పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మార్చి 2014, గురువారం

Nirmalarani Thota కవిత

ఆది మానవున్నించి అంతరిక్షవాసివై ఎంత మారావయ్య మనిషీ..! రాతి యుగం నుంచి రాకెట్ యుగం దాక ఎంత ఎదిగావయ్య మనిషీ..! ఆకాశం అందుకున్నావు.. ఓజోను పొర చింపేసావు.. జాబిల్లిపై షికారు చేసావు.. జాజిపూల వాసన మరిచావు... ఎంత ఎగిరావయ్యా మనిషీ. . .! అరణ్యాలు చేధించావు కౄర మృగాల చెరపట్టావు . . నువ్వే అజీర్తి మృగానివై అగ్నిలా పచ్చదనాన్ని మింగేసావు . . ఎన్ని కాల్చావయ్యా మనిషీ . . ! చలువ రాతి మేడల కోసం గుట్టల్ని తొలిచేసి వర్షానికి తలుపులు మూసేసి పంట పొలాల్నీ పచ్చికబయళ్ళనీ బీడు భూమిగా మార్చేసి ఎన్ని కూల్చావయ్య మనిషీ . . ! పుడను తల్లి మేనంతా కాంక్రీటు పరిచేసి వాన చుక్కలకు వాకిళ్ళు మింగేసి . . ఆనక నీ తీరని దాహానికి అవని గుండె నిలువునా తూట్లు తూట్లు పొడిచేసి పాతాళగంగ ఇలకు తెచ్చిన కలియుగ భగీరధుడివై ఎన్ని నేర్చావయ్యా మనిషీ. . ! ఎ.సి. గదుల్లో గాలిని బంధించి మినరల్ ప్లాంటుల్లో నీటిని విడగొట్టి కడుపు నింపే వంట మంటతో మానేసి కడుపు కోత పెట్టే విస్పోటనాల్లో వాడేసి . . సూర్యున్ని ధిక్కరించి . . చీకటిని వెక్కిరించి . . దివారాత్రాలు ఏకం చేసి ఎంత మురిసివావయ్య మనిషీ . . ! పంచభూతాలతో పరాచికాలాడి ఏం బావుకున్నావయ్యా మనిషీ . . ! తింటే ఆయాసం తినకుంటే నీరసం . . పాంటాప్రజోల్ తో భోజనం ఆల్ఫజోమాల్ తో నిద్ర . . ఎన్ని దాచావయ్య మనిషీ . . ! ముప్పై ఏళ్ళకే కళ్ళ జోళ్ళు మెడ పట్టీలు . . నలభైలో పడి నడుము నొప్పులూ అరిగిన మోకాలి చిప్పలూ . . ఏం సాధించావయ్య మనిషీ . . !!? తొలిపొద్దు మేలుకొలుపు మరచి వాలే పొద్దుల్లో జోల పాటలు విడిచి సహజంగా పుట్టలేక సహజంగా బ్రతక లేక చివరికి సహజంగా చావనూ లేక ఏం మిగిల్చావయ్యా మనిషీ . . ! ప్రకృతిని గెలిచానని పగలబడి నవ్వకు . . వికృతంగా ఓడానని పొగిలి పొగిలి ఏడ్వు . . ! అవును . . అప్పుడు నీకెవరూ లేరు . . ఇప్పుడు నీకు నువ్వే లేవు ... ! నిర్మలారాణి తోట [ తేది: 06.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fKWc9T

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి