పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

గత శుక్రవారం గాలిబ్ గజళ్ల సంకలనంలోని 14వ గజల్ మొదటి రెండు షేర్లను చూశాము. ఈ వారం కూడా అదే గజల్ లోని మిగిలిన షేర్లను చూద్దాం. ఈ రోజు మొదటి కవిత గాలిబ్ సంకలనంలోని 14వ గజల్ మూడవ షేర్. గర్ చే హూం దీవానా, పర్ క్యోం దోస్త్ కా ఖావూం ఫరేబ్ ఆస్తీన్ మేం దుష్నా పన్హాం, హాథ్ మేం నష్తర్ ఖులా నేను పిచ్చివాడినైనా, భరించాలా మిత్రుడి మోసం చొక్కాలో చురకత్తి, చేతుల్లో శస్త్రచికిత్సల కత్తి ఇందులో ఉన్న కొన్ని ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. గర్ అంటే అయినప్పటికీ అని అర్ధం. ఫరేబ్ అంటే మోసం, ద్రోహం వగైరా. ఆస్తీన్ అంటే చొక్కా చేయి. దుష్నా అంటే చురకత్తి. నష్తర్ అంటే శస్త్ర చికిత్సకు వాడే కత్తి. దోస్త్ అంటే మిత్రుడు. ఈ కవితలో ఒక సన్నివేశం కల్పించి చెప్పడం జరిగింది. గాలిబ్ తన ప్రేయసి తిరస్కారం వల్ల పిచ్చివాడయ్యాడు. అలాంటి పరిస్ధితిలో గాలిబ్ కు మిత్రుడైన ఒక వైద్యుడు గాలిబ్ కు సహాయం చేయడానికి, అతడి పిచ్చి బాగుచేయడానికి వచ్చాడు. అతని చేతిలో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తి ఉంది. కాని అతడి చొక్కాలోపల మరో చురకత్తి ఉందని గాలిబ్ గమనించాడు. ఆ మిత్రుడు నిజానికి తనకు సహాయపడడానికి రాలేదని, మోసంతో చంపడానికి వచ్చాడని, ఎంత పిచ్చిలో ఉన్నా మిత్రుడి మోసానికి గురికావలసిన అవసరం లేదని అంటున్నాడు. ప్రేమవైఫల్యం వల్ల పిచ్చివాడిలా మారినప్పటికీ, మోసగాళ్ళ మోసానికి గురయ్యేది లేదని, తనకు సహాయం చేస్తామంటూ వచ్చేవారి నిజానిజాలు తాను గుర్తించగలనని ఈ పంక్తుల్లో చెప్పుకున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, ప్రేమవైఫల్యం వల్ల పిచ్చి పట్టింది. ప్రేమించిన అమ్మాయి దొరకనప్పుడు ఇక జీవించి ప్రయోజనమేమిటన్న భావం కూడా మనసులో ఉంది. అయినా మోసానికి గురయి, ద్రోహానికి గురయి ప్రాణాలు పోగొట్టుకోవడమేమిటి? చావడానికైతే చాలా మార్గాలున్నాయి. కాని మోసానికి బలయి చావడం మాత్రం ఎన్నటికి భరించలేనంటున్నాడు. మనిషిని నమ్మినవారే మోసగిస్తారు. మిత్రులే మోసం చేస్తారు. మోసపోవడం అన్నది ఒక పరాభవం లాంటిది. అలాంటి పరాభవాన్ని తాను భరించేది లేదని గాలిబ్ ప్రకటించాడు. పాతకాలంలో పిచ్చి, ఉన్మాదం వంటి రోగాలకు రక్తనాళానికి గాటు పెట్టడం ద్వారా వైద్యం చేసేవారు. అలాంటి శస్త్రచికిత్సను ఇక్కడ గాలిబ్ సూచించాడు. శస్త్రచికిత్సకు వాడే కత్తితో కూడా చంపవచ్చు, కాని గాలిబ్ చొక్కాలో చురకత్తిని గమనించానని చెప్పాడు. అంటే పైకి నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు సహాయం చేసే శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తిలా ఉన్నప్పటికీ, లోపల దురాలోచనలు ప్రాణాలు తీసే చురకత్తులవంటివని ప్రతీకాత్మకంగా చెప్పాడు. బుగల్ మేం ఛురీ ముం మేం రామ్ రామ్ అని హిందీలో ఒక సామెత ఉంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అని తెలుగులో కూడా అంటాం. ఇలాంటి భావాన్నే గాలిబ్ చక్కని కవితలో అల్లాడు. ఈ రోజు రెండో కవిత గాలిబ్ సంకలనంలోని 14వ గజల్ నాల్గవ షేర్ గో నా సమ్ఝూం ఉస్కీ బాతేం, గోనా పావూం ఉస్కీ భేద్ పర్ యే క్యా కమ్ హై కీ, ముఝ్ సు వో పరీ పేకర్ ఖులా ఆమె మాటలు అర్ధం కాకపోయినా, ఆమె అంతరంగం తెలియకపోయినా ఆ అప్సరస నాతో మాట్లాడుతోంది. అంతకన్నా ఏం కావాలి? ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. పరీ అంటే అప్సరస అని అర్ధం చెప్పుకోవచ్చు. పేకర్ అంటే రూపం అని అర్ధం. పరీ పేకర్ అంటే అప్సరస రూపమున్న అమ్మాయి. భేద్ అంటే రహస్యం. పావూం అంటే తెలుసుకోవడం, పొందడం వగైరా అర్ధాలున్నాయి. గో అంటే అయినప్పటికీ అని అర్ధం. ప్రేమ చిగురిస్తున్న రోజుల సన్నివేశాన్ని గాలిబ్ వర్ణించాడు. ఆయన ప్రేయసి అస్పరస వంటి రూపం కలిగిన స్త్రీ. ఆమె హావభావాలతో గాలిబ్ కు ఏదో చెబుతోంది. కాని ఆ మాటలు ఏవీ ఆయనకు అర్ధం కాలేదు. బహుశా ఆమె అందాన్నే చూస్తున్నాడు కాబట్టి అర్ధం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. లేదా ఆమె గాలిబ్ కు తెలియని విదేశీ భాషలో మాట్లాడి ఉండవచ్చు. పర్షియన్లో ఒక సామెత ఉంది. జుబాన్ యార్ మన్ తుర్కీ వ మన్ తుర్కీ నా మీ దానమ్. అంటే అర్ధం, నా ప్రేయసి టర్కీ భాష మాట్లాడుతుంది. నాకు టర్కీ భాష రాదు. గాలిబ్ పరిస్థితి అదే. కాని గాలిబ్ కు ఆమె మాటలు అర్ధం కాకపోయినా ఫర్వాలేదు. ఆయన నిరాశపడే మనిషి కాదు. ఆమె ఏం చెబుతుందో అర్ధం కాకపోయినా ఫర్వాలేదని, అసలు ఆమె అంతరంగం అంతుబట్టకపోయినా ఫర్వాలేదని, ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాబట్టి, తర్వాత అర్ధం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయం. తర్వాత ఆమె భాషను, ఆమె అంతరంగాన్ని అర్ధం చేసుకునే అవకాశాలు చాలా వస్తాయని ఆశిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆమె తనతో మాట్లాడుతుంది, తాను వింటున్నాడు. అది చాలు. ఇదే పెద్ద విజయం. ఇదే భావాన్ని మరో ఉర్దూ కవి కూడా చాలా చక్కగా చెప్పాడు. రాహ్ పే లగా తో లాయే హైం బాతోం బాతోం మేం ఔర్ ఖుల్ జాయేంగే దో చార్ ములాఖాతోం మేం ఇది చాలా సరళమైన కవిత. దీనికి అనువాదం కూడా అవసరం లేదు. మాటల్లో దారికి తెచ్చుకున్నాను. కొన్నాళ్లకు సంకోచాలు పోతాయి అన్నదే ఆ కవితకు భావం. ప్రేమికుల తొలిరోజుల పరిస్థితిని చాలా సున్నితంగా గాలిబ్ ఇందులో వర్ణించాడు. ఈ రోజు మూడో కవిత గాలిబ్ సంకలనం లోని ఐదవ షేర్ హై ఖయాల్ హుస్న్ మేం, హుస్న్ అమల్ సా ఖయాల్ ఖుల్ద్ కా ఇక్ దర్, హై మేరీ గోర్ కే అందర్ ఖులా అందం గురించి ఆలోచనలు సదాచరణల భావాలే నా సమాధిలో తెరుచుకున్న స్వర్గ ద్వారాలే ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ఖయాల్ అంటే ఆలోచన, మనోభావం. హుస్న్ అంటే అందం, మంచితనం, అందమైన ప్రేయసి, సూఫీతత్వంలో దీనికి అర్ధం దేవుడని కూడా ఉంది. ఎందుకంటే దేవుడు సౌందర్యవంతుడు. అమల్ అంటే ఆచరణ. హుస్నె అమల్ అంటే సదాచరణ. ఖుల్ద్ అంటే స్వర్గం. గోర్ అంటే సమాధి, దర్ అంటే ద్వారం. అందమైన తన ప్రేయసి గురించి ఆలోచనలు సదాచరణలను పాటించడంతో సమానమంటున్నాడు. ఇస్లామీయ విశ్వాసం ప్రకారం దేవుడిని విశ్వసించి మంచిపనులు చేసేవారు స్వర్గార్హత పొందుతారు. మనిషి మరణం తర్వాత అంత్యక్రియాలు ముగిసిన పిదప ఇద్దరు దైవదూతలు నకీర్, మున్కిర్ లు అతడి ముందుకు వస్తారు. మరణించిన ప్రతి మనిషిని ప్రశ్నించడానికి దేవుడు నియమించిన దైవదూతలు వాళ్ళు. ఆ మనిషి తన జీవితంలో చేసిన మంచి చెడు పనులన్నింటి చిట్టా వారి వద్ద ఉంటుంది. చెడు పనులు చేసి మరణించిన వ్యక్తి పట్ల వారు చాలా కఠినంగా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే సదాచరణలు పాటించిన వారి పట్ల చాలా మృదువుగా వ్యవహరిస్తారు. అలాంటి మంచివారు, పుణ్యాత్ముల సమాధిలో స్వర్గం వైపు ఒక ద్వారం తెరుచుకుంటుంది. దానివల్ల వారి సమాధిలో చీకటి ఉండదు. హాయిగా ఉంటుంది. గాలిబ్ అలోచనల్లో ప్రతిక్షణం అతడి ప్రేయసే ఉంది. అందమైన తన ప్రేయసి గురించి మాత్రమే అనుక్షణం ఆలోచిస్తున్నాడు. అంటే నిరంతరం తాను మంచిపనులు, సదాచరణలే చేస్తున్నానంటున్నాడు. కాబట్టి దైవదూతలు తీసుకొచ్చే ఆయన ఆచరణల చిట్టాలో అన్నీ మంచిపనులే ఉంటాయి. కాబట్టి సన్మార్గంలో జీవించిన వ్యక్తిగా యోగ్యత పొందుతాడు. చీకటి సమాధిలోనే అతని కోసం ఒక స్వర్గద్వారం తెరుచుకుంటుంది. ఈ కవితలో ఇస్లామీయ విశ్వాసాలను సూచనాప్రాయంగా గాలిబ్ ప్రస్తావించాడు. వాటిని అర్ధం చేసుకుంటే ఈ కవితను మరింతగా అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఆది నుంచి జన్మించిన మానవులందరినీ దేవుడు ప్రళయానంతరం తీర్పుదినం రోజున మళ్ళీ బతికిస్తాడు. ప్రళయాన్ని ఖయామత్ అంటారు. అప్పటి వరకు చనిపోయిన వారందరూ తమ సమాధుల్లోనే ఉంటారు. (ఇక్కడ ఇస్లామీయ విశ్వసాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చనిపోయిన వారందరూ తమ సమాధుల్లోనే ఉంటారని రాశాను. అంత్యక్రియల్లో దహనమైన వారి గురించి ఇస్లామ్ ఏమంటుంది అన్న ప్రశ్న రావచ్చు. ఇక్కడ ఇస్లామీయ విశ్వాసాల చర్చ లేదు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఏమైనా, చనిపోయిన వారందరూ బర్జఖ్ అనబడే లోకంలో ఉంటారన్నది ఇస్లామీయ విశ్వాసాల్లో భాగం.) గాలిబ్ తాను ఎల్లప్పుడు తన ప్రేయసి ధ్యానంలో ఉండి మంచిపనులే చేసాను అంటున్నాడు. అయితే తనకు స్వర్గం దొరికేసిందని చెప్పడం లేదు. తన చీకటి సమాధిలో స్వర్గం వైపు ఒక ద్వారం తెరుచుకుందని అంటున్నాడు. మరో విషయం ఏమంటే ప్రాణంగా ప్రేమించే ప్రేయసి ఆలోచన ఒక హాయి పవనం లాంటిది. సమాధి చీకటిలో కూడా ఆమె ఆలోచన వస్తే చీకటి సమాధి వెలిగిపోతుందన్న భావం కూడా ఈ పంక్తుల్లో ఉంది. గాలిబ్ పదప్రయోగం ఇక్కడ గమనించదగ్గది. సాధారణంగా ఏ మతంలో అయినా మంచిపనులంటే ఏవి, సత్యాన్ని పలుకడం, తోటివారికి సహాయపడడం, బలహీనులకు సహాయపడడం, దుర్మార్గానికి దూరంగా ఉండడం వగైరా. తన ప్రేయసి గురించిన ఆలోచనలను వీటన్నింటితో సమానంగా నిలబెట్టాడు. ఆ విధంగా మతంపై ఒకవిధమైన తిరుగుబాటు ధ్వనింపజేశాడు, కాని ఆ వెంటనే మతవిశ్వాసాల ప్రకారం స్వర్గం అనేది కేవలం ఖయామత్ తర్వాత మాత్రమే లభించేది, కాబట్టి తనకు స్వర్గం లభించిందని చెప్పలేదు. స్వర్గార్హత పొందానంటూ తన సమాధిలో ఒక ద్వారం తెరుచుకుందని రాశాడు. అంటే మతవిశ్వాసాలను అతిక్రమించనూ లేదు. ఈ సమతుల్యం గాలిబ్ కవితల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. సమాజంలో అనవసరంగా మనోభావాలు గాయపడే వ్యక్తీకరణలకు దూరంగా ఉండడం అనేది ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ గజల్ ప్రారంభం నుంచి ఈ కవిత వరకు ఎక్కడా సూఫీ తత్వం రాలేదు. కాని ఈ చివరి కవితలో లోతయిన సూఫీతత్వం కనబడుతుంది. ఒక కవిసమ్మేళనం గురించి వర్ణన, ప్రేయసి తిరస్కారం వల్ల పిచ్చి పట్టినా, బతకాలని లేకపోయినా నమ్మకద్రోహాన్ని భరించేది లేదన్న ప్రకటన, ఆ పిదప తన ప్రేయసితో మొదటి పరిచయం గురించిన ప్రస్తావనలు ఇంతవరకు గజల్ లోని ప్రతి కవిత వేర్వేరు కవితల్లా కనిపించాయి. కాని ఈ చివరి కవితని పరిశీలిస్తే వాటన్నింటిని అనుసంధానం చేసే సూత్రంలా కనిపిస్తుంది. సూఫీతత్వం ప్రకారం దేవుడే సౌందర్యం. సూఫీలు దేవుడిని ప్రేమిస్తారు. ఇప్పుడు పై కవితలో ప్రేయసి స్ధానంలో దేవుడిని ఉంచి అర్ధం చేసుకుంటే కవితకు అర్ధమే మారిపోతుంది. గాలిబ్ అనుక్షణం సౌందర్య ధ్యానంలోనే ఉన్నాడు. అంటే దేవుడి ధ్యానంలోనే ఉన్నాడు. దేవుడిని అనుక్షణం ధ్యానించే మనిషి ప్రతి పని మంచిపనే చేస్తాడు. ఆ విధంగా గాలిబ్ తన జీవితంలో ప్రతి క్షణం సదాచరణల్లో గడిపాడు. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత అతడి చీకటి సమాధి దేదిప్యమానంగా వెలిగిపోతుంది. ఈ కవితను సూత్రంగా చేసుకుని గజల్ లోని మిగిలిన షేర్లను భావార్ధాన్ని తెలుసుకోవచ్చు. మొదటి రెండు షేర్లలో గాలిబ్ కవిసమ్మేళనం గురించి చెప్పిన వర్ణనలో చెప్పిన విషయాల్లోను నిగూఢంగా చక్రవర్తి దర్బారులో కవిసమ్మేళనం గురించి చెబుతూ ఇది శాశ్వతంగా ఉండేలా చేయమన్నాడు. కాని శాశ్వతంగా ఉండడమన్నది ఇహలోకంలో దేనికీ సాధ్యం కాదు. పరలోకంలో మాత్రము సాధ్యం. తర్వాత ఆకాశాన్ని ద్వారం తెరుచుకున్న మందిరంలా దేదిప్యమానంగా ఉందని వర్ణించడంలోను ఆధ్యాత్మికతను అంతర్లీనంగా ప్రస్తావించాడు. మిత్రద్రోహం గురించి చేసిన ప్రస్తావనలోను, చావు అది వచ్చినప్పుడు రానీ, కానీ మోసానికి బలయ్యేది లేదని చెప్పడంలో అంతర్లీనంగా ఇస్లామీయ విశ్వాసాల ప్రస్తావన ఉంది. మనిషిని మార్గం తప్పించే షైతాను మిత్రుడిలా నటిస్తూ మోసం చేస్తాడని, ఆ మోసానికి గురై దైవాగ్రహానికి పాల్పడరాదన్న భావం ధ్వనిస్తుంది. చివరి కవితను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మిత్రుడి మోసం అన్న కవిత మరింత లోతయిన కవిత. సాధారణంగా మతం, ధర్మం పట్ల అంత పట్టింపు లేకుండా గడిపేస్తున్నప్పుడు పొరబాట్లు జరగవచ్చు. మనిషిలో దేవుడికి తనపై కోపం వచ్చి ఉంటుందన్న ఆలోచనలు కూడా రావచ్చు. ప్రేయసి తిరస్కారం అన్న పదాలు ఇక్కడ దేవుడికి ఆగ్రహం వచ్చిందన్న భావంగా అన్వయించుకుంటే, మిత్రద్రోహానికి పాల్పడే వారెవరన్నది సులభంగా అర్ధం అవుతుంది. ఒకసారి దేవుడి అనుగ్రహం పట్ల నిరాశ చెందిన వ్యక్తిని దారి తప్పించడానికి షైతాను చాలా సులభంగా ప్రయత్నిస్తాడని, మిత్రుడిగా అంటే ఆలోచనల్లో దైవతిరస్కారమే మంచిదన్న భావాలు చొప్పించడం ద్వారా మనిషిని నాశనం చేస్తాడన్న భావం ఉంది. అలాంటి మోసానికి తాను గురిఅయ్యేది లేదని ప్రకటించాడు.అలాగే ప్రేయసి మొదటి పరిచయం గురించి చెప్పిన కవితలోను ఇదే సూఫీతత్వం ఉంది. మనిషి దైవగ్రంథం చదివినప్పుడు లేదా దేవుడి గురించి తెలుసుకుంటున్న మొదటిలో బహుశా అర్ధం కాకపోవచ్చు, కాని దైవం గురించి తెలుసుకునే ఆ అవకాశం కన్నా గొప్పేముందన్న భావం ఉంది. అంటే చివరి కవితను ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే మొత్తం గజల్ కొత్త అర్ధాలు తెలుస్తాయి. ఈ కవితలో పదడాంబికాలు లేవు. సరళమైన పదాలు. నిజానికి కవితలోని రెండు పంక్తులు రెండు వాక్యాల్లా కనిపిస్తున్నాయి. ఒక అత్యున్నత స్ధాయి ప్రేమను ప్రకటించేటప్పుడు పదడాంబికాల అవసరం లేదు. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k4BxX6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి