పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

ఎం.నారాయణ శర్మ కవిత

అఫ్సర్ కవిత- ఓ పొద్దుటి రైలు _____________________________________ సాధారణంగా చూస్తేసాహిత్యంలో మూడు అంశాలని గమనించవచ్చు.అవి భౌతికము,మానసికము,ఆత్మికమూ..పరిణతి చెందిన కవిలో ఈ మూడులక్షణాలూ ఉమ్మడిగా కనిపిస్తాయి.భౌతికతాత్వికాంశలని వ్యక్తపరిచే సంధాయక శక్తిలా ఆత్మకాంతి(Light of soul)పనిచేస్తుంది.అరవిందులు కవి ఆత్మనుండి సరాసరి వ్యక్తమయ్యేదే అసలైన కవిత్వం అన్నారు."The true creator of poetry,the true hearer of the soul" కవిత్వాన్ని నిజంగా సృష్టించేదీ,వినేదీ,ఆస్వాదించేదీ ఆత్మయే-అనేది ఆయన అభిమతం.ఎడ్వర్డ్ బుల్లో చెప్పిన భౌతికాంతరత(Physical Distence)సూఫీ తత్వ వేత్తల దర్శనం,ఛాసర్ తన కవితలోప్రదర్శించిన "సూక్ష్మ భౌతిక స్పృహ" మొదలైనవి దీనికి దగ్గరవే. ఆత్మనే వ్యక్తీకరించి,వ్యక్తీకరింపబడుతున్నప్పుడు దానికొక సిద్ధవాతావరణం,స్వభావం ఉంటుంది.యూంగ్ మనస్తత్వ విశ్లేషణలో ప్రాక్తన ప్రతిమల(Premordial imeges) గురించి చెప్పాడు.మన ఆలోచనలను తెలియకుందడా ప్రభావితం చేసే అంశాలే ప్రాక్తన భావనలు.అథర్వణ వేదం వీటిని "అమృత గర్భ వాసనలు"అంది.ఒక అవ్వను చూసినప్పుడు ఇంట్లో అమ్మ గుర్తుకురావడం,చెట్టును చూసినప్పుడు ఇంట్లో/ఊర్లో చెట్టు గుర్తుకు రావడం ఇలాంటిదే. అఫ్సర్ కవిత "ఓ పొద్దుటి రైలు "లో ఈ స్పృహ కనిపిస్తుంది.ఈ కవితకు మరోదేశంలో ఉన్న రైలు ప్రయాణం ప్రేరణ.కాని ఇది అన్నిప్రయాణాలను,ఊళ్లనూ సారూప్యంగా వ్యక్తం చేస్తుంది.దీనికి కారణం నాలుగు వాక్యాల్లో ఎక్కదా నిర్దిష్ట స్థల ,కాలాలు లేక పోవటం. 1 వూరు మసక చీకటిలోకి సగం కన్ను తెరచి మూత పెట్టుకుంది ఇంకోసారి. దూరంగా రైలు కూత నిశ్శబ్దంలోకి గిరికీలు కొట్టింది. 2 పట్టాల పక్కన వూరు ఎక్కడయినా ఎప్పుడయినా వొక్కటే. దాని ప్రతి మాటా రైలు కూతల్లో వొదిగొదిగి పోతుంది. 3 వూరు వెనక్కో ముందుకో ముందుకో వెనక్కో వొక పరుగులాంటి నడకతో- ఎవరంటారులే , వూరిది నత్త నడక అని! అది ఎప్పుడూ ఉరుకుల పరుగుల సెలయేరే నాకు. 4 అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని రైలు పాడుకుంటూ వెళ్లిపోయింది కూతవేటు దూరంలో. వాక్యాల వారీగా విభజించుకుంటే ఈకవిత మొదటిభాగం వాతావరణాన్ని పరిచయం చేస్తుంది."వూరు మసక చీకటిలోకి /సగం కన్ను తెరచి /మూత పెట్టుకుంది"అనటంలో ఊరు గమనించటంలేదని అర్థం.రైలుకూత నిశ్శబ్దంగా గిరికీలు కొట్టడంలో గాలిలో వినిపించే కంపన స్థితిని అనుభవాత్మకంగాచెప్పటం ఉంది. రెండవభాగంలో బౌద్ధిక ప్రయాణం కనిపిస్తుంది.రైలు కూతనుంచి ఊరిమాటవినటం అలాంటిదే.మూడు నాల్గులు జీవితాన్ని అర్థంచేసుకునేవి.భౌతికంగా భావించే అంశాలన్నిటినీ ఆత్మకాంతితో కవితామయం చేసాయి.నాలుగులోని "అన్నీ దాటి వచ్చామనుకున్నప్పుడు అసలేదీ ఎప్పటికీ దాటి వెళ్లలేమని "అనటంలోనూ ఈ స్పృహ దాగుంది. కవిత్వంలోనీ ఒక గొప్ప స్పృహనిండిన పరిపూర్ణ కవిత ఇది.ఇన్ని తాత్విక సాహితీ విలువలతో,సూక్ష్మీకరించి కేవలం నాలుగు వాక్యాలలో రాయటం సులభమైన సాధన వల్ల సాధ్యపడదు.చాల సార్లు విదేశాలలో ఉండి అఫ్సర్"ఊరి చివర"లాంటి కవితలని ఎలా రాస్తారా అని సందేహం ఉండేది.అఫ్సర్ గారి ఆత్మిక జీవిత వాతావరణాన్ని ఈ కవిత పట్టిస్తుంది

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p52Ak0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి