పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

కర్లపాలెం హనుమంత రావు ॥ దిగులేస్తోంది! ॥


1
కాలం గాయం చేసినప్పుడు
ముల్లు విరిగిన కాలు నిప్పుకొండలా సలుపుతుంది
కాలం ఊహల ఉయ్యాలలూపుతున్నప్పుడు
నక్షత్రమండలాన్నైనా సబ్బుబుడగల్లా ఊదిపారేయచ్చనిపిసుంది
సమయం గడుసుది సుమా!
మంటలు చుట్టూ మండుతున్నా
మనసుకి మిణుగురుపురుగుల రెక్కలు తొడిగి
మల్లెపందిరి కింద బబ్బోపెడుతుంది
కాగితంపూలవాసనకే మత్తెక్కిపోయి మనీప్లాంట్ కి పర్యాయపదమే లేదని పలవరింతలు మొదలయ్యాయి నీకప్పుడు
కంటిముందరి స్వర్గమంతా తెరముందాడే నాటకంరా నాయనా!
పేరుతో ప్రేమగా పిలిచినట్లే ఉంటుంది
కాలం మెదడులో సర్వనామంగానైనా నువ్వు మిగిలి ఉన్నావా?

2
మనిషి గోరటి ఎంకన్నగొంతులో జీరయి కరిగిపోతున్నాడురా తండ్రీ!
అంతరించిపోతున్న లోకంలో మిగిలున్నఆ ఒక్క వ్యవహర్తా కూలిపోతున్నఆర్తనాదమవుతున్నా ఆ చప్పుడు నీకు వినిపించడం లేదా!
మూతబడే కంటిరెప్పల్లో కరిగిపోయే విశ్వం నీదేరా కొడకా!
ఒక నమ్మకం చెరిగిపోతే ఒక లోకం చిరిగినట్లే!
ప్రశ్నల్ని అడవులకి తరిమేసి చెప్పుల్ని చేత్తో మోసుకుంటో గమ్మత్తైన పోటీలో నువ్ బిజీ బిజీ ఉన్నావ్
చర్మం వల్చుకుపోతున్నా చమ్మగానే అనిపిస్తుందొరేయ్ నీకీ మత్తులో!


వాక్యంలా ప్రవహించడం మానేసి ఎంత కాలమయింది?
సుందరయ్యా!..సుందరాకాండా!
జెపీనా!…జైరామ్ రమేషా!
కనీసం ప్రశ్నల్నన్నా కనాలనిపిస్తున్నదా నీకు!
పోరు ఊరేగింపులో ఊగటం మానేసి పోలేరమ్మ జాతరలో తూలటం మొదలెట్టావు
నల్లమందు నినాదాలు మింగి రాజీజెండా భుజాన మోసుకుంటో
ఒక్క పూటైనా గట్టిగా నిలబడని ఏ వెలుక్కురా నువ్ దివిటీ పట్టుకుని చిందులేసేది!

4
రేపటి మీద ఆశతో పరుగులు పెట్టే నీ పసిపిల్లలకేం చెపుతావ్ ఇప్పుడు?
ఏ వీధి చివర చెట్టు మిగిలుంటుందని పచ్చనాకు కోసుకురమ్మంటావ్ రేపు?
ఆఖరి మెతుక్కూడా అయిపోయిందాకా చేతిలో ఉన్నది అక్షయ పాత్రేనని నమ్మిస్తావా నాయనా!
నువ్వు చదివిన మాట నువ్వు పాడిన పాట
నువ్వు నిప్పు రవ్వలు చల్లుకుంటూ నడిచి వచ్చిన బాట
అంతా వెండిమబ్బుల చందమేనా!
అధర్మ రథయాత్రలో ఆఖరికిలా ఆర్భాట భటుడుగా మిగిలిపోవడం ఎంత విషాదం!
కూలిపోయే మహావృక్షం చివరి చిగురువునువ్వే అవుతావని ఎన్ని కలలు కన్నాను!
రేపటి విషపుమొక్కకు మొదటి వేరుగా మొలిచే నిన్నిలా చూడటం…!


01-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి