పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

కెక్యూబ్ వర్మ ॥దేహపు విల్లు॥


తప్పొప్పుల తడిక చాటున దాగి
లోలోపల అగ్ని పర్వతాన్ని
ఉఫ్ మంటూ ఊదేసే వృధా ప్రయత్నమెందుకు....

మనసు నిండా నిండిన భావాన్ని
వ్యక్త పరచడానికి సాకులు వెతుక్కోక
మూసిన కున్రెప్పలను తెరచి చూడు
కనుల నిండా ఇంద్ర ధనస్సులే....

కలల్లో కలవరిస్తూ పలవరిస్తూ
మనసు ఐ మూలల దాగిన
కోరికల బుసలను తలపై మోదుతూ
చంపేయడమెందుకు??

రానీయనీ లోలోపలకి
ఎంత ఆస్వాదించ గలిగితే
అంత జీవితాన్ని ఆమూలాగ్రం
పిడికిట పట్టి గుండెల్లో పొదువుకోవాలి.....

నీ చూపు మేరా పరచుకున్న పచ్చదనాన్ని
వెచ్చని సూర్య కిరణాల ప్రతిఫలనంలో
మెరుస్తున్న ఆ లేలేత అందాలను
కంటి వెనకాల వెండి తెరపై బంధించి చూడు....

దేహాన్ని విల్లులా సారించి
నీ కోరికల బాణాన్ని సంధించు
అణువణువు ఆస్వాదించు
నేడున్న క్షణం మరుక్షణం మాయమవుతున్న
కాలబలం నిన్ను వెంటాడక ముందే....

కుళ్ళి కృశించి నశించే కంటే
అగ్నిశిఖలా కాలుతూ మెరుస్తూ
ఆకాశమంతా ప్రకాశిస్తూ
క్షణకాలమైనా బతికి చూడు....

గుండె నిండా ఊపిరి తీసుకొని
అడుగు వేయి
చీత్కరించిన లోకమే
నీకు దాసోహమవుతుంది....
(09-09-2012)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి