పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మోహన్ రుషి // మేడ్ ఇన్ మిర్యాలగూడ! //


వికృత ఆలోచనల విషం పీలుస్తూ
సద్భావనా సదస్సులు నిర్వహించలేను!

కక్షగట్టి గాయాలు చేసే నిపుణత కనబరుస్తూనే
కపట నాటక కన్నీళ్ళు కురిపించలేను!

గుండెల్నిండా ద్వేషాగ్నులతో చలిస్తూ
పెదవి అంచు ప్రేమరాగంతో సమ్మోహపర్చలెను!

అంబరమంత అవిశ్వాసాన్ని దేహమంతా పులుముకుని
నయగారాల నమ్మకాల నగారా మోగించలేను!

అంతరంగమంతా అక్కసుని పరచుకుని
అవ్యాజమైన అనురాగాన్ని ప్రదర్శించలేను!

కనబడని కరవాలాల్తో కలియదిరుగుతూ
సుభాషితాలు వల్లించలేను!

జేబుల్నిండా రాళ్ళు నింపుకుని
పూల గురించి మాట్లాడలేను!

నిజం చెప్తున్నా...
రెండుగా ఉండలేకే ఇప్పటికీ ఇలా రేయిలోనే మిగిలిపోయాను!

8.9.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి