పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మార్చి 2014, గురువారం

Usha Rani K కవిత

మరువం ఉష | పాణిబంధం -------------------------- కిటికీ అవతల కొమ్మల్లో విశ్రాంతి తీసుకుంటున్న నీరెండ కిటికీ గట్టు మీది కుండీలో మొక్క నీడ గది మధ్యన నా వ్యాహ్యాళికి సమయం, చివరి గుక్క తేనీరు, చేతిలోని దినపత్రిక నెమ్మదిగా జారవిడిచి, గుమ్మం దాటటానికి ఉద్యుక్తుడనయ్యాను… “మర్చిపోయారా?” మందలింపులో చిరుకోపం చలవ కళ్ళజోడు చేతికిచ్చిన స్పర్శలో ‘అమ్మ’దనం పది, పాతిక, వంద... అడుగులు లెక్క పట్టుకోవటం అదో వెర్రి హాయి దోవపక్కన వేప చెట్టుకి ఏడాది పొడుగునా ఏదో ఒక పని సర్వకాల సర్వావస్థల్లోనూ అది ఏదో ఒకటి రాలుస్తూనే వుంటుంది. ఆకులూ, పూతా, కాయలూ, పిచ్చుక గూళ్ళ పూచికపుల్లలూ... ఇక, ఇక్కడ ఎదురవ్వాలి ఆ ఇద్దరూ, పచ్చ గళ్ళదో, ఎర్ర అంచున్నదో, ఓ నేత చీరలో నవ్వు మోముతో ఆవిడ, బట్ట కట్టటంలో బద్దకాన్ని దాయలేక ఆ పెద్దాయన నాకెప్పుడూ సమాధానం లేని ప్రశ్నే, “ఏమి ముచ్చటించుకుంటుంటారు?” గుక్కతిప్పు కోనన్ని ఊసుల్లో మునిగితేలు తుంటారెపుడూ... ఒక్కరోజూ పలకరింపు నవ్వు మానదా సిరి మొగము అవును ఏరి కనపడరేమీ? చేతి గడియారం నా సమయపాలన తప్పలేదన్నది. ఒకటి, రెండు, అరవై రోజులు వాళ్ళు కనపడక అరవై ఒకటో సాయంత్రము నడకలో నా అడుగుల లెక్క వేస్తున్నాను ఎదురెండకి చేయి అడ్డం పెట్టుకుని పెద్దాయన నా ముందు నడుస్తున్నాడు వెనగ్గా సాగిన నీడ ఆయన నీరసపు నడక లో వంకర్లు పోతూంది... వేప పూవొకటి నా చెవి మీదుగా నేలకి రాలిపడింది తెలియకుండానే తల ఎత్తి చూసాను ఊగుతున్న రెమ్మకి, రేకల్లేని తొడిమ ఒకటి వేలాడబడి ఉంది పెద్దాయన్ని దాటుకుని వచ్చేసా “ఆవిడ ఎక్కడ?” మనసు నన్ను నిలదీస్తుంది వెనుదిరిగి ఇంటి ముఖం పట్టాను ఇపుడు నాకెదురుగా పెద్దాయన ఏదో మార్పు, వడిలిన ముఖం, వణుకుతున్న చేతులు, ఒక్కడూ గొణుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు నన్ను దాటుకుని ఒక్కసారిగా నా వెన్ను అదిరింది, విదిలిస్తున్నా ప్రశ్నలు ముసురుతున్నాయి భయం, బెంగ వంతులు వేసుకుని నా గుండెని నొక్కుతున్నాయి ఇంటి కి చేరే సరికి నా కోసం ఆరాట పడే మనిషి ఉండాలి ఎప్పుడూ... మంచినీళ్ళ గ్లాసు చేతికిస్తూ ఆరాలు తీసే తోడు ఉండాలి. ఉంటుందా? ఒంటరితనం కొక్కానికి చిక్కుకోబోయేది తనా, నేనా? కాలం వేసే కొత్త మేకప్పుకి సిద్దపడేది ఎవరు మా ఇద్దరిలో (2012 నాటి ఈ వచనానికి 'పూర్ణా...పూర్ణా అంటూ మా చిన్న అమ్మమ్మ వెనుక తిరిగి ఆమె మరణం వెంబడే తనూ ఈ లోకాన్ని వీడిన మా కొవ్వూరు తాతగారు, తను ప్రేమగా "సీతాయ్ సీతాయ్" అని మురుసుకున్న మా అమ్మ భౌతికం గా దూరమైనా ఒక దశాబ్దం గా ఒంటరి యాతన పడుతున్న నాన్నగారు ప్రేరణగా రాసాను...క్రౌంచ మిధున వారసులు ఎందరెందరో కదా!?) 06/03/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cdriMp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి