పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Kapila Ramkumar కవిత

ఈ పీఠీకలు సాహిత్య వాటికలు Posted on: Mon 21 Apr 01:53:59.260211 2014 ప్రపంచ సాహిత్య పరిణామ క్రమాన్ని పరికిస్తూ, దిశదశలను దర్శిస్తూ, సైద్ధాంతిక భూమికతో కూడిన లక్ష్యాలను శ్వాసిస్తూ, నిర్ధిష్ట మార్గాన్వేషైన నిరంతర సాహిత్య సాధకుడు కె.శివారెడ్డి. కవిత్వమే జీవితంగా జీవితమే కవిత్వంగా అక్షరాల్ని ఆయుధాలు చేస్తున్న కవి ఆయన. శివారెడ్డి కవిత్వం మహోజ్వల అగ్నిధార. వచనం మహోద్వేగ జలపాతం. ఇప్పటికీ తనకు తాను తన శబ్ధ ప్రపంచంలో తన ఆత్మశైలిని కొత్తగా పునర్‌ నిర్మించుకుంటూ, క్షిపణి లాంటి వాక్యమై జనిస్తుంటాడు. కవిత్వంలోకి అడుగిడిన ఈయన తొలి దశలో సమీక్షలు రాసి ఉండవచ్చునేమో గాని, కవిగా పరిణితి చెందిన తరువాత, సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం తప్ప మిగిలిన ప్రక్రియల జోలికి వెళ్లినట్లు అగుపించరు. ఆయన శ్వాస ధ్యాస కవిత్వంగానే కనిపిస్తుంది. యువ కవులను, నవ కవులను ప్రోత్సహించడానికయితేనేమి, మోమాటానికైతేనేమి, స్నేహిత ధర్మానికైతేనేమి - దాదాపు 86 పుస్తకాలకు పీఠికలు రాశారు. ఈ పీఠికలు ఆషామాషీగా రాయకుండా, మూడు దశాబ్దాలుగా తెలుగు కవిత్వంలో వచ్చిన పరిణామక్రమాన్ని తీవ్రతను, ప్రపంచ సాహిత్యంతో సరిపోల్చుకుంటూ, చర్చిస్తూ, హెచ్చరిస్తూ విప్లవ కవిత్వ భూమికను తెరపైకి తెస్తూ నిర్మొహమాటంగా రాశారు. ఒక్కొక్క పీఠికను ఒక్కొక్క సాహిత్య వ్యాసంగా పరిగణించవచ్చు. ఈమధ్య పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి సంపాదకత్వంలో 'శివారెడ్డి పీఠికలు' అనే సంపుటి వెలువడింది. ఈ పీఠికలన్నీ 1976 - 2010 మధ్య రాసినవి. ఈ ముందు మాటల్లో ఏ కవినీ అభిమానించి, ప్రోత్సాహం మిషతో గోరంతలు కొండంతలుగా చెప్పడం కనిపించదు. అలాగని కవిని కించపరచడమూ, డిస్క్‌రేజీ చేయడమూ ఉండదు. కవిత్వంలో చేరాల్సిన లోతుల్లోకి చేరలేకపోయినా, ఎదగాల్సిన ఎత్తుల్లోకి ఎదగలేకపోయినా, సైద్ధాంతిక పరంగా జాగిపోతున్నా, నిబద్ధత, నిజాయితీ, స్పష్టత లోపిస్తున్నా శివారెడ్డి తన ముందుమాటలో సునిశితమైన సూచనలు చేశారు. సందర్భోచితంగా బాగా రాసే ప్రపంచ కవుల్లో తగిన వారిని 'కోట్‌' చేస్తూ వివరణలిచ్చారు. ఆయన ముందుమాట కవికి కచ్చితంగా ఒక పాఠం. ఆయన పీఠికలో కవికి చేసే హెచ్చరిక ఎలా ఉంటుందంటే 'ఈరోజు కవిత్వాన్ని ముట్టుకోవడం అంటే అగ్నిని ముట్టుకోవడం. ఒక బాధ్యతని నెత్తిన వేసుకోవడం. ఒక బరువును జీవితాంతం మోయడం. అనంత వైవిధ్యంతో కూడిన జీవితాన్ని దాని అనేక ముఖాల్ని అంశాల్నీ తెలివిడితో వ్యక్తీకరించడం'లా ఉంటుంది. 'మన జీవితాన్ని శాసించే రాజకీయం అర్థం కాకుండా, ప్రజా రాజకీయాలు అర్థం కాకుండా, జాతీయ అంతర్జాతీయ స్థితి అంతుబట్టకుండా, నీదైన ఒక రాజకీయ వైఖరి, ప్రాపంచిక దృక్పథం అలవడకుండా- అందులోంచి చూసి, బతుకును విశ్లేషించకుండా ఎవరేని ఒక మంచి కవిత రాస్తారని నేననుకోను' అంటారు శివారెడ్డి. కవికి సొంత గొంతుక అవసరమనే అంశాన్ని దృఢంగా వ్యక్తీకరిస్తూ- 'కవి సొంత గొంతుకతో ఉనికి వ్యక్తిత్వం సంపాదించుకోవాలి. సూటైన, పదునైన, నిజాయితీ గల, నిబద్ధమైన, స్పష్టమైన గొంతుక, సైద్ధాంతిక భూమికాసారంలో చక్కని కవిత్వాన్ని వెదజల్లుతున్న గొంతుక, ఆచరణ బద్ధమైన ఆలోచనలతో తీవ్రమవుతున్న, హరితమవుతున్న గొంతుక కావాలి' అంటారు. కవి వాడిన పదాలు, పద చిత్రాలు పరిశీలించినట్లయితే, కవి ఎంత మెలుకవగా ఉన్నది, ఎవరి పక్షాన నిచిలి ఉన్నది, ఎవరి కోసం పోరాడుతున్నది, అతని ఊహ ఏమిటి? వ్యక్తిత్వం ఏమిటి? అంతా బోధపడుతుంది. ఎంత కాలాన్ని కవిత్వం కోసం కవి ఖర్చు పెట్టిందీ తెలుస్తుంది.' అంటాడు. 'ఈనాడు విప్లవ చైతన్యంతో వస్తున్న కవిత్వమే ప్రధాన స్రవంతిగా భావించాలి. బహుశ ఇదే ఇతర అన్ని రకాల కవిత్వాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నిర్ధేశిస్తుంది. సైద్ధాంతిక నిబద్ధత విడనాడకుండా చాలా గొప్పగా వైవిధ్యం ప్రదర్శించవచ్చు. ఒక సైద్ధాంతిక భూమిక నుంచి తనదైన ప్రాపంచిక దృక్పధం నుంచి ప్రపంచాన్నీ జీవితాన్ని విశ్లేషిస్తూ కవిత్వం నడవాలి' అంటూ తాను నమ్మి నడుస్తున్న కవితా మార్గాన్ని తన పలు పీఠికల్లో వ్యక్తీకరిస్తాడు శివారెడ్డి. 'మార్క్సియన్‌ ప్రాపంచిక దృక్పథం నుంచి ప్రపంచాన్ని దర్శిస్తున్న కవి దేన్నీ వదలడు. విధ్వంసానికి కారణభూతములవుతున్న అనేకానేక అంశాల్ని పలు కోణాల్లో దర్శించి విశ్లేషిస్తూ తనదైన అనుభవం నుంచి, దృక్పథం నుంచీ జీవితాన్ని విడమర్చుకుంటూ పోతాడు. తన రక్తంలోంచి జన్మించే పద్యం కోసం కవి అహర్నిశలూ ఆరాటపడతాడు. అధ్యయనం చేస్తాడు. దగ్ధమవుతాడు. ఆ దగ్ధంలోంచి పుటం పెట్టుకుని స్వచ్ఛమైన కవి బయటకు వస్తాడు..' అంటూ కవి రాటుతేలి బయటకు వచ్చే వైనాన్ని విప్పి చెప్తాడు శివారెడ్డి. 'మధ్య తరగతి జీవితంలోంచి వచ్చిన కవులు ఒక 'కన్‌ఫ్యూజన్‌'లోకి, ఒక సైద్ధాంతిక డొల్లతనంలోకి, జీవన నిష్క్రియాశూన్యంలోకి, ఒక ఆధ్యాత్మికవాదంలోకి నెట్టబడుతుంటారు. వారు జాగ్రత్త పడకపోతే కవిత్వం 'డి హ్యూమనైజ్‌' అవుతుంది.. గమనించండి...' అంటారు. కవిత్వం ఆత్మక్షేత్రం మధ్య ఎర్రగా పూసి అక్షరంలా బయటకు వస్తుంది. 'రాజ్యానికి మింగుడుపడని, రాజ్యవిచ్ఛేదక కవిత్వం రాయడమంటే ప్రజా రాజకీయాల కవిత్వం రాయడమే'నంటారు. మారుతున్న కాలాన్ని కవి గమనించాలి. వివేచనతో, వివేకంతో, లోచూపుతో ప్రజల భాషను 'ఫిల్టర్‌' చేసుకొని, సొంతం చేసుకొని కవిత్వంగా పరివర్తనం చెందేట్లు చేస్తాడు కవి.. ఏ ప్రక్రియలో కవిత్వం రాసినా కవిత్వానికి ఒక సామాజిక దృక్కోణం ఒక సామాజిక ప్రయోజనం, ఒక దిశానిర్ధేశం, నైర్మల్యం, జీవద్భాష ఉండాలి. కవి గురి కాలం మీదే ఉండాలి. కాలమే అతని ఊపిరిగా సాగిపోతుండాలి. కవిత్వం ఎప్పుడూ అమానవీకరణకు గురి కాకూడదు.' 'కవిత్వం దాన్నదే పరిచయం చేసుకోవాలి గాని మధ్యలో మరొకరు తన ఉద్ధేశాలను అనుసంధించి చదువబోయే కవిత్వం గురించి నాలుగు మాటలు సర్టిఫికేట్లు అవసరమా?' అంటూ ముందుమాటలు రాయించుకోవడం మీద ఒక అసంతృప్తిని శివారెడ్డి వెల్లడించారు. 'ముందుమాట కవికి ఆత్మస్థయిర్యాన్నివ్వాలి పొగడ్తల పూలదండలతో కవిని ఊరి తీయకూడదు.' అంటాడు. ప్రజా వ్యతిరేక పంథాలను ప్రోత్సహిస్తూ తళుకుబెళుకులతో సాహిత్యం చూరుబట్టుక వేలాడుతున్న ముక్కిడి భావాలను ఖండిస్తూ సైద్ధాంతిక నిబద్ధతతో విప్లవ చైతన్యంతో కూడిన ప్రజా సాహిత్యానికి శివారెడ్డి పీఠికల్లో పెద్ద పీట వేశారు. రెండు కథా సంపుటాలు, రెండు పాటల సంపుటాలకుు రాసిన పీఠికలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆధునిక కవిత్వం ఆర్ధ్రత పొరలు తొలుచుకొని లోపలికెళ్లే మార్గాన్ని, దానికి కావాల్సిన చూపును శివారెడ్డి పీఠికల్లో వెతుక్కోవచ్చు. కొందరు కవులు ఆధునికానంతర వాదం ముసుగులో నైరాశ్యం, ఆత్మవిధ్వంసనం, తాత్వికపరమైన బోలుతనంతో మార్కి ్సస్టు భావజాలాన్ని ధ్వంసించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు మానవ సమూహాల నుంచి విడిపోతూ, విరిగిపోతూ వ్యక్తులు, అవ్యక్తులుగా మారే ప్రమాదం ఉందంటారు శివారెడ్డి. సమాజంలో అధిక సంఖ్యాకులైన అట్టడుగు వర్గాలు తలెత్తుకు నిలబడేందుకు బిగుతునిచ్చే వెన్నుదన్నైన సిద్ధాంతాన్ని పట్టుకుని, కవిత్వ విస్తృతికీ, విశాలత్వానికీ, ఒక గొప్ప ఆశ, ఆకాంక్ష, స్థితప్రజ్ఞతో, ఆరాట పోరాటాలతో, స్వీయాత్మతో సామూహిక ఆత్మని అనుసంధానం చేసుకుంటూ ముందుకుపోయే చైతన్యం ఈ పీఠికల్లో కనబడుతుంది. ఈ పీఠికలు వెలుగు చూసేందుకు సహకరించిన గుడిపాటి, పెన్నా అభినందనీయులు. ఈ పీఠికలు సాహిత్య లక్ష్యాన్ని, మార్గాన్ని నిర్ధేశించుకునే చైతన్యాన్ని నవ కవులకు, యువ కవులకు కలిగిస్తాయి. దశాబ్దాల సాహిత్య పరిణామక్రమాన్ని అర్థం చేసుకోడానికీ ఉపకరిస్తాయి. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9948774243 http://ift.tt/1f38ilg

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fmNaBi

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి