పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఆగస్టు 2012, ఆదివారం

అనిల్ డాని // నీ రాకకై //

ఇప్పుడే తెరిచాను
చిలిపి ఊహల గది తాళం
చల్లగాలేదో వచ్చి నీ ఊసు చెప్పి వెళ్ళింది
మేఘం తో నువ్వు పంపిన కబురు
చినుకుగా ఇచ్చి ఇప్పుడే వెళ్ళింది

ఇందాకే అనుకున్నా
నీ మది లో నేను వున్నానా లేనా అని
వెంటనే చల్లగాలి పెనుగాలై వచ్చి
హెచ్చరించి వెళ్ళింది
సన్నజాజులన్ని తెల్లబోయాయి నా ఊహకి
జడలోనుంచి మెడపై మెత్తగా గుచ్చాయి
అమ్మో నువ్వు మయగాడివే
నన్నే కాదు ప్రకృతిని మాయ చేసావ్

విరహం ఓ వైపు వేదన ఓ వైపు
నీ చేతి స్పర్శల గురుతులు ఓ వైపు
నీ మాటల మహత్తు ఓ వైపు
ఇలా నాలుగు దిక్కులనుండి నన్ను
ఆవహించేస్తున్నావ్ రోజూ

నీ మనసు కాగితం పై నాకై రాసిన
అక్షరాలను చదువుకుంటూ
తడుముకుంటూ
వెన్నెలలో ,వానలో మన జ్ఞాపకాలను
మాల కడుతూ సిగ్గుల మొగ్గను అవుతున్నా

పరధ్యానమే ఎప్పుడూ అమ్మ అరిచినా
నాన్న పిలిచినా ఫోన్ మోగినా
నీ ధ్యాసలో నిండామునిగి వున్నా
నిశ్చల సంద్రంలో దూరంగా
సాగిపోతున్న నావలా

చివురులన్ని పండుటాకులై రాలుతున్నాయి
మామిడి కాయ మాగాయై జాడీలో బద్రం గా వుంది
మంచం వెక్కిరిస్తుంది మల్లెలు గోలచేస్తున్నాయి
కోయిల పిలిచి పిలిచి అలిసి అలిగింది నీపై
ఇంత జరిగినా నువ్వు రాలేదు రాకూడదు అంటగా

ఏంటో ఈ ఆషాఢ అధిక మాసం నన్ను నిన్ను దూరం చేస్తూ
ఆశగా, బేలగా కళ్ళలో నిన్ను నింపుకుని
నీ శ్రీమతి నీకై రాస్తున్న ప్రేమలేఖ
అందుకుని స్పందించి వస్తావుకదూ

*18-08-2012

1 కామెంట్‌: