పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

డా. రావి రంగారావు || జీవ లక్షణం ||


ఒరే, సుఖా లన్నీ అనుభవిస్తూ
కష్టాలు తప్ప లేదనే వాడా!
గాలుల సుడిగుండాలకు చిక్కినా
పచ్చగానే నవ్వుతూనే వుంటుంది చెట్టని,
గొడ్డళ్ళ గూండాలు గాయపరుస్తున్నా
కొత్త చిగుళ్ళ ఆయుధాలతో తలెత్తుకొని ఎదిరించేది చెట్టని
తెలుసా నీకు ?

ఒరే, చెట్టు గర్భస్థ పిండాల్ని
ముక్కలుగా కోసుకొని తినేవాడా!
నీ కోసం జీవితాంతం
కడుపు పండించుకుంటూనే వుంటుంది చెట్టని,
తన ఆహారాన్ని
ఎవడినీ అడుక్కోదు చెట్టని
తెలుసా నీకు ?

ఒరే, చెట్టుకు చలనం లేదని వాగే
ఎదుగుదల ఆగిపోయిన వాడా!
పండ్లల్లో పువ్వుల్లో
కూరల్లో ధాన్యాల్లో
గింజల్లో పప్పుల్లో
చెట్టు కెంత చలనం వుందో
తెలుసా నీకు ?
చలనం లేదనిపించే భూమి
ఎంత వేగంతో సంచలిస్తుందో, సంచరిస్తుందో
తెలుసా నీకు ?

సరసరా పొలం దున్నుతున్న నాగలిలో
చెట్టు చలనం చూడు !
చీకటిని చీల్చుకుని సాగే దీపం వత్తిలో
చెట్టు సంచలనం చూడు !
చెట్టు విశ్వ ప్రయాణం తెలియాలంటే
చెట్టంత మనసు పెంచుకో ముందు !

కదులుతున్న చెట్టు కదలనట్లుగా
ఎందుకు నిలబడి వుందో తెలుసా !
ఆకలితో అలమటించి చస్తావని
నీ ఎదురుగానే వుంటుంది చెట్టు,
వద్దని గెంటుతున్నా వెళ్ళని
విశ్వాసం ఉన్న కుక్కలా
నీ ఇంటి ముందే నిలుచుంటుంది చెట్టు,
నీ ప్రాణాల్ని నిరంతరం కాపలా కాస్తుంది చెట్టు,
నీకు ఇల్లు కట్టిపెడుతోంది చెట్టు,
నీకు బట్ట చుట్టిపెడుతోంది చెట్టు,
నీకు దీపమై దారిచూపుతోంది చెట్టు,
కుర్చీయై నిన్ను అందాలా న్నెక్కిస్తోంది చెట్టు,
నువ్వు చచ్చాక కూడా
నీ తలదగ్గర వెలుగై
నిన్ను తగలేసేది కూడా చెట్టు...

ఒరే, చైతన్యహీనుడా !
నా దృష్టిలో
చెట్టు...సజీవి,
నీవు నిర్జీవి...

ఒరే, రెండు చేతుల యంత్రమా !
ఇకనైనా చెట్టును కొట్టకురా !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి