పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

పీచు శ్రీనివాస్ రెడ్డి !! మట్టి , సంతకం చేసిన మనిషిని !!

చీకట్లో
ఆకాశం వెలిగించిన తారా దీపాలను
లెక్క పెడుతూ నేను .

వ్రేళ్ళు మాత్రం ఏదో రాస్తున్నాయి మట్టిలో ..
" నీ మీద ఒట్టు నేను నీ వాణ్ణే " నని
స్పష్టంగా కనిపించింది
మిణుగురు పురుగులు చల్లిన వెలుగుల్లో
అది నా మనసు చెప్పిన మాట

నాలో ఉన్న నీవు , అదీ నేనే
మట్టి కూడా ఒట్టేసింది
పచ్చని మొక్కల సాక్షిగా
నిన్ను నన్ను కలిసే బ్రతకమని

మట్టి నవ్వుతుంది ఊ .. గే .. పువ్వులా
పచ్చదనంలో ప్రవహించే రక్తం మట్టే

కలిసొచ్చే కాలం మోసుకొచ్చిన బరువు బాధ్యతలన్నీ
మట్టిపైనే ..
మట్టికి మమకారం మనిషిపైనే ..

పసితనంలోనే
గోళ్ళలో మట్టి మరకలు
నోట్లో మట్టి ముద్దలు
అప్పుడే , తెంచుకోలేని బంధం
మేనులో చేరింది
పేగులో కరిగింది
గుండెలో మిగిలింది

మనసుతో గమనించు
నిలువెత్తు మనిషిలో మట్టి వాసనే వస్తుంది
అంతే మరి ,
పేగును విడిచి మొదలైన తనువు
తుదకు మట్టితోనే ముడి వేసుకుంటుంది

మట్టి, సంతకం చేసిన మనిషిని
కడవరకైనా నేను
ఖచ్చితంగా చేరుకునే పుట్టినిల్లు మట్టే

01-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి