పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఆగస్టు 2012, మంగళవారం

ఉషారాణి కందాళ ॥ నిద్రలో నా నగరం ॥

నల్లటి, చల్లటి రాత్రి దుప్పటి కప్పుకున్న
నగరం నిద్రపోతుంది అనుకుంటే పొరపాటే!
అప్పుడే లేస్తాయి అనేకానేక గమ్మత్తులు!
పెద్ద పెద్ద కంపెనీ లో కంప్యూటర్ల ముందు
ఎందరో మేలుకుని చాకిరీ చేస్తుంటారు!
నైట్ షిఫ్ట్ డ్యూటీలలో ఫ్యాక్టరీలేబర్లు,
ఆన్ డ్యూటీ లో ఉండే డాక్టర్స్, నర్సులు,
కూలీ కోసం నిద్రను రూపాయలక్రింద తొక్కిపెట్టే గుంపు
కనబడే రోడ్ల పనులు, నిర్మాణాలు,తారు మిషన్లు.
కల్లు కాంపవుండ్ల లో వినబడే కూనిరాగాలు,
బార్లలో సందండించే డాన్సులు, కేరింతలు..
ఉన్నవాళ్ళ పార్టీలు, ఉడుకు వయసు కోలాటాలు,
నిద్రపట్టని వృద్ధ్హుల గదుల్లో టి వి రొదలు,
పగలంతా తీరిక దొరకని ఆలూమగల చర్చలు,
చదువు బరువు క్రింద నలుగుతూ పుస్తకాలు
నమిలేసే కెరీర్ వోరియెంటెడ్ స్టూడెంట్ల కుస్తీలు,
ప్రేమ దోమ కుట్టి మనసుకు డెంగ్యూ జబ్బొచ్చి
ములుగుతున్న పడుచు కబుర్లు మోసే సెల్లుల సెగలు,
బ్రతుకు తెరువుకు వేరే దారిలేక బురద
పన్నీరు చల్లుకుని నవ్వులద్దుకున్న మోహాలమొహాలు,
చాలా చాలా కలగలిసి కరిగే రాత్రులలో
నల్లటి, చల్లటి రాత్రి దుప్పటి కప్పుకున్న
నగరం నిద్రపోతుంది అనుకుంటే పొరపాటే!

*13-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి