పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఆగస్టు 2012, ఆదివారం

వాసుదేవ్ ॥ మరిగంతే గామోసు! ॥

సూరీడు సచ్చిపోనాడో, ఇయ్యాల మరి
దాక్కుండీ పోనాడో మేగాలెనకాతల
ఏం సెప్పాడు కాదు వొర్సం గురించి
"వొత్తాదిలేవే, రాకెక్కడికి పోతాది
ఈ మడుసులకి బువ్విచ్చేది మనమే కదే
మరి ఈ వొర్సానికి మనం కావాలి
దానికీ మనం కావాలి యాడికి పోతాదిలే!"
ఆడు సిన్నప్పట్నుంచి అట్టాగే
ఆటికేసి సూత్తూనే ఉంటాడు

పొలానికీ నీళ్ళు కావాలే
ఆడికి మందులోకి కావాలే, ఊరుకుంటా
"అవునూ మావా మనకది కావాలే
కానీ దానికీ మనం కావాలంటావా, అదెలాగా?"
"అంటే ఎర్రిమొగమా, దాన్ని మెచ్చుకునేది మనం కదే?
సినుకు పెతీ గోళాన్నీ కౌగలించుకుంటానా
పెతీ సినుకునీ మగ్గెడతానా
గోలాల్లో దాస్తానా, పేమగా
అందులో నన్ను నేను సూసుకుంటాను గదే?
మది దానికి మాత్రం ఎవరున్నారే మనం తప్ప?"

"అవును, మావా! నిజమే
మనకే కాదు, దానికీ మనం కావాలె
నిన్నంతా అలా ఆకసంకేసి సూత్తనే ఉన్నా
ఒక్క సినుకైనా మీ మీద పడిపడితే
నన్ను లాక్కుంటావనుకున్నా..
ఉహూ.. సినుకూ రాలేదు, నువ్వూ ఊ లెయ్యలా!"

"వత్తాదే! రాకెక్కడికి పోతాదే
మనం నమ్ముకున్నాం కదే"
మరి మన సిన్నోడీనీ కూడా నమ్మే కదా మామా
పంపాం పట్నానికి..
పతీ సైకిలూ బెల్లుగంటా కేసి వొత్తాడేమోననీ సూత్తున్నా"
"వాడు, మనకొడుకైనా మనిసేనే,
వొర్సం, మన కడుపుసించకపోయినా
మడిసికాదే, అదో వరం
అది మోసం సెయ్యదు, మడుసుల్లాగా"

"ఏంటో ఈడూ మడిసే, ఈణ్ణే నమ్ముకున్నా
నాకేటన్యాయం సేసాడు?
నన్నొగ్గలేదే, మరి నా కొడుకేంటో
అమ్మన్నాడు కడుపారా, ఆడికెల్లినప్పటికాడనుంచి!"
"ఏమే వొత్తావా, మన కొడుకు రాడే
కానీ వొర్సం వొత్తాదే!"
"మరిగంతే గామోసు, ఏటి నమ్మాలో
ఏటి నమ్మకూడదో, ఈ జన్మకి ఆడొస్తేనే కానీ
తెనీదు, మరి గంతే గామోసు!"
18. ఆగస్ట్.12
(ఎప్పుడో ఇరవైఏళ్ళకిందటిమాట--మా లక్ష్మయ్య తన కొడుకుగురించి చెప్పి వాపోయేవాడు...ఇప్పుడు ఆ లక్ష్మయ్య లేడని తెలిసి ఇలా...అతని భాషలోనే. ఆవేదనలోనే)

*18-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి