పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

వాసుదేవ్ II రాస్తూఉండాలి..వీటన్నింటికోసం II


అక్షరాల్లో ఒదిగిపోయి
పదాలు ప్రసవిస్తూ
వాక్యాల్లో విశ్రమిస్తుంటాను
ఓ అలజడి తట్టిలేపకపోదు
మరో భావసంఘర్షణ సునామీ సృష్టించకామానదు
అప్పుడైనా రాయాలి

గొంతులో పూడిక తీస్కుని
గుండెలో చేరినతడి అప్పు పుచ్చుకుని
రాస్తూనే ఉంటాను
అదేంటో నిశ్శబ్దం మాట్లాడినన్ని మాటలు
ఏ వాక్యమూ చెప్పదు
మౌనం పాడినన్ని పాటలూ
ఏ గీతం ఒలికించదు
మౌనానికి మాటకీ ఎగుడుదిగుడు ఘర్షణే
కాలంవిడిచిన కుబుసంపైనా
కాలానికతుక్కున్న జ్ఞాపకాలపైనా
రాస్తాను...రాస్తూనే ఉండాలి

ఆకాశానికివడ్డాణంలా హరివిల్లూ
రాత్రికొంగు పట్టుకుని వచ్చే సూర్యుడూ
గుండె చీల్చుకున్న అక్షరమూ
రాయమంటుంది..

కన్ను మిటకరిస్తూ, గుండె కొట్టుకుంటూ
కన్నీళ్ళని ఒంపేసె కొవ్వొత్తీ,
వెన్నెలంతా పోగుచేసి కట్టిన ముడుపూ
వర్షాన్నంతా దోసిలితో పట్టి కట్టుకున్న
ట్రాన్స్‌‌పరెంట్ పొదరిల్లూ ఊర్కోవు రాసేదాకా....

రెప్పలనంటిన కలలకీ బాకీ
కళ్ళకంటిన బాసలకీ బాకీ
ఈ బాకీలన్నీ తీరుస్తూ ఓ వీలునామా
రాయాలి..ఓ మంచిమాట ఆస్తిగా ఇస్తూ...

ఒదిగుండలేక వర్షిస్తున్న మేఘాలపైనా
కురిసీ కురిసీ అలసిపోయిన వర్షంపైనా
రాయాలి..రాస్తూనే ఉండాలి....

మనసెక్కడో అలిగినప్పుడో
మమతెప్పుడో చిరునామా అడిగినప్పుడో
ఓ మాట రాకమానదు..అది కవితేమో ఇలా
గుండెలోతుల్నుంచి వచ్చేదే ఓదార్పు
మనసు పగిలినప్పుడు విన్పించేదే కవిత!

ఓ పదివేల మాటల్లో ఓ నిశ్శబ్ద వాక్యం
ప్రతీ కవితా ఓ కన్నీటి చుక్క
అక్షరాల పోర్ట్రైట్.....

(01.సెప్టెంబర్.2012.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి