పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మే 2014, మంగళవారం

Mani Vadlamani కవిత

నా కవిత "ఒక స్వప్నం వచ్చింది," May , 2014 విహంగ మహిళా పత్రిక లో ప్రచురితం మణి వడ్లమాని ఆ రాత్రి ఆరుబయట పుచ్చపువ్వు లాంటి వెన్నెలలో చుక్కల పందిరి కింద ఆదమరచి నిదురపోయాను. ఆ కమ్మటి నిద్రలో ఒక తీయని స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో, ఎవరో మెత్తని గొంతుతో “ఓయి! లేవోయి,ఈ మొద్దు నిదుర వదిలి రావోయి! నీకు ఒక సుందర స్వప్న లోకం చూపిస్తాను” అంటూ నన్ను తట్టి లేపుతున్నారు. ఆ స్పర్శ మెత్తగా పువ్వులా వుంది, ఆమె నా చేయి పట్టుకొని తన వెంట తీసుకొని వెళుతోంది ఆమె ఒక వెన్నెల ముద్ద ! ఒక ప్రణయ స్వరూపిణి ! ఒక మధు స్వప్నం! జలతారు మేలిముసుగు లోంచి ఆమె మోము చంద్రబింబంతో పోటిపడుతోంది. మాట్లాడితే ఎక్కడ కరిగిపోతుందో మౌనంగా ఆమె వెంటే వెళుతున్నాను. “అదిగో చూడు అతనిని మీ లోకం వాడే అమృతం తాగి అమరుడయ్యాడు! కవిత్వం రాస్తాడుట, అతని అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలుట” అతనిని చూపిస్తూ మురిపంగా అంది వెన్నెల బొమ్మ. అక్కడే ఆగిన నా దగ్గరగా వచ్చి, చేయి పట్టుకొని ఘల్లుఘల్లుమంటున్న తన పద మంజీరాల ధ్వని తో వడి వడిగా నడుస్తూ “ఇదిగో! ఇటు చూడు !ఇతగాడిని ! మాట లాడడు ! కాని తన ఊర్వశి గురుంచి భావ కవిత్వం అందంగా రాస్తాడు!ఆ ప్రేయసి తలపే అతనికి ఏదో అపూర్వ మధుర రక్తి ని స్ఫురింస్తుందిట! ఎంత చక్కటి ప్రేమికుడో కదా! ఈ భావ కవి “ అని అతనిని చూస్తూ పరవశంగా అంది వెన్నల బొమ్మ! “ఓయి!ఇంకా ఇక్కడే నుంచొని వున్నావా? పదపద అంటూ,అదిగో ఆ పక్కన చూడు అక్కడ!, విరిసిన మల్లెల మధ్య కూర్చొని “మల్లెపూలు,తెల్లని మల్లెపూలు! విచ్చిన మల్లెపూలు!అబ్బ! ఈ పరిమళం నాకిచ్చే సందేశం ఎలా తెలుపనూ?”అంటూ పెరిగిన గుబురు గడ్డంతో అచలంగా వున్న అతను ఒక మహా ద్రష్ట ! తను చెయ్యాలనుకున్న పని చేసేసి మీ లోకాన్ని వెలివేసి ,ఇక్కడ ఈ అందమైన సుందర స్వప్న లోకం లో ఎంతో ఆనందంగా వున్నాడు ,” అని ఉద్వేగంగా ఆ వెన్నెల బొమ్మ ఇంకా ఏదో చెపుతుంటే , ఆశ్చర్యంగా ఆమెని అడిగాను “అసలు ఎవరు నీవు ? ఊర్వశి వా? శశిరేఖ వా? లేక అంబరాన వున్న అప్సర వా? ఎందుకు వీళ్ళందరనీ చూపిస్తున్నావు నాకు ?” వెంటనే చెంగునలేచి ఒయ్యారంగా పరుగులుతీస్తూ “ఓయి! ఎవరనుకున్నావు నన్ను? గుర్తుపట్టలేదా ?ఎప్పుడూ నా ధ్యాసే కదా నీకు”, అని అంటూ వెన్నెలబొమ్మ, వెన్నలా కరిగిపోయింది “అయ్యో! వెన్నెల బొమ్మా ఆగు!ఆగు ! నన్ను వదిలి వెళ్ళకు” అంటూ దుఃఖిస్తున్న నాకు హటాత్తుగా మెలుకువ వచ్చింది కల కరిగింది ! కళ్ళు తెరిచి చూసాను ఎవరూ కనిపించలేదు అప్పుడు అది స్వప్నం అని గ్రహించి ఒక్కసారి ఆ అందమైన స్వప్నాన్ని గుర్తు చేసుకొన్నాను. సత్య శివ సుందర త్రికం తత్వం తెలియచెప్పింది, ఆమె ఎవరో కాదు నా కవిత, నా ఊహసుందరి, నా కలల యామిని! - మణి వడ్లమాని ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

by Mani Vadlamani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iSpniM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి