలంగాణను దాని మార్కెట్‌కు అప్పగిస్తున్న వైనాన్ని వారు గుర్తించి వ్యతిరేకించారు. దాన్ని గుర్తించాడు కాబట్టే - ''హంసవై వొస్తె చెరువు మావోడు దాహమై వొస్తె చెలిమె మావోడు బేహారివై వస్తివి భూహారివై వస్తివి తెల్లోని మారేశమై వస్తివి గదరా'' (దాలి, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి) అంటాడు తెలంగాణ కవి. ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచిన చరిత్ర తెలంగాణ కవులది. అందుకే అమెరికా సామ్రాజ్యవాదంపై, దానికి కొమ్ము కాస్తున్న పాలకవర్గాల తీరుపై అంత స్పష్టంగా తెలంగాణ కవి పలకగలిగాడు. ''వాడొక కీలుబొమ్మ వాడొక దిష్టిబొమ్మ వాడు ప్రపంచ విఫణి వీధుల్లో రాష్ట్రాన్నే తాకట్టు పెట్టేవాడు వాడు అంకుల్‌ శామ్‌ చెప్పుల్లో చేతులు పెట్టి తలకిందులుగా నడవాలని ప్రయత్నించేవాడు'' (ఒక తైనాతీ మరియు మాయల ఫకీరు, పి. లోకేశ్వర్‌) అని మనపై పెత్తనం చేస్తున్న కీలుబొమ్మ ప్రభుత్వం 'కీ' ఎక్కడ వుందో కనిపెట్టినవాడు తెలంగాణ కవి. జూకంటి జగన్నాథం కవిత్వమంతటా స్థానికత ఉట్టి పడుతూ ప్రపంచీకరణ విషప్రభావాలను వ్యతిరేకించే లక్షణం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ప్రపంచీకరణ దుష్ప్రభావాల గురించి తెలంగాణ స్థానీయత నుంచి బలంగా మాట్లాడిన కవి ఆయన. 'వాస్కోడిగామా డాట్‌ కామ్‌' కన్నా ముందు నుంచే ఆయన దీన్ని తన కవిత్వ దృక్పథంగా ఎంచుకున్నారు. ప్రపంచీకరణను వ్యతిరేకించేందుకు అనిర్దిష్టత, అమూర్త కార్యాచరణ ఏ మాత్రం ఉపయోగపడవు. దానికి నిర్దిష్ట కార్యాచరణ అవసరం. ఆ నిర్దిష్ట కార్యాచరణను తెలంగాణ కవులు అందిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించే క్రమంలో తమ వనరులపై తమకే హక్కును డిమాండ్‌ చేస్తున్నారు. తమ వనరుల వినియోగంపై తమ ఆధిపత్యాన్ని వాంఛిస్తున్నారు. తెలంగాణ కవికి స్పష్టమైన అవగాహన ఉంది. ఒక దృక్పథం వుంది. సైద్ధాంతిక నేపథ్యం వుంది. ఈ పనిముట్లతో నిర్దిష్టత నుంచి సార్వజనీనతను ప్రతిబింబించే కవితా నైపుణ్యం వుంది. ''వలస మార్కెట్లు వెలిగిపోతున్నాయ్‌ హోటల్లు, హోటల్లుగా రియల్‌ ఎస్టేట్లుగా వైభవోపేతంగా చందనాలు చల్లుతున్నావ్‌!'' (రెండు వలసలు, సుంకర రమేశ్‌) అని స్పష్టంగా తెలంగాణ కవి పలుకుతున్నాడు. తన ప్రాంతానికి సంబంధించిన ఏ ఒక్క పార్శ్వాన్నో కాకుండా సమస్త దేహాన్ని తెలంగాణ కవి తన సొంతం చేసుకుని ఒక సమగ్రతలోంచి స్థానీయతను చూస్తున్నాడు. సమస్యల చిత్తడిలోంచి గొంతెత్తి అరుస్తున్నాడు. మన సమస్యలకు ఎంత స్థానీయ కారణాలున్నాయో అంతగా అంతర్జాతీయ కారణాలున్నాయనే ఎరుక నుంచి తెలంగాణ కవి మాట్లాడుతున్నాడు. స్థానీయ, అంతర్జాతీయ కారణాలకు మధ్య గల సంబంధాన్ని కనిపెట్టి కవిత కడుతున్నాడు. అందువల్ల నిర్దిష్టత నుంచి ఆచరణసాధ్యమైన కార్యక్రమాన్ని అందిస్తున్నాడు. తన ఆలోచనాశక్తికి కవితానైపుణ్యం తోడు చేసి మిగతావారిని ఆహ్వానిస్తున్నాడు. తెలంగాణ కవిత్వం ఏడ్పుగొట్టు కవిత్వం కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఒకేఒక అన్యాయానికి వ్యతిరేకంగా కాలు దువ్వి కయ్యానికి సిద్ధపడిన గోరుకొయ్య. ఉత్పత్తి, ఉత్పత్తిసాధనాలు, పంపిణీ వ్యవస్థలపై ఆధిపత్యం సంపాదించడం ద్వారా ప్రపంచీకరణ మార్కెట్‌ను ఎదిరించడం సాధ్యమవుతుందనే ఎరుక తెలంగాణ కవికి వుంది. తద్వారా ప్రపంచీకరణ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం వీలవుతుంది. సాంస్కృతిక రంగంలో మొదలైన తెలంగాణ అస్తిత్వ ఉద్యమం బహుముఖంగా కొనసాగాల్సిన అవసరాన్ని తెలంగాణ కవిత్వం పట్టిస్తుంది. - కాసుల ప్రతాపరెడ్డి http://ift.tt/1kK4lhs

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kK4lhs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి