పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Prasad PV కవిత

**//నాన్న జ్ఞాపకం//** వీళ్ళంతా నువ్వు లేవంటారేం నాన్నా.. నా ప్రతి అడుక్కీ దారి నువ్వే అవుతున్నావుగా, ఒకరినొకరు చూసుకోకుండా మనమెప్పుడైనా నిద్ర లేస్తున్నామా..! నీ చిరునవ్వుతో నిద్ర లేచిన ఉదయాన్ని రోజంతా శ్వాసిస్తూ రాత్రి నీ ఒడికి వస్తే నీ జ్ఞాపకాలతో తెల్లవార్లూ నన్ను లాలిస్తున్నావుగా…!! మరి వీళ్ళంతా నువ్వు లేవంటారేంటి..? కాలేజీకెళ్ళేప్పుడు పిల్లలు ‘తాతయ్యా.. బై’ అని ఆఫీసుకెళ్లేప్పుడు నేను ‘బాపూ వస్తా’ అనీ బయటికే చెప్తే మా ఎదురుగానే కూచుని నువ్వు మాకు ‘టాటా’ చెప్పేది వింతగా చూసేవాళ్ళకు కనపడ్డం లేదా..! రోజూ కలలోకొచ్చి నాతో నువ్వు కబుర్లాడుతుంటే అమ్మకు కోపమొచ్చి నాతో మాట్లాడ్డం మానేసింది.. నువ్వు అమ్మకు కలలో కనపడ్డం లేదటగా మరి..! నువ్వెప్పుడూ నన్ను నీ ఒళ్ళో బంధించి నీ ప్రేమను చూపకపోయినా జీవితంలోని ప్రేమంతా నీ కళ్లల్లోనే కనిపించేదిగా.. ఒక్కసారి అమ్మకు కూడా కనపడు నాన్నా..! సుతిమెత్తని నీ చేతివేళ్ల స్పర్శ గుర్తొస్తే కాలం ఎందుకు అక్కడే ఆగిపోలేదనిపిస్తోంది.. అప్పుడూ ఇప్పుడూ అంతే, ఏముంటుంది నాన్నా మన మధ్య..! నువ్వు నా గురించి, నేను నీ గురించి ఆలోచించడం తప్ప..!! నాకుతెలిసి నీ కళ్లల్లో నీళ్లెప్పుడైనా చూసానా.. నువ్వు నీ శ్వాసతో సెలవు తీసుకుంటున్నపుడు నావైపు చేయి చాపి రాల్చిన కన్నీటి బిందువు.. కాలం పేజీపై అలాగే గడ్డకట్టుకుపోయింది.. అప్పట్నుంచీ మనిద్దరం కలుసుకోనిదెప్పుడంటావ్....? రోజూ రాత్రి నా కనురెప్పల వెనక దాగి దోబూచులాడుతూనే ఉన్నావుగా,, మరి ఇంకా నువ్వు లేవంటారేంటి..? నా చిన్నప్పుడు నీ గుండెలపై తచ్చాడి ముద్దాడిన జ్ఞాపకం నాకు లేదు గానీ నాన్నా.. నాదొక్క కోరిక తీరుస్తావా.. నిన్ను నా ఒళ్ళోకి తీసుకొని ఒక్కసారి ముద్దాడాలని ఉంది నాన్నా!! (మా నాన్న స్మృతిలో...) -ప్రసాద్ పి.వి.

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3T0I9

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి