పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జులై 2012, మంగళవారం

వెంపల్లి గంగాధర్ కవిత

నీ దేశం తయారుచేసిన క్షిపణి ఒకటి
గగన తలం లోకి
నిప్పులు గ్రక్కుతూ ఎగురుతుంది ....
ఉదయాన్నే పత్రికలు పతాక
శీర్షికలతో పట్టం కడతాయి!
రేపటి కాలం లో అది ఎవరిని మ్రింగ నుందో
ఎవరు చెప్పరు కదా ....?

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ
ఓటుకు నోటు సిద్ధాంతం
ఆర్థిక శాస్త్రం లో కొత్త పాఠం రాస్తుంది !
ప్రజల తల ఫై ముళ్ళ కిరీటం
వంశ పారం పర్యం గా వస్తోంది .
నీ శవ దహనానికి కూడా
నువ్వు ముందే పన్ను కట్టాలి ..!
నదీ పరివాహక ప్రాంతాలు
నాగరికతను నేర్పిన వైనం
పుస్తకాల్లోని పాత చరిత్ర .
ఇసుక లోంచి కోట్లు
పిండుకోవడం నువ్వు నేర్చుకున్న అధ్యాయం .

కూడు..గూడు.. గుడ్డ ...
ఒక పురాతన మనిషి కల .

సన్నని కాళ్ళు గల గొర్రెలు
పచ్చిక కోసం కరువు నేల మీద
లోతయిన కళ్ళ లో ఆకలి నింపుకొని
ఎదురుచూపులతో సంచరిస్తూనే ఉంటాయి .
బెదిరి చెదిరి బిత్తరి చూపులతో
జీవిత కాలం నెట్టు కోస్తుంటాయి ...

నువ్వు పుట్టుక తో నే
రాజ్యం లో సభ్యుడివి ...
ఇక...నవ్వుకొని నవ్వుకొని ఏడ్చు !

www.vempalligangadhar.com
*17-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి