పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మార్చి 2014, శుక్రవారం

Abd Wahed కవిత

గాలిబ్ కవితల్లో ఈ రోజు మొదటి కవిత, గాలిబ్ సంకలనంలోని 13వ గజల్ మొదటి షేర్ మహర్రమ్ నహీ హై తూ హీ నవాహాయె రాజ్ కా యా వర్నా జో హిజాబ్ హై పర్దా హై సాజ్ కా నిగూఢ స్వరాలకు ఆప్తుడవు కాదు నీవు నిశ్శబ్ధం నిజానికి వాద్యాల హోరు కదా ఈ కవితలోని ఉర్దూ పదాల అర్ధాలను చూద్దాం. మహర్రమ్ అంటే సాన్నిహిత్యం, సన్నిహిత బంధువులను మహర్రమ్ అంటారు. నవా అంటే స్వరం, నవాహా అంటే స్వరాలు, హిజాబ్ అంటే పరదా మనం సాధారణంగా బురఖాగా పిలిచే దుస్తులను హిజాబ్ అనవచ్చు. సాజ్ అంటే సంగీత వాయిద్యాలు, రాజ్ అంటే రహస్యం. ఇప్పుడు ఈ గజల్ భావం చూద్దాం. ప్రకృతి తన రహస్యాలను అన్వేషించేవారికి, ప్రకృతికి దగ్గరగా ఉండేవారికి తెలియజేస్తుంది. ప్రకృతి తనలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను వినిపిస్తున్నా అర్ధం చేసుకునే సామర్థ్యం నీకు లేదా అంటున్నాడు. ఎందుకంటే, ప్రపంచంలో ప్రతిదీ తనలో దాగి ఉన్న సౌందర్యాన్ని బిగ్గరగా ప్రకటిస్తోంది. ఉదాహరణకు డప్పుపై ఉన్న చర్మం నిజానికి ఒక పరదాలా కప్పి కనబడుతుంది, కాని ఆ డప్పు బిగ్గరగా సంగీత సౌందర్యాన్ని ప్రకటిస్తుంది. అందులో సంగీతం దాగి ఉంది. ఈ కవితలో అనేక భావాలున్నాయి. పైన కప్పి ఉన్న ఆచ్చాదనల్లో అనేక రహస్యాలు దాగి ఉంటాయి. సంగీత స్వరాలు దాగి ఉంటాయి. పైపైన చూస్తే నీకు లోపల దాగి ఉన్న సత్యాలు కనబడవు. ఆధ్యాత్మిక నేత్రాలతో పరికిస్తే ప్రకృతిలో దాగి ఉన్న ప్రతి ఒక్క రహస్యం నీ ముందు సాక్షాత్కరిస్తుంది. దివ్యఖుర్ ఆన్ వాక్యాలను ఆయత్ అంటారు. ఆయత్ అంటే చిహ్నం లేదా సూచన అని అర్ధం. ’’మా జరఅ లకుమ్ ఫిల్ అర్జి ముఖ్తలిఫల్ వానుహ్. ఇన్న ఫీ జాలిక ల ఆయాతల్లి ఖవ్ మింయ్యజ్జక్కరూన్.‘‘ అంటే అర్ధం : దేవుడు మీ కోసం భూమిలో సృష్టించిన అనేక రంగు రంగుల వస్తువులలో కూడా గుణపాఠం నేర్చుకునే వారికి నిశ్చయంగా సూచన ఉంది. గాలిబ్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. ఆధ్యాత్మిక నేత్రంతో పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఒక డప్పుపై ఉన్న చర్మం సాధారణంగా చూస్తే దాన్ని కప్పి ఉంచిన పరదాలాంటిది. కాని సంగీత నిపుణుడికి దానిలో సుస్వరాలు వినిపిస్తాయి. ప్రకృతిలో చాలా సూచనలున్నాయి. చాలా రహస్యాలున్నాయి. ఆ సూచనలను, రహస్యాలను కప్పి ఉంచే పరదాలూ ఉన్నాయి. ఈ కవితలో ఉపయోగించిన పదాలు గమనించదగ్గవి. సాన్నిహిత్యం, స్వరం, ఆచ్చాదన, రహస్యం వగైరా పదాలు సృష్టించే పదచిత్రాలను పూర్తిగా గ్రహించాలంటే కొన్ని సాంస్కృతికమైన విషయాలను కూడా తెలుసుకోవాలి. హిజాబ్ అన్నది వస్త్రధారణ నియమం, డ్రస్ కోడ్ వంటిది. ఇది పురుషులకు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా స్త్రీల వస్త్రధారణ నియమాల్లో సన్నిహిత బంధువుల వద్ద వస్త్రధారణ నియమాల్లో సడలింపు ఉంది. మహర్రిమ్ అంటే సన్నిహిత బంధువు (తండ్రి, సోదరుడు, భర్త తదితరులు) వద్ద స్త్రీ పరదా పాటించదు. ఆ సన్నిహిత బంధువులకు ఆమె రహస్యం కాదు. కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే ఆమెను గుర్తించగలరు. ఆమె పరదాలో ఉన్నా కూడా గుర్తించగలరు. గైర్ మహర్రిమ్ అంటే సన్నిహిత బంధువు కాని వారు ఆమెను గుర్తించలేరు. గాలిబ్ ఈ సాంస్కృతిక అంశాన్ని ఉపయోగించుకున్నాడు. రహస్యస్వరాలకు నువ్వు సన్నిహితుడివి కాదు... వాటిని గుర్తించలేవు అంటున్నాడు. మహర్రిమ్ అన్న పదం ఉర్దూలో సాన్నిహిత్యానికి బదులుగా ఉపయోగించే పదం. స్త్రీలు ధరించే బ్రాసరీని కూడా మహర్రిమ్ అనే అంటారు. ఆమె శరీరానికి చాలా దగ్గరగా ఉండేదన్న అర్ధంతో. అంతేకాదు, ఆమె రహస్యాలను కప్పి ఉంచేదన్న భావం కూడా ఇందులో ఉంది. ఈ భావార్ధ ఛాయలను దృష్టిలో ఉంచుకుంటే, ప్రకృతిని ఒక స్త్రీగా పోల్చడం, ప్రకృతికి సన్నిహితంగా లేనందువల్ల అందులోని సంగీతం నీకు మౌనంగా మారిందని చెప్పడం చక్కని పదచిత్రాలను అందిస్తుంది. గాలిబ్ కాలంలో బ్రిటీషు వారి ప్రాబల్యమూ పెరిగింది. సాంకేతికంగా బ్రిటీషువారు సాధించిన ప్రగతిని ఆయన చూశాడు. రైళ్ళను, యంత్రాలను చూశాడు. ఒక పర్షియన్ కవితలో గాలిబ్ కరె మర్దె హోషియార్ బీన్ అంటాడు. అంటే తెలివైన వారి పని చూడండి అంటున్నాడు. ఈ కవితలోను గాలిబ్ ప్రకృతిని పరిశీలించి అందులోని రహస్యాలను కనుగొని కొత్త ఆవిష్కరణలు సాధించాలేకపోవడమేమిటంటూ తన వారిని నిలదీయడం కనబడుతుంది. ఈ రోజు రెండవ కవిత గాలిబ్ పదమూడవ గజల్ రెండవ షేర్ రంగె షికిస్తా సుబహ్ బహారె నజారా హై యే వక్త్ హై షుగుఫ్తనె గుల్హాయె నాజ్ కా తొలిపొద్దున పూలుగా విచ్చుకునే లేత రంగుల మొగ్గలు ఒళ్ళు విరుచుకుని నిద్రనుంచి మేల్కొనే ముగ్ధలు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. షికిస్తా అంటే విరిగిన లేదా లేత లేదా pale in color. సుబహా బహారె నజారా అంటే వసంతంలో ప్రాత: సమయం దృశ్యం. షుగుఫ్తన్ అంటే విచ్చుకోవడం, గుల్ అంటే పువ్వు, గుల్హా అంటే పూలు, నాజ్ అంటే అత్యుత్తమమైన, విశిష్టమైన, గర్వించదగిన, నాజ్నీన్ అంటే విశిష్టమైన అందం కలిగిన అమ్మయి అని భావం. గుల్బదన్ నాజ్నీన్ అంటూ ప్రేయసిని సంబోధించడం ఉర్దూలో ఉంది. అంటే అర్ధం పువ్వు లాంటి సాటిలేని అందగత్తె. గుల్హాయె నాజ్ అంటే పూల వంటి ముగ్ధలు అని భావం. స్త్రీ సౌందర్యాన్ని అత్యుత్తమంగా వర్ణించిన కవిత ఇది. పూలవంటి అందమైన అతివల సౌందర్యాన్ని గాలిబ్ వర్ణించిన పదచిత్రం సాటిలేనిది. తొలిపొద్దు పొడిచిన వెంటనే గొప్ప దృశ్యాలు కనబడతాయంటున్నాడు. ఉద్యానవనంలో లేత రంగుల్లో ఉన్న మొగ్గలు రంగులు వెదజల్లే పూలుగా విచ్చుకుంటాయి. అదే సమయాన పూలవంటి అతివలు కూడా నిద్రనుంచి మేల్కొంటారు. నిద్రమత్తు కారణంగా వారి సౌందర్యం లేతరంగులో, అంటే హుషారు లేకుండా ఉంటుంది. కాని చిరునవ్వుతో వారు చేతులు పైకెత్తి ఒళ్ళువిరుచుకోవడంతో లేతరంగుల మొగ్గలు విచ్చుకున్నప్పుడు పూల రంగులు ఎలా తేజోమయంగా మారుతాయో అదేవిధంగా వారి శరీరసౌష్టవం, సౌందర్యం అప్పుడే విచ్చుకుంటున్న పూల మాదిరిగా ఉంటుంది. అంటే ఇంటి బయట పూలు విచ్చుకుంటున్న వసంతం, ఇంటి లోపల ముగ్ధలు నిద్రనుంచి లేస్తున్న సౌందర్యం. ఎటు చూసినా వసంతమే అంటున్నాడు. ఉద్యానవనం నుంచి పడకగది వరకు వసంతం అలుముకుంది. ఇక్కడ గాలిబ్ తన ప్రేయసి గురించి మాత్రమే మాట్లాడడం లేదు. ప్రపంచంలో ప్రతి స్త్రీ గురించి చెబుతున్నాడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 13వ గజల్ మూడవ కవిత తూ ఔర్ సూయే గైర్ నజర్ హాయె తేజ్ తేజ్ మైం ఔర్ దుఖ్ తేరీ మిజాహాయె దరాజ్ కా నా ప్రత్యర్ధిపై నీ తీక్షణమైన చూపులు నీ కనురెప్పల శ్రమ నాకు దుఃఖకారణం ఉర్దూ పదాలకు అర్ధాలు. సూ అంటే వైపునకు అని అర్ధం. గైర్ అంటే పరులు లేదా ప్రత్యర్ధి. నజర్ అంటే చూపు. నజర్హా అంటే చూపులు. తేజ్ తేజ్ అంటే తీక్షణమైన అని అర్ధం. తేజ్ అంటే వేగం అన్న అర్ధం కూడా ఉంది. వేగవంతమైన, ఆగ్రహంతో కూడిన, తీక్షణమైన చూపులని భావం. మీజా అంటే కనురెప్ప లేదా eyelash. మీజాహా అంటే బహువచనం. దరాజ్ అంటే పొడవైన ఇది ఫక్తు ప్రేమ కవిత. గాలిబ్ తన అసూయను చెప్పుకున్న తీరు హృద్యంగా ఉంది. పరులవైపు తీక్షణంగా కూడా చూడవద్దని ప్రేయసికి చెబుతున్నాడు. కోపంగా, అసహనంగా కూడా చూడవద్దంటున్నాడు. ఎందుకంటే అలా చూడ్డం వల్ల లాభం లేదంట. కనురెప్పలకు శ్రమ తప్ప, పరుల్లో హృదయం ఉండదు, వారు రాతిగుండెలపై నీ చూపుల ప్రభావం ఉండదు. నీ కనురెప్పలు అల కష్టపడడం చూడలేనంటున్నాడు. కాబట్టి ఆమె కోపంగా కూడా పరులవైపు చూడకుండా, తన చూపులను కేవలం గాలిబ్ కోసం మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఎందుకంటే నిజమైన స్పందించే హృదయం కలిగినవాడు తానే. కోపంగా చూసినా, తీక్షణంగా చూసినా, అసహనంగా చూసినా ఎలా చూసినా ఫర్వాలేదు కాని తనవైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే పరులవైపు చూస్తే వారిపై ఆ చూపుల ప్రభావమూ ఉండదు. కళ్ళకు శ్రమ తప్ప మరేమీ ఉండదు. తనవైపు చూస్తే తనది స్పందించే హృదయం కాబట్టి నీ చూపుల శ్రమకు ఫలితం ఉంటుందంటున్నాడు. అంటే తాను అసూయపడుతున్నప్పటికీ, తన అసూయను దాచుకుంటూ నీ కోసమే చెబుతున్నాను, నీ మంచి కోసమే చెబుతున్నానంటున్నాడు. మొత్తానికి గాలిబ్ గొప్ప ప్రేమికుడు, ప్రేయసిని ఎలా అనునయించాలో బాగా తెలిసినవాడు.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d4WNZz

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి