పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :-20 (కవి సంగమం) "అదృశ్యలోకంలో ఆకాశం సాక్షిగా కవి అంతఃసంఘర్షణలే తమో చిత్రాలు" కవిత్వ సంపుటి పేరు :-" తమో చిత్రాలు" రాసిన కవి పేరు :- నారయణ శర్మ. మల్లావఝ్జల కవిత్వాన్ని పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "నాలో ఇందరున్నారని తెలిసింది పగిలిన అద్దం చూసాకే"-1 "కవిత్వమంటే అస్థిత్వ యాత్రే నాలోని నన్ను నీలా వేరుగా చూడ్డం"-2 "బౌద్ధం, కవిత్వం ఒక లాంటివే బుద్దుడూ కవి ఇద్దరూ తాపసులే మరి"-3 ఇవి నారాయణ శర్మ గారి (1,2,3)"అస్తిత్వ పుష్పాలు"-అనే నానీలు లోని కొన్ని శకలాలు. ఈ కవిత్వ శకలాల సారాంశాన్ని లోతుగా అధ్యయనం చేయగలిగితే నారయణశర్మ గారి కవిత్వ వ్యక్తిత్వం అవగతమవుతుంది.ఈ మాటలే ఆయన అంతరంగభావాల్ని పట్టిస్తాయి. "తమో విరహిణి వెంట్రుకలు విరబోసుకొని ఆకాశం నిండా ఆరబోసుకొన్నప్పుడు చుక్కల మల్లెల్ని తలలో తురుముకున్నప్పుడు నేనూహించాను" ఇలా చీకటి రాత్రిని విరహిణి ఆరబోసుకొన్న శిరోజాలతో ఉత్ప్రేక్ష చేసి అక్షరాలను మృదంగా ధ్వానం చేసిన వాడు, "అనుభూతిని కాగితం పై కక్కేశాను,కాగితం పై కవిత్వం నవ్వుతుంది" అంటూ కవిత్వ హసనాన్ని ధ్వనింప చేసినవాడు," నా పెదాలు కదలకుండా, నా గొంతు పెగల కుండా, ఓ శబ్దం పుట్టుక...నా కలం నుంచి" అంటూ అంతరంగ అరల్లో తన కవిత్వావిర్భావం జరుగుతుందని ధృవీకరించినవాడు ఎవరంటే అతడు మల్లావఝ్ఝల నారాయణ శర్మ అని నేనంటాను. నారాయణశర్మ గారు కేవలం కవే కాదు సంగీత విద్వాంసుడు,చిత్రకారుడు కూడా.సాహిత్యం అతని తండ్రైతే, కొన్నేళ్ళవరకు తన ఒడిలో లాలించిన తల్లి మృదంగ సంగీతం.కళ్ళల్లో కల గన్న చెలి చిత్ర కళ.సంగీత,సాహిత్యాల రహస్యాలను వొడిసిపట్టుకున్న శర్మ గారు చిత్రకళను ఆయువుపట్టుగా అభ్యసించటంచే ఆయన జీవితం ముక్కోణపు పువ్వులా వికసించింది. "తమోచిత్రాలు"రాసిన నారాయణ శర్మకు, "మౌనశంఖం" అధివాస్తవిక స్వరంతో మ్రోగించిన శ్రీరంగం నారయణబాబుకీ పేరులోనే కాదు యాధృచ్ఛిక సంబంధం జీవితంలో కూడా కొంచెం కాకతాళీయత కనిపిస్తుంది.ఇరువురు కవులు,సంగీతం తెలిసినవారు,చిత్రకళను అభ్యసించినవారు.పైగా ఇద్దరు అధివాస్తవికతను కవిత్వంలో నిక్షిప్తం చేసి రసావిష్కరణ చేసినవారు.అందుకే నారాయణ శర్మ గారి "తమో చిత్రాలు"అనే కవితా సంపుటిని ఈ వారం పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆధివాస్తవిక తాత్వికతను అవగాహన చేసుకోనే ధోరణి తెలుగు నేలలో వున్నా,ఎందుకో ఈ వాదం పాఠకుల ఆదరణకు నోచుకోలేదు.బాహ్యాంతరాల చేతనావస్థల్ని పునఃసంధానపరిచే విధానమే అధివాస్తవిక వాదం.బాహ్య ప్రపంచంలోని సంఘటనలు,సామాజిక విలువలతో వాటి పట్లలోక విధానంపట్ల వున్న అసలైనా అనుభూతులు,తీవ్రతలు కలగలిపి సరికొత్తరూపంలో సరికొత్త రూపంలో సరికొత్త క్రమంలో అందుకొనే ప్రయత్నమే అధివాస్తవికత వాదం.అధివాస్తవిక రచనా సాఫల్యానికీ నిదర్శనం ఈ "తమోచిత్రాలు" కవితా సంపుటి.అధివాస్తవికత ఏ ఆఛ్ఛాదనలు,ఏ సంకెళ్ళు లేని స్వేచ్ఛాయుత మానవున్ని చూడాలని కాంక్షించింది.మనిషి ఆలోచనలు,చర్యలు అతని జీవితం నుండి నిద్రాస్థితిలోనే జీవం పోసుకొంటున్నాయి.ఆ జీవం పోసుకుండే ప్రదేశానికీ వెళ్ళడానికీ మనిషి భయపడుతున్నాడు.మనిషిని ఆ ప్రదేశానికి తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేసేది అధివాస్తవికత."తమోచిత్రాలు" అనే ఈ సంపుటి లో వుండేది జీవితమే. అద్భుతమైన క్రమం,అద్భుతమైన శైలి ఈ సంపుటిలో కనిపిస్తుంది.మనిషి అంతరాంతరాల్ని, చైతన్యపు లోతుల్ని ఆవిష్కరించే ఉత్కృష్ట వాహికగా ఈ అధివాస్తవిక తమోచిత్రాలు నిలుస్తాయి. శ్రీరంగనారాయణబాబు,తిలక్,బైరాగి,అజంతా,శేషేంద్ర,వేగుంట,ఇస్మాయిల్ మున్నగు గొప్ప కవులను అధ్యయనం చేసిన అనుభవం శర్మ గారి "తమోచిత్రాలు" సంపుటికి పునాదేమో? డా:సి.నా.రె గారు నారాణశర్మ గారి తమో చిత్రాలు" కవితా సంపుటికీ ఆశీస్సులు అందజేస్తు"శర్మ గారి కంటికి "తమస్సు" రాత్రి కనిపించే "చీకటి" కాదు ఆవేదనకు,ఆందోళనకు తీవ్రస్వరంతో నిన దించే అంతఃసంఘర్షణకు ప్రతీక" అన్నారు.అంతేకాదు ఇది వ్యక్తావ్యక్తం పునాదిగా సాగిన కావ్యం.ఈ కావ్యంలోని ఇమేజీరీ, సింబల్, వాస్తవికతలు అధివాస్తవికతలో కరగిపోయి దీనికీ ఒక కొత్త రూపాన్ని ఇచ్చాయి. "అదృశ్యలోకంలో"-అనే కవితను "నోటినిండా నిశ్శబ్దాన్ని /కళ్ల నిండా చీకటిని కుక్కుకొని"-అని ఆరంభిస్తాడు.నోట్లో నుండి శబ్దం ఆవిర్భవిస్తుంది.కళ్ళు కాంతిని ఇష్టపడతాయి.కానీ కవి నోట్లో నిశ్శబ్దం ,కళ్లల్లో చీకటి అంటూ తిరగేసి చెప్పి వొక అనూహ్యతను సృష్టించి పాఠకునికి వూహకు వొదిలి పెడతాడు."పాత వాటిని మరమ్మత్తు" చేయడమంటే వున్న శబ్దాలను కొత్తగా రూపొందించటం.ఆ ప్రయత్నంలో నిశ్శబ్దం ముక్కలై వొక చీకటి రంగుల లోకం నిలిచిందని చెబుతూ తనలోని ఘర్షణని స్ఫురింప చేస్తాడు. అచేతన,చేతనావస్థలో కవి తన అంతరంగాంతరిక్షంలో చేతన పొందిన భావం ఆకృతి పొందె సందర్భంలో కళ్ళ నిండా చీకటి రంగులు పులిమిన కొత్తలోకం ఆవిష్కరించబడిందంటున్న కవి చేతనలో "ఇవన్నీ నా ఊహలే...యథార్ఠం కాదు"-అని అంటూనే అచేతనలో "అబద్ధం..కాదు" అని అంటాడు.ఇలా పఠితను సందిగ్ధతకు గురి చేసి ఆలోచనలోకి నెట్టివేస్తాడు. "కళ్లు మూసుకొనే చూస్తున్నాను నాలుక కదపకుండానే... మాట్లాడుతున్నాను నోరు మెదప కుండానే కంఠనాళాలు ధ్వనించకుండానే నా నుంచి పాత గుర్తుల్లో కొత్త శబ్దాలు" ఇలా కవి కవితలో కళ్లు మూసుకొని చూడటం,నాలుక కదపకుండా మాట్లాడటం ,కంఠ నాళలు కంపించకుండానే కొత్త శబ్దాలు పుట్టడం ఇవన్నీ పాఠకున్ని అధివాస్తవిక లోకంలోకి తీసుకెళ్ళడానికే కవి ప్రయోగించాడని అనుకోవచ్చును. సర్వ సాధారణంగా కోరికలను గుఱ్ఱాలతో పోలుస్తుంటారు.ఈ అంశాన్ని గ్రహణంలోకి తెచ్చుకొని కవి తన అంతరంగంలో అణగారిన కోరికలను రెక్కల గుఱ్ఱాల పిల్లలుగా రూపకం చేస్తూ,చివరకు అవి పెద్దవై తనను గిట్టల వెనకనించి లాక్కెళుతున్నాయని కొత్త పద ప్రయోగం చేస్తాడు.అసలు నిజాన్ని మరచినప్పుడు జాగృతం అయిన మనస్సు కోరికల్నీ వెనక్కి మళ్లించిందని సూచించడానికీ ఈ పద ప్రయోగం చేసివుండవచ్చును."తవ్వుతున్నంతసేపు తాకిడి మెత్తగానే ఉంది"అని అంటున్న కవి "పాత గుర్తుల్లో కొత్త శబ్దాల నిర్మాణం అదృశ్యపు లోకాల అరల్లో అదే సుప్త చేతనావస్థల్లో సాగిందనే నూతన అభివ్యక్తిని పాఠకులకు అందజేస్తాడు. కవి భావానికీ పాఠకుడు (శ్రోత)తన మనస్సులో రూపాన్ని ఇవ్వగలిగే శక్తిపైనే ఏ అధివాస్తవిక కవిత్వ విలువైనా ఆధారపడివుంటుంది.అధివాస్తవిక కవిత్వం పరమార్థం అర్థాన్నివ్వటం కాదు.రసావిష్కరణ అధివాస్తవిక కవిత్వ ముఖ్యలక్షణం.ఈ సంపుటిలో పఠిత(శ్రోత)కు రసావిష్క రణ కలిగించే కవిత "ఓ తమో చిత్రం వెనుక". ఈ కవితలో కవి సూర్యాస్తమయమై రాత్రి ప్రవేశించటాన్ని ఎంత గొప్పగా చెప్పాడో చూద్దాం "పడమటి కొండలవైపు వెలుగు ఒత్తిగిలి పడుకున్నప్పుడే నాకు తెలుసు నేను లొంగిపోతానని" సూర్యుని వెలుగు పడమటి కొండల వైపు వెళ్ళి సర్దుకొని ముడుచుకొని పడుకుందని అనటంలో కవి భావం పాఠకుడు(శ్రోత) హృదిలో ఎలాంటి రసాన్ని ఉత్పత్తి చేస్తుందో ఊహించవచ్చును. "తమో విరహిణి వెంట్రుకలు విరబోసుకొని ఆకాశం నిండా ఆరబోసుకున్నప్పుడు చుక్కల మల్లెల్ని తలలో తురుముకొన్నప్పుడు"- ఈ వాక్యాల్లో చీకటి అనే కాంత అభ్యంగన స్నానం చేసి విరహంతో తన ప్రియుడి కోసం ఎదురుచూస్తు,శిరోజాల్నీ విరబోసుకుందట.అంతే కాదు ఆకాశం నిండా ఆరబోసుకుందట.అంటే చీకటి అంతటా ఆవరించదని భావన.ఆ చీకటి చిన్నది తన ధమ్మిళ్ళంలో నక్షత్రాలనే మల్లె పువ్వుల్ని పెట్టుకుందట."తురుము కోవడం" అనే వొక సమర్థ పదాన్ని కవి వాడాడు. పాఠకుడు (శ్రోత) ఒకసారి పై వాక్యాల్లోని భావాన్ని ఊహించుకోగలిగితే కవి ప్రతిభను అసాధారణం అనుకోకుండా వుండలేడు.అప్పుడు రసావిష్కరణ కాకుండా వుండదు. ఇట్లా ఆ చీకటి చిత్రం వెనుక గల నేపథ్యాన్ని అలంకారాలతో చెబుతూ "పూలు తుమ్మెదకు మకరందాన్ని/గాలికి గంధాన్ని అందించి వ్యభిచరిస్తున్నప్పుడు "-అని అంటాడు.పూలు ప్రియురాలికి ,తుమ్మెదను,గాలిని ప్రియుడికి ప్రతీకలుగా చేసి ఒక సౌందర్య రస భావాన్ని పాఠకుడికీ అందించి చివరగా కవితను అధివాస్తవిక మార్గంలో మళ్ళిస్తాడు."నిశ్శలంగా దుప్పటి నీడలో... నేను మెలుకువను దులిపేసుకున్నప్పుడు ఓ దీప్తాంధునిగా"-అని అంటున్న వాక్యాల్లో "దుప్పటి నీడలో మెలుకువను దులిపేసుకున్నప్పుడు"అంటే చేతనలోంచి అచేతనలోకి పోయినప్పుడు అనే ఆలోచన పాఠకునికీ కలుగుతుంది.కేవలం శబ్దాన్ని అతి వ్యాప్తిగా చేయటం,భావాన్ని అవ్యాప్తి చేయడం,ఆలోచనను నిదుర పుచ్చడం,అబద్దాల అరల్లో ,అద్దాల నీడల్లో పొంగడం ఇవన్నీ అధివాస్తవిక ఆలోచన వీచికలేమో నని అనిపిస్తుంది. అధివాస్తవిక మొత్తం కవిత్వంలో నుంచి ఒక భాగాన్ని విడదీసి చూడటం ఆ కవిత్వ సాంప్రదాయం కాదు.అట్లే వ్యవహార భాషలో అధివాస్తవిక భాషను,అధివాస్తవిక భాషలో వ్యవహార భాషను కొలవటానికీ సమానమైన కొలబద్ద లేదు.కాబట్టే కవి పాత శబ్దాలను మరమ్మత్తు చేసి కొత్త వాటిగా మార్చి కవిత్వం సృష్టిస్తాడు.పైన పేర్కొన్న అంశానికీ నారాయణ శర్మ గారి "కొత్త శబ్దం" అనే కవితను నిదర్శనంగా చెప్పవచ్చును. "ఏ సడి చప్పుడు చేయకుండానే పెదవులు కదలకుండానే ధ్వనులు పుట్టకుండానే ఎన్నో శబ్దాలు పుడుతున్నాయి,పోతున్నాయి నా మనసొక అంతఃప్రసవ శ్మశాన వాటిక శబ్దాలకు చికిత్సజరుగుతోందిక్కడ వికత్థానాలకు,విచికిత్సలకు విరుగుళ్ళకై అంతరంగ పరిశోధన జరుగుతుందిక్కడ" ఈ కవితలో శబ్దం తన అంతరంగంలో జనిస్తుందని,అక్కడే శ్మశాన వాటికలో కలుస్తుందని, సడి చప్పుడు లేకుండా ఓ ధ్వని రూపం కోసం తాపత్రయపడుతూ,ఆక్రోశిస్తున్నాయని కవి అంటాడు.కవి ప్రయోగించిన వ్యవహారభాషను,అధివాస్తవిక భాషలో కొలిచే కొలబద్ద కనిపించదు.పెదాలు కదలకుండా,గొతు పెగలకుండా కలం నుండి ఓ శబ్దం పుట్టడానికీ కారణం అంతరంగంలోనే భావాలు నిండు గర్భం ధరిరించి ప్రసవ వేదన పడుతూ బయటపడుతాయని చెబుతూ తన అంతఃసంఘర్షణ లోంచే కవిత్వావిర్భావం జరిగిందనే నిజాన్ని పరోక్షంగా పేర్కోంటాడు. ప్రకృత్య ప్రకృతుల పుట్టుక నుండి పుట్టి పడే వర్షాన్ని "ఓ పుట్టుక లో"-అనే కవితలో ఎంతో ఊహిస్తే తప్ప సాధారణ ఆలోచనకు అందని విధంగా మార్మికంగా ఆధివాస్తవిక ధోరణిలో మన కళ్ళ ప్రాంగణంలో కురిపిస్తాడు."ఆకాశం వేడి చూపులు చూస్తుంది"-అని అనటంలో ఎండ తీవ్రంగా కాస్తున్నదని,"మట్టి బెడ్డకు ఆలోచన పెరిగిందేమో ప్రాణాలు పిండుకొని ఆవిరై ఆకాశం వైపు కదిలింది"-అని అనటంలో భూమి లోని నీరు ఆవిరై గగనంలోకి మేఘమై చేరుకొంటుందని అధివాస్తవికంగా చెబుతాడు."పృధివీ గగనాలలో ఏదో బంధం"-అంటూ భూమిని ఆకాశాన్నీ కలిపేదీ వర్షమేనని సూచించి "ఆకాశంలో కదలికలు "మెరిశాయి""/అనుబంధపు భావనలు "ఉరిమాయి""-అని కొత్తగా వర్ష వాతావరణ సూచికలైన ఉరుములు,మెరుపులను వాటి ఆర్భాటాల ధ్వని ఏమాత్రం లేకుండా మనకు వినిపిస్తాడు కనిపింప చేస్తాడు. "సమకాలీన చైతన్యం మలుపులు తిరుగుతు,మెలికలు తిరుగుతూ దిన దిన ప్రవర్ధమాన క్లిష్టతను సంతరించుకుంటోంది.పదాలకతీతమైన పారవశ్యాన్ని ప్రతిపదార్థ శృంఖాలాలతో బంధించడానికీ ప్రయత్నిస్తే అది వ్యర్థ ప్రయత్నం మాత్రమే అవుతుంది."-అంటారు రోణంకి అప్పలస్వామి గారు వేగుంట వారి "చితి-చింత" అనే కావ్యానికి రాసిన ముందు మాటలో.ఈ "తమో చిత్రాలు"-కవితా సంపుటిలో గల కవితలు తీవ్రమైన పారవశ్యతను కల్గిస్తాయి.ఈ కవితలను ప్రతి పదార్ఠ సంకెళ్ళతో బంధించలేము.ఈ కవితల్లో వాటి వెనుక తూచి బేరీజు వేసినట్టు ఆలోచనల ముద్ద వుండదు.చేతన లోని ఆలోచనకు సంబంధం లేని అప్రయత్నలక్షణం గల వ్యక్తీకరణ ఈ కవి కవిత్వంలో కనిపిస్తుంది.కవి నిరంతర స్వతంత్రుడు. కాని ఈ కవి తాను "అస్వతంత్రుణ్ణి" అంటున్నాడు.అస్వతంత్రుడు కావడానికీ కారణం తన లోగిలిలోకి వచ్చి తనను కౌగలించిన ఆమె కులాల పాతరల్లో పగిలిపోయినప్పుడు,ప్రపంచమంతా భీతావహం అయినప్పుడు..దేనికీ స్వతంత్రించలేని తను "అస్వతంత్రుణ్ణి" అనుకుంటున్నాడు. ఆమె పరిష్వంగంలో ఒళ్ళు మరచిపోయిన అంశం ఆంతరంగికమైనది."ఎందరి చేతుల్లోనో నలిగి "పోయిన కారణంగా ,లోకవిధాన కారణంగా కూడా దేనికీ స్వతంత్రించలేని అస్వతంత్రుణ్ణి అని అంటున్నాడేమో అన్న భావన కవి కలుగజేస్తాడు.ముందే చెప్పినట్టు ఈ కవిత వెనుక బేరీజు వేయగల ఆలోచనల ముద్ద లేదు అధివాస్తవికత కవిత కాబట్టి.నీ"జన్మకు కారణమైన వాళ్లు రక్తతర్పణం చేస్తూ..నిన్ను నాకప్ప గించారు"-అని అంటున్న కవి ఆమె కళ్లు"రుధిరాంజనాన్ని దిద్దుకున్నాయి"అని చెబుతు ఆమె కళ్లలోని కోపాన్ని రక్తపు కాటుకతో సంభావించి వైచిత్రిని సాధించాడు. "ఈ ఆకాశం సాక్షిగా "-అనే కవితలో రుధిరం తూర్పు ఉదయంలో కనిపించాడాన్ని,తూర్పు వైపు తమస్సు వెళ్ళాడాన్ని "ఈ పిచ్చి వాళ్ళు అరుణోదయం"అంటున్నారని వ్యాఖ్యానిస్తాడు.ఆకాశం సాక్షిగా తమస్సు అనే విరహిణి రక్తంతో తలంటుపోసుకుందని చెప్పటం అధివాస్తవిక కవిత్వ ధోరణే.రాత్రుళ్ళు అడవుల్లో జరిగే కాల్పుల హత్యల్నీ గుర్తుకు తేవాడానికేమో ఈ కవి "మాంసపు ముద్దలేరటం నాకు గుర్తు/రక్తం ఆనవాళ్లు భూమిలో ఇంకిపోవటం నేను చూశాను"-అని అంటూ ఇలా రక్తంతో నిండిన తమస్సు తూర్పు వైపు వెళ్లటం "అరుణోదయం"-అని భావించే వాళ్ళ పట్ల తనకు గల ఆలోచనను చూచాయగా చెబుతాడు. "పాటను మరచి పో"-అనే కవితలో ఈ మనుషులను నమ్మి పాడకు అని కోకిలను హెచ్చరిస్తాడు. కోయిల దేహపు రంగును ఇష్టపడని మనిషి అంతరంగ ప్రవృత్తిని "నీ బొమ్మని దాచుకోడేం? /నీ మాటని పాటనే వాడు/నీకూతని గీతమనేవాడు /నీ నలుపుని అందమనడేం?"నలుపుని ప్రతీకగా తీసుకొన్న దళిత వాదాన్ని స్పృశింప చేశాడు.ఈ కవికి చీకటి అంటే చాల అపేక్షలా వుంది.'చీకటి ఆశని చావనివ్వదు'అన్న నమ్మకంతో "రేపటి వెలుగు చీకటి జీవితంలో ఎన్ని చిధ్రాలు చేసిందోనని, ఆ చిధ్రాలనుంచి ఎంతో వెన్నెల కారిపోయిందోనని,ఎన్ని చుక్కలు జారిపోయాయోనని తన బాధని అధివాస్తవికంగా చెబుతాడు "చీకటి" అనే కవితలో.ఈ సంపుటిలో చివరిలో వున్న ఎంతో మార్మికంగా కవి ప్రతిభకు అద్దంలా వున్న కవిత "గాలి బొమ్మలు".చెత్త కుప్పలే పొత్తిల్లై సమాజంచే అక్రమ సంతానంగా పిలువబడే ఆ శిశువులను గాలి బొమ్మలుగా చిత్రిస్తూ రాసిన మంచి కవిత ఇది.మట్టి గుండెల్లో మానవత్వాన్ని వెదుక్కొంటూ ఎవరికీ తెలియని జాడలోకి ఏడడుగుల లోతులోకి అమ్మలు విడిచిన గాలి బొమ్మలు అంటూ దుఃఖపు తడితో చెబుతాడు.గాలి బొమ్మల గొంతులేడిస్తే పిల్లగాలి ఈలకూత లాలిపాటలా,ఆ గాలిబొమ్మలు నవ్వటానికీ గాలి కొమ్మలను వూపుతుందని ప్రకృతి కూడ వారి పట్ల తల్లి ప్రేమని కనబరుస్తుందని మనసు కరిగేలా చిత్రిస్తాడు. ఉగాదిని అందరి కవుల్లా కాకుండా "ఈ వసంతమేమిటి?"-అని వినూత్నంగా ప్రశ్నిస్తూ "ఇది వసంతమా?" అనే కవిత బహుధాన్య ను గురించి రాశాడు."ఎవడో పంచ భూతాలు ప్రపంచమన్నాడు/ఆరో భూతం/దరిద్రాన్ని మరిచాడు/ప్రతి సంవత్సరం /దిష్టి బొమ్మలా రుతువుల రంగులు పూసుకొని"-అంటూ వొక కొత్తదనాన్ని ఈకవితకు అలది,ప్రపంచీకరణ ప్రభావాన్ని కూడా "అన్నపూర్ణ ప్రపంచబ్యాంక్ /ప్రహరీ గోడ దగ్గర అడుక్కుంటోంది"-అంటూ తెలుగునేల దుస్థితిని వ్యంగ్యంగా పేర్కోంటాడు. నారాయణ శర్మ గారిది ఒక ప్రత్యేక అభివ్యక్తీకరణ.దీనిలో వొక విశిష్టత వుంది.అది కవి వ్యక్తిత్వం తప్ప వేరు కాదు.అది కవిది తప్ప మరెవ్వరిదీ కాదు.కవిత్వ లోకంలో ఆయనదొక వింత గొంతు.అది మరెవ్వరికీ అనుకరణ కాదు.చీకటిలో కూడా అతనిదే అని పోల్చదగినది అతని కవిత్వం అని చెబుతున్నాను. "ఎవరూ నీవు? కవిని అయితే ఓ మంచి కవిత్వం చెప్పవయ్యా! ఇప్పుడు కవిత్వాన్ని గురించి నేను పట్టించుకోవడం లేదు ఎందుకు? భావుకత్వంతో,గుణదోషాలు చూపించే విమర్శకుడు లేక" ఈ మాటలు నావి కావు.ఇవి పదవ శతాబ్దంలో రాజశేఖరుడు అన్నవి.కవిత్వాన్ని,ముఖ్యంగా అధివాస్తవిక కవిత్వాన్ని గురించి చెప్పే మంచి విమర్శకుడు లేక ఈ కవిత్వ దోరణి ప్రజాదరణకు నోచుకోలేదేమో నని భావిస్తున్నాను.ఈ సంపుటి లోని గొప్పదనం కవిదే.పరిచయంలో లోపం నాదేనని చెబుతున్నాను. మంచి కవితా సంపుటితో మరో వారం కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NpOKee

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి