పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, మే 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

ఆదాన ప్రదానాలతో ఎడద విశాలం Posted on: Mon 05 May 01:35:51.258821 2014 - కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్‌ ఆసక్తి, కఠోర పరిశ్రమ కలిస్తే నలిమెల భాస్కర్‌. అందుకు సాక్ష్యంగా మలయాళ నవల అనువాదం 'స్మారక శిలలు' నిలుస్తుంది. ఈ నవలకే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భాస్కర్‌ పద్నాలుగు భాషలు నేర్చుకొని, ఇరుగుపొరుగు సాహిత్యాన్ని అనువదిస్తున్నారు. ఆదాన ప్రదానాలు భాషల్ని సంపన్నం చేస్తాయి. అలాంటి ప్రక్రియను చేపట్టి సాహితీసేవ చేస్తున్న భాస్కర్‌ మంచి కార్యకర్త, నాయకుడు. అఖిల భారత తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షునిగా పని చేస్తున్నారు. డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా ఎంతోమంది శిష్యుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన భాస్కర్‌, సాహితీరంగాన అనేకుల్ని ప్రోత్సహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రజాశక్తి 'సవ్వడి' పాఠకులకోసం ఆయనతో సంభాషణ... భాషలు నేర్చుకోవాలనే మీ ఆలోచనకు మూలం ఏమిటి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచీ కొంత విలక్షణంగా ఆలోచిస్తాను. మూస పద్ధతులు అసలు ఇష్టం ఉండవు. మన దేశాన్ని పరిపాలించడానికి వచ్చిన పాశ్చాత్యులు భారతీయ భాషలు నేర్చుకొని ఆ భాషల్లో విశేష కృషి చేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు దూరంగా ఉన్న విదేశీయులు భాషలు నేర్చుకొని ఇంత సేవ చేయగా లేనిది భారతీయులై ఉన్న మనం కొంతైనా అలాంటి పని చేయలేమా అన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబుగా సాగింది నా భాషాధ్యయనం. పైగా నేను పనిచేసిన (ఉపాధ్యాయుడిగా) ఊళ్లో నాకు బోలెడంత సమయం. చదువుకోవడానికి ఒక గ్రంథాలయం లేని ఊరు. పత్రికలు రాని ఊరు (కొలినూరు). మరి అక్కడ కాలక్షేపం చేయడం పెద్ద సమస్య. అందుకని '30 రోజుల్లో కన్నడ భాష' అనే పుస్తకం పట్టుకున్నాను. ఏడాదికి ఒక భాష చొప్పున నేర్చుకున్నాను. నాకివాళ భారతదేశంలోని భాషలతో పరిచయం ఉంది. సంస్క ృత, ద్రావిడ భాషల మధ్యగల భేదం ఏమిటి? ఈ రెండూ భిన్నమైన సంస్కృతులకు సంబంధించిన భాషలు. సంస్కృతం చాలా భాషలకు తల్లి భాష కావచ్చునేమో కానీ ద్రావిడ భాషలకు కాదు. ద్రావిడ భాషలు ప్రధానంగా నాలుగు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. వీటిల్లో ఎక్కువగా సాహిత్యం వచ్చింది. ఇవి సోదర ద్రావిడ భాషలు. తెలుగు మధ్య ద్రావిడం. ఇంకా తుళ, కువి, కుయి, గోండు, బ్రాహాయీ వంటి భాషలు అనేకం ఉన్నాయి. సంస్కృతం ఇండో యూరోపియన్‌ భాష. సంస్కృతం, ఆంగ్లం, ఫ్రెంచ్‌, లాటిన్‌, గ్రీకు వంటి భాషలు సారూప్య సామీప్యాలు కలిగిన భాషలు. ప్రత్యేకించి మన దేశంలో ఉత్తరాది భాషలన్నీ సంస్కృతానికి దగ్గరే! సంస్కృతమూ, మూల ద్రావిడమూ (ద్రావిడ భాషలు ఇందులోంచే వచ్చాయంటారు) రెండూ భిన్న నేపథ్యాలు కలవి. వాటి వాక్య నిర్మాణ పద్ధతులు సైతం వేరు. సంస్కృతంలో కర్మణి వాక్యాలు ఎక్కువ. ద్రావిడ భాషల్లో కర్తరి వాక్యాల సంప్రదాయం ఉంది. 'ఏ రాముడైతే రావణున్ని సంహరించాడో అతడు అరవీర భయంకరుడు' వంటి యత్తదర్థక వాక్య పద్ధతి సంస్కృతానికి నప్పుతుంది. ఇదే వాక్యం ద్రావిడ భాషల్లో 'రావణుని సంహరించిన రాముడు అరవీర భయంకరుడు' అన్న విధంగా ఉంటుంది. కర్త, కర్మ, క్రియ... ఈ వరుసలో ద్రావిడ వాక్యం ఉంటుంది. సంస్కృతంలో ఏక, బహువచనాలేగాక ద్వివచనం అదనంగా ఉంటుంది. ద్రావిడ భాషల్లో ఈ వచనం లేదు. సంస్కృతంలో పదాలకు లింగం ఆపాదించే తీరు హేతువుకు అందదేమో అన్పిస్తుంది. ద్రావిడ భాషల్లో పురుషులైతే పుంలింగం, స్త్రీలయితే స్త్రీ లింగం, మిగిలినవన్నీ నపుంసక లింగాలు. ద్రావిడ భాషల అధ్యయనంలో లింగ విభజన పెద్దగా ఇబ్బందిని కలిగించదు. ఆదాన ప్రదానాల వల్ల భాషలకు జరిగే లాభ నష్టాలు ఏమిటి? ఆదాన ప్రదానాలు ఏ భాషకైనా లాభదాయకంగా ఉంటాయికానీ నష్ట సంధాయకాలు కావు. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి సాహిత్యం వచ్చినప్పుడు చాలా ప్రయోజనం కల్గుతుంది. ఉదాహరణకు మూల భాష నుంచి లక్ష్య భాషలోనికి సాహిత్యాన్ని దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ఇతరులతో పోల్చినప్పుడు ఎంతగా ముందుండిపోయాం, ఎంతగా వెనకబడిపోయామో తెలిసివస్తుంది. వెనుకబడ్డాము అనుకున్నప్పుడు మరిన్ని ఆదానాలు జరుగుతాయి. ముందున్నప్పుడు మన ద్వారా ఇతర భాషల్లోకి ప్రదానాలు జరుగుతాయి. ఈ ఎగుమతి దిగుమతులూ, ఇచ్చి పుచ్చుకోవడాలూ లేకపోతే మనిషి విశాల ప్రపంచంలో అడుగుపెట్టలేదు. ఆదాన ప్రదానాలకు మూలం అనువాదమే కదా! గోర్కీ 'అమ్మ'ను ఆస్వాదించడం అనువాదం వల్లనే కదా! ఇచ్చి పుచ్చుకునే ఈ ధోరణి వల్లనే ఒక సువిశాల సుసంస్కార సమాజం ఏర్పడుతుంది. మనిషి లోపలి సంకుచితత్వం కరిగిపోతుంది. ఎడద విశాలమవుతుంది. అనువాదం, అనుసృజనల అర్థాలు చెప్పండి? అనువాదం అంటే ఒక్క ముక్కలో మక్కీకి మక్కీ. అనుసృజన అంటే మక్కీకి మక్షికం, మక్కీకి ఈగ అని చెప్పడం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విషయానికి చ్యుతి జరగకుండా యధాతథంగా అనువదించాలి. ఇక్కడ స్వేచ్ఛానువాదం పనికిరాదు. అక్కడ అనువాదకుడు ఫ్రీ హ్యాండ్‌ తీసుకోలేడు. కానీ సాహిత్యానువాదంలో ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఒక మేరకున్నాయి. ముఖ్యంగా కాల్పనిక సాహిత్యంలో అనుసృజన మంచిది. నుడికారాలు, సామెతలకు మక్కీకి మక్కీగా అనువదించరాదు. ఉదాహరణకు మలయాళంలోని 'మూత్తోర్‌ చొల్‌ వాక్కుం ముతనెలిక్కయుం ముంబిల్‌ కైక్యుం పింబిల్‌ ఇనిక్కుం' అన్న సామెతను తెలుగులోనికి 'పెద్దలు చెప్పిన మాటా, ముదిరిన ఉసిరికాయా ముందు చేదుగా ఉంటాయి.. తర్వాత తియ్యగా ఉంటాయి' అని అనువదించాం అనుకోండి.. పాఠకులు నవ్వుకుంటారు. దాన్ని మనం తెలుగులోనికి 'పెద్దల మాట చద్దన్న మూట' అని అనుసృజించాలి. అనుసృజన అనేది సృజనను అనుసరించి సాగుతుంది. అనువాదమేమో మూలాన్ని అనుకరించి ఉంటుంది. కాల్పనిక సాహిత్యంలో అనుసృజనే మేలైనది. తెలంగాణా పదకోశం నిర్మాణ క్రమాన్ని చెప్పండి? ఈ పదకోశం ఒక పద్ధతి ప్రకారం నిర్మించింది కాదు. ప్రామాణిక భాషకు ఏ భాషా, యాసా, మాండలికమూ తీసిపోవు. దేని సొగసు దానిదే! తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా వచ్చిందే నా పదకోశం. దానికి ఒక పరిమితమైన ప్రయోజనం ఉంది. తెలంగాణ ప్రాంతంలోని చాలా పదాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తయారైన, లేదా అంతకుముందు నిర్మితమైన నిఘంటువుల్లో చేరలేదు. అందుకని నేను కేవలం ఒక ఆరునెలల వ్యవధిలో నా జ్ఞాపకశక్తిని నమ్ముకొని ప్రామాణిక భాషలోని పదాన్ని తెలంగాణలో ఏమంటారు అని గుర్తుకు తెచ్చుకొని చేసిన పని ఇది. తెలంగాణ రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుగు అంటే మళ్లీ ఇప్పటిదాకా రాజ్యమేలిన ప్రామాణిక తెలుగు కాదు. తెలంగాణ రాష్ట్రంలో విధిగా అన్ని వ్యవహారాలు తెలంగాణ తెలుగులో జరగాలి. ఉదాహరణకు ప్రామాణిక భాషలోని 'జరగాలి' అన్న మాట తెలంగాణలో 'జరుగాలె' అని ఉంటుంది. 'క్యాబినెట్‌ భేటీ' అన్న సమాజం 'క్యాబినెట్‌ బైఠక్‌' కావాలి. తెలంగాణలో ఆ మాట చలామణీలో ఉంది. తెలంగాణ తెలుగులోనే పాలనా వ్యవహారాలు ఉన్నప్పుడు ప్రజల భాగస్వామ్యం సహజంగా ఉంటుంది. పరాయి మాట మన భావాన్ని అంతగా సరఫరా చేయదు. కన్వే చేయదు. అయితే తెలంగాణ తెలుగులోనే పాలనా వ్యవహారాలు, పాఠ్య పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండాలనేది అందరూ సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణలో పరిపాలనలోనికి వచ్చే పాలకులు ఈ విషయాన్ని బాగా పట్టించుకోవాలి. సాహితీ ప్రపంచంలో నాయకుడిగా, కార్యకర్తగా పని చేశారు కదా? ఏది ఇష్టం? కార్యకర్తగా ఉండడమే ఇష్టం. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కింది స్థాయిలో పుష్కలంగా ఉంటాయి. బాధ్యతలు కూడా తక్కువే. నాయకులం అయినాక బరువు బాధ్యతలు ఇబ్బంది పెడతాయి. అలంకారప్రాయ నాయకత్వం అందరూ విమర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తెలంగాణ రచయితల వేదిక అఖిల భారత అధ్యక్షుడిగా తెలంగాణ మలి దశ పోరాటంలో భాగంగా వచ్చిన 52 కవితల్ని 'ఉడాన్‌' పేరిట హిందీలోనికి అనువదింపజేశాను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరం సభను నిర్వహించాం. ఇన్ని చేసినా నాకు ఇష్టమైంది మాత్రం ఒక మంచి కార్యకర్తగా ఉండటమే! వర్ధమాన రచయితలకు మీరిచ్చే సందేశం ఏమిటి? బాగా అధ్యయనం చేయాలి. ఈర్ష్యలూ, అసూయలూ దరికి చేరనివ్వరాదు. ఒక కవిత రాస్తున్నామంటే.. ఆ విషయమ్మీద అంతకుముందు వచ్చిన కవితలన్నీ చదివి ఉండాలి. విలక్షణమైన పనులు చేయాలి. మనకు బాగా నచ్చిన, వచ్చిన పనులే చేయాలి. కీర్తికండూతుల కోసం వెంపర్లాట తగని పని. మనం సాహిత్యాన్ని సీరియస్‌గా భావించి కృషి చేస్తూ పోతున్న సందర్భంలో అవార్డుల్లాంటి గుర్తింపు వస్తే మంచిది. అంతేగానీ అవార్డుల కోసమే రాయడం అనే బలహీనతను అధిగమించాలి. సంభాషణ : డాక్టర్‌ బివిఎన్‌ స్వామి http://ift.tt/1j0apXj

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j0aqKK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి