పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

రావి రంగారావు || నిద్రపోతున్న ప్రభంజనం ||


కుక్క వెంట మనిషి చేతులు కట్టుకు నిలుచున్నాడు
కుక్క మెడలో డబ్బు సంచి వేలాడుతోందని...
ఎలుకను చూచి ఏనుగు వంగి వంగి దణ్ణం పెడుతోంది
ఎలుక కుర్చీ మీద కులుకుతోందని...

గుండెలు బండలుగా మార్చుకొన్న కొండలు
కొత్తగా మొలిపించుకున్న రెక్కలు- డబ్బూ అధికారం
ఏ కోట కైనా ఎగిరెళ్ళ గలవు
ఏ తోట నైనా గాయపరచ గలవు...

ఇంకా మీసం కూడా మొలవని ఓ బక్క చిక్కిన గోగుపుల్ల
కర్ర పట్టుకొని వీధిలో నిలబడితే
గజం గజం పొడుగున్న వందలాది మీసాలు
ఇళ్ళలోకి దూరి బిగించుకుంటున్నాయి తలుపులు,

దేశం పూలచెట్టు తల్లివేరును తినేస్తున్నాయి దర్జాగా
తెల్ల చొక్కాలు తొడిగిన వేరుపురుగులు

ఎవరో విసురుతున్న ఎముకల ముక్కలకు
ఎగబడి పోతున్న ఏనుగులారా,
మన ఆకలి తీర్చవు ఎముకల ముక్కలు
మనల్ని నిద్రలో ముంచటానికి పంచే మత్తు బిళ్ళలు...
వాళ్ళు మన పొట్టల్ని తడిమేది ప్రేమతో కాదు-
మన డొక్కల్లో నేరాలు దాచటానికి ఆడే నాటకాలు...

గుంటనక్కలు
కుందేళ్ళ గొంతులు తడిగుడ్డతో కోస్తున్నాయి,
పులులు
లేళ్ళను తరిమి తరిమి చంపుతున్నాయి,
విభజించి పాలిస్తున్న సింహాలు
అనేకానేక వృషభాలను ఆనందంగా ఆరగిస్తున్నాయి...

పనికిరాని మిణుగురులకోసం
మనలో మనం చెండాడుకోవటం ఘోరం,
మన చేతు లన్నీ కలిపి ధ్వజ మెత్తితే
అదే దేశమాతకు కొత్త సూర్య హారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి