పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

సాయి పద్మ || చెలిమి... ||


నాలో అహంకారం నశించేందుకు నమ్మకమైన నేస్తం..
నువ్వు..
మొత్తం నువ్వే నిండాక ఖాళీతనానికి ఖాళీ ఎక్కడిదని..
అందమైన అమ్మాయికి తను అందమైనదని తెలిస్తే..
అందంగా ఉండదు..
నాలో నిండుగా నువ్వే ఉన్నావని నువ్వు మురిస్తే
నాకీ గర్వం నిలవదు..
భలే విచిత్రం కదూ..
నువ్వు...నేను..
అస్తిత్వ శిఖరాలపై నువ్వు...
అక్షరాల నిచ్చేనలేసుకుంటూ...నేను

ఉదయాలూ.. సాయంత్రాలూ..
లేక్కపెట్టని రాత్రులూ..
అన్నీ తెలిసేసుకున్నాక...అంతా మాటాడేసుకున్నాక
నా పదాల్లో నువ్వు..
నీ నిశ్శబ్దంలో నేను..

ఎన్ని అకాల వత్సరాలు గడిపానో.... ఎదురు చూపుల్లోనే..
అకారణంగా మారాం చేస్తూ..
బురదలో పొర్లాడే పిల్లాడిలా..
నీ జాడ తెలిసాక.. జన సమ్మర్దంలో..
ఒక మనిషి నీడనైతే చాలదూ..
అనే ధీమా, నమ్మకం..

జీవితం ఎప్పుడూ బాగానే ఉంది..
నువ్వు అర్ధమయ్యాక హరివిల్లైంది.. అంతే..

అదేమంత గొప్ప విషయం కాదులే..
అని.. నువ్వన్నా..
నీ గుండె చప్పుళ్ళ రిథం
వేదంలా వినే నాకు..
ఆ పోకడలూ..నడకలూ తెలియకనా..

రాసేటంత గొప్ప విషయాలేం లేవు మన మధ్య..
నా అక్షరాలూ నచ్చలేదంటూ అలుగుతావు కూడా..
కానీ.. నేను రాసేనని.. నువ్వు చూసే చూపు నచ్చ్సుతుంది నాకు..
మరింక ఎవరి లెక్క నాకేం..?
నీ చూపే నా రాతలకి దిష్టి చుక్క..
అదీ అందమే.. ఎందుకంటె..ఆనందంలాంటి అవసరం కనుక..
--సాయి పద్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి