పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Pusyami Sagar కవిత

అటకెక్కబోతున్న పఠనా సాహిత్యం - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243 19/08/2013 ఒక సాహితీవేత్త చెప్పిన విషయాన్ని వెంటనే పాఠక లోకం గ్రహించి ఆహా, ఓహో అంటూ తల మీద పెట్టుకొని ప్రచారం చేస్తారనుకోవడం పొరపాటు. పాఠకుడు పఠనానంతరం, తననుతాను దుఃఖ భరిత సందర్భాల్లోనుంచి విముక్తి చేసుకోడానికి నూతన అనుభవాన్ని పొందడానికి ఎంతవరకు చదివిన అంశం ఉపయోగిస్తుందో లోన మనస్సు అంచనా వేస్తుంది. మనస్సులో కదలిక మొదలైతే ఆలోచనలు మొదలవుతాయి. ....................... సాహిత్య రంగంలో రాసేవారికి, చదివే వారికి వున్న సంబంధం చాలా గొప్పది. వీరిమధ్య అవగాహనా లోపం ముదిరేకొద్దీ సాహిత్యం విలువలు తరుగుతూ వుంటాయ. దీన్ని సవరించుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం అటు సాహితీవేత్తల మీద, యిటు పాఠకుల మీద కూడ ఉంటుంది. ఈ బాధ్యతని ఖచ్చితంగా చెప్పాలంటే పాఠకుల మీదకంటే సాహిత్య సృజనకారులమీదనే ఎక్కువగా ఉంటుంది, ఉండాలి అనేది నిర్వివాదాంశం. సాహిత్య సృజన ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక ఉన్నతమైన ఉదాత్తమైన త్యాగనిరతి, అకుంఠిత దీక్ష దక్షత, అనే్వషణ, శాస్ర్తియ దృక్పథం, హేతుబద్ధమైన ఆలోచనా విధానం రచయితలో చోటుచేసుకోవాల్సిన అవసరం వుంది. సాహిత్యం సృజనాత్మకతా భావంగానే కాకుండా సమాజానికి దర్పణంగా కూడా వున్నప్పుడే వాస్తవికతకు దగ్గరగా వుంటుంది. పాఠకుడు అప్పుడే తననుతాను అందులో వెతుక్కోడానికి వీలుంటుందనే నమ్మకంతో సాహిత్యం యెడల ఆకర్షితుడవుతాడు. సాహిత్యంలో ఇది ప్రజాప్రక్రియ, ఇది కాదు - అనే మీమాంసతో వాదోపవాదాలు చెలరేగి కాలహరణ చేసిన రోజులు గతించాయి. ఎందుచేతనంటే ఏ వొక్క ప్రక్రియను సమాజమంతా ఏకత్రాటిమీద ఆమోదిస్తున్న పరిస్థితి ఉంటుంది అనకోవడమే పెద్ద అబద్ధం. ఏ ప్రక్రియలో సాహిత్యం నడిచినా అది సామాజిక విధ్వంసక మూలాలను ఎత్తిచూపేదిగా ఉండాలి. నడుస్తున్న వ్యవస్థ తీరుతెన్నులను దృష్టిలో పెట్టుకొని తప్పుదారులను ఎత్తిచూపుతూ, వ్యవస్థ సుఖశాంతులతో వర్ధిల్లే దార్శనికశక్తిని తనదైన శైలితో, తనదైన ప్రక్రియలో చదివించే శక్తిని కలిగించే సాహిత్యం రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. మార్క్స్‌యిజం మూల సూత్రమైన ఉత్పత్తి సంబంధాల మీదనే ఆర్థిక నిర్మాణ చట్రం ఏర్పడుతుందని, అదే సమాజ నిర్మాణానికి నిజమైన పునాదిగా ప్రజాసాహిత్యం భావించాల్సి వుంది. అయితే ప్రజాసాహిత్యం ఇటు ఆధ్యాత్మికపరంగాను మరోవైపు భౌతికపరంగాను వెలువడుతుంది. రెండూ ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. మూఢ విశ్వాసాలకు మూలం కాకూడదు. తప్పుడు బోధనలకు తావివ్వకూడదు. నేడు ఆధ్యాత్మిక సాహిత్యం దాని ప్రయోజకతను తప్పుదారి పట్టిస్తూ మతం ముసుగులో శ్రామికవర్గాన్ని అజ్ఞానంలో వుంచేందుకు ప్రయత్నిస్తోంది. మూఢనమ్మకాలను, విశ్వాసాలను ప్రోత్సహిస్తూ సోమరితనానికి పెద్దపీట వేస్తోంది. అభూతకల్పనలకు ఆజ్యం పోస్తోంది. మతంలోని తర్కజ్ఞానాన్ని తస్కరిస్తుంది. ఉపరితల రంగాల భావాలు భౌతికమైనవిగా తుచ్ఛమైనవిగా, హేయమైనవిగా, తృణప్రాయమైనవిగా ప్రబోధిస్తూనే, కేవలం తలతో పనిలేని ఉపరితల విన్యాసమైన భజనలకు అనుకూలంగా భజన చేస్తుంది. ప్రజా ఉద్యమాలమీద ఈ సాహిత్యం అణచివేతకు బాగా చేయూతనిస్తుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని పాలక వర్గాలు పనికట్టుకొని ఇతోధికంగా ప్రోత్సహిస్తుంటారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసి ఈ సాహిత్యాన్ని ముద్రిస్తుంటారు. అణచివేతను, ఎవరో ఒకరు వేలెత్తి చూపందే మనకు అర్థం కావడం లేదు. అణచివేత ప్రకృతి సిద్ధంకాదు. కర్మఫలం కాదు. అది మానవ కల్పితంగా తెలియజెప్పే సాహిత్యం మనకు కావాలి అనే చైతన్యాన్ని కలిగించే సాహితీవేత్తలు రావాలి. సామూహిక చేతనను సామూహిక శక్తిగా చైతన్యపరచేదే ప్రజాసాహిత్యం. ప్రపంచం పోకడ తెలియాలంటే సాహితీవేత్తలు ఎంతో లోతుగా ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. అందులోంచి మన సమాజానికి పనికివచ్చే విషయాన్ని పసిగట్టి మనదైన నుడికారంలో చెప్పడానికి ప్రయత్నించాలి. నేడు మానవ స్థితిగతులు, అంతరాలు, అన్యాయాలు, రాజకీయాలు, ఆర్థిక విధానాలన్నింటితో సాహిత్యం ముడివడి వుంటుంది. ఈ భూమీద మనిషి మనిషిగా బతకాలంటే భౌతిక వాదపు పునాదుల లోతులు తెలిసి వుండాలి. సర్వ భ్రమలనుంచి, సర్వ భయాలనుంచి, మనిషి విముక్తి కావాలి. కుల మత వర్గ జాడ్యాలనుంచి విముక్తుణ్ణి చేసి, జీవితానికి సరికొత్త చూపును ప్రసాదించే సాహిత్యం రావాలంటే సాహితీవేత్తలు ఏ ప్రక్రియలోనైనా ఎంతగా శ్రమించాలో, భావపరంపరను ఆకర్షణీయంగా చెప్పాలంటే ఎంతగా భాష యెడల పట్టు సంపాదించాలో గ్రహించాలి. సిద్ధాంతాల మూసలో ఎంత లోతుల్లో కెళ్లినప్పటికీ సమాజంలో నడుస్తున్న వర్తమాన పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఆకళింపు చేసుకోండి, చారిత్రక ధర్మాలతో అన్వయించుకోండి - ప్రజలు దాన్ని స్వీకరిస్తారనుకోవడం పొరపాటే. సైద్ధాంతిక పోరాటాల్లోనూ మార్పులు తీసుకవస్తేనే నేటి సామాజిక సుస్థిరతకు దృఢమైన పునాదులు వేయడానికి వీలుంటుందనేది గ్రహించాలి. వస్తు వాస్తవికత, నవ్య రూపం, కవిత్వంలో ఆకర్షణీయమైన అంశాలుగా నేడు భావించబడుతున్నాయి. అన్నింటికంటే నిబద్ధతే కొలమానంగా అంతర్లోకాలను ముట్టడించే నైపుణ్యం సాహితీవేత్తల్లో కలగాలి. ఒక ఆర్తి, ఒక స్ఫూర్తి, ధైర్యం, మొండితనం, నిర్దయత్వం, స్పష్టత, సూటిదనం, కవిత్వం పదునెక్కడానికి దోహదపడే అంశాలుగా భావించాలి. ఒక సాహితీవేత్త చెప్పిన విషయాన్ని వెంటనే పాఠక లోకం గ్రహించి ఆహా, ఓహో అంటూ తల మీద పెట్టుకొని ప్రచారం చేస్తారనుకోవడం పొరపాటు. పాఠకుడు పఠనానంతరం, తననుతాను దుఃఖ భరిత సందర్భాల్లోనుంచి విముక్తి చేసుకోడానికి నూతన అనుభవాన్ని పొందడానికి ఎంతవరకు చదివిన అంశం ఉపయోగిస్తుందో లోన మనస్సు అంచనా వేస్తుంది. మనస్సులో కదలిక మొదలైతే ఆలోచనలు మొదలవుతాయి. అటువంటి సాహిత్యం మీద ఆసక్తి పెంచుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియకు కాల నిర్ణయమంటూ వుండదనేది నా భావన. పలాయనవాద సాహిత్యం, వ్యాపార విలువలతో కూడిన సాహిత్యం, కాలక్షేపంతోను, ఆర్థికాపేక్షతోను ముడివడి వుంటుంది. రాజీలతో రాజ్యమేలే వ్యవస్థకు యిటువంటి సాహిత్యాలు దోహదపడుతుంటాయి. కాని ఇవి సామాజిక సమూల మార్పుకు బద్ధశత్రువులుగానే పరిగణింపబడతాయి. ఏ ప్రక్రియలో రాసినా ప్రజా రచయితల ధ్యేయం, దోపిడి, పీడన, అణచివేత, వివక్ష వంటి అప్రజాస్వామిక రుగ్మతల నుండి సమాజాన్ని చైతన్యపరచడమే. సమాజంలో పాలకులు, ప్రజలు వున్నట్లే పాలకవర్గ సాహిత్యం, ప్రజాసాహిత్యం ఉంటుంది. వాటి ఆంతర్యాన్ని ఆలోచనా విధానాల్ని, క్షుణ్ణంగా తెలుసుకోకుండా కొందరు రచయితలు అటూ ఇటూ కాలు పెడుతుంటారు. కవులు/ రచయితలుగానే వారు చలామణి అవుతుంటారు. దానివలన ప్రయోజనం లేదు. పఠనా సాహిత్యానికి పాఠక లోకం తరగడానికి ఎలక్ట్రానిక్ మీడియా ఓ ప్రధానమైన కారణంగా అనుకొంటుంటాము. ఆ భావనను పూర్తిగా ఆమోదించలేము. నేటి సాహితీవేత్తల పాత్ర కూడా వుందనేది అక్షర సత్యం. కొన్ని అంశాలను సాహితీవేత్తలు కూడా తిరిగి ఆలోచించాల్సిన అవసరం వుంది. అగ్ర దేశాలు వేసిన ఆర్థిక సంకెళ్లు సాధుపదాలుగా దర్శనమిస్తున్నాయి. మేధావుల్ని సైతం నమ్మిస్తున్నాయి. బడుగు బలహీన దేశాల మీద బలవంతంగా రుద్దబడుతున్నాయి. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, అగ్ర దేశాల సామ్రాజ్యవాద పన్నాగాలుగా ప్రవేశపెట్టబడ్డాయి. వాటి ప్రయోజనం బడుగు బలహీనవర్గ దేశాల ఉద్ధరణే అనడంలోనే అవాస్తవం దాగుంది. వీటి లోతుల్లోకి వెళ్లకుండా సమకాలీన సాహిత్యం పరిపుష్టమవుతుంది అనుకోవడం యదార్థం కాదు. నేటి మానవ మనుగడకు సహకరించినట్లుగానే, ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయాలను, అస్తిత్వపు హక్కులను కాలరాయడంలోని ఆంతర్యాన్ని ఎత్తిచూపే రచనలు వస్తున్నాయా? అస్తిత్వపు హక్కులకోసం పోరాడే అట్టడుగువర్గాల వార్ని ఆదివాసీలను ఏ విధంగా ప్రభుత్వాలు హింసించి అణచివేస్తున్నాయో గమనిస్తున్నామా? సాహిత్యంలో వారి వెతలు, బాధలు కనిపిస్తున్నాయా? అవి తీరే మార్గానే్వషణకు సాహిత్యం దోహదపడుతున్నదా? అధికార వర్గానికి తొత్తులుగా మారి, ప్రజాకర్షణ సంస్కరణలను వారి విజయాలుగా, విరోచిత సంస్కరణలుగా, చరిత్ర పుటల్లోకి ఎక్కించడం సాహిత్య లక్షణమా? ఈ విధానం భవిషత్ తరాన్ని మిస్‌గైడ్ చేయడం లేదా? మనిషి ఆర్థిక వ్యసనలోలుడై మనుగడకోసం తనకు తెలియకుండానే సంపన్న వర్గాల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోతున్నాడు. సమస్యలు తీర్చుకునేందుకు పెట్టుబడిదారిని ఆశ్రయించి సరికొత్త సమస్యల్లోకి జారిపోతున్నాడు. వెట్టికి బలైపోతున్నాడు. రాజకీయ నాయకుల్లాగానే సామాన్య ప్రజానీకం కూడా కపట నీతిని నేర్చుకుంటున్నారు. ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాల మీద లోతుల్లోకి వెళ్లి పరిశీలించి రాసి వెలువరించే సాహిత్యకారుల శ్రమను గుర్తించకపోడానికి కారణాలేమిటి? అవి ఎందుకు ప్రజల్ని చేరడం లేదు! ప్రజాసాహిత్యం మీద వున్న అణచివేత రూపం ఎలా వుంది? ఎన్ని కోణాల్లో విస్తృతిస్తుంది? నేడు విద్యావిధానంలోకి కాలిడి గెలుపు సాధిస్తున్నట్లు ఫోజు పెడ్తున్న కార్పొరేటెడ్ వ్యవస్థ ఎటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుందో పరిశీలించాలి. ప్రజాసాహిత్యానికి విద్యార్థులను దూరం చేస్తుంది. పాశ్చాత్య సాహిత్యం మీద మోజు పెంచుతుంది. అందునా భావ పటిమలేని సాహిత్యాన్ని ‘రైమ్స్’ రూపంలో పిల్లలకు బోధిస్తుంది. మనిషి ఎందుకు పరారుూకరణ పొందుతున్నాడు? దీనికి గల మూలమేమిటి? సాహిత్యం నేడు ఆలోచించాలి. ప్రకృతితో, సమాజంతో అన్యోన్యతా సంబంధం గల సాహిత్యం సృజనాత్మకత కలిగి వున్నట్లయితే, సాహిత్యం వైపు మనిషి పరుగెడతాడు. అసలైన జీవితం తెలుసుకోవాలనే విశ్వాసం జనంలో కలుగుతుంది. పఠనా సాహిత్యం కుప్పలుతెప్పలుగా వెలువడుతోంది కాని అందులో సరుకు ఉండడం లేదు కనుకనే పాఠకులు కరువయ్యారు. సాహిత్యం మీద సద్భావన తొలిగిపోయింది. కనుకనే చదవడం మానేశారు. పఠనాసక్తిని పెంపొందించే చైతన్యవంతమైన సాహిత్య కృషికోసం సాహితీవేత్తలు నడుం బిగించాలి. పఠనా సాహిత్యానికి పాఠక లోకం పట్టం గట్టే దశ రావాలి! (SOURCE: ANDHRABHOOMI DINAPATRIKA)...

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q6na22

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి