పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మార్చి 2014, ఆదివారం

Nirmalarani Thota కవిత

మంద నుంచి తప్పి పొయిన లేగదూడకు తనవారు తిరిగి దొరికినట్టు ఏ తుఫాను తాకిడికో రెక్కలు విరిగిన పక్షి కూనకు కొత్త రెక్కలు మొలిచినట్టు దశాబ్ధాల గ్రీష్మ తాపానికి ఇంకిపోయిన భావ తటాకంలో అనుభూతుల పూరేకులేవో గమ్మత్తుగా విచ్చుకున్నట్టు చిన్నప్పటి జనగణమన చెవుల్లో మార్మోగినట్టు తర తరాల తరంగాల తరగలు నిలువునా తడిపేసినట్టు స్వజాతి పక్షులన్నీ సంబరంగా కొమ్మ పైకి చేరినట్టు సందె కాంతుల్లో అందంగా విరిసిన ఓ రంగు రంగుల పూదోట లేలేత చివుళ్ళ మొక్కలకు నీరు పోస్తూ అరవిరిసిన మొగ్గలకు పాదులు కడుతూ విప్పుకున్న పూల గుండెల్లొంచి మకరందాన్ని పంచి పెడుతూ మహా వృక్షాల నీడన ఆశల రెపరెపలతో అవని ఒడిన ఒదిగిన గరిక పోచలు గాలి కిరణాలనో వెలుతురు వీచికలనో అలవోకగా తోట వైపు మళ్ళించాలని చేతులూపుతూ.. గుండెల్ని తాకుతూ . . స్పందనల్ని సాకుతూ . . భావ స్వరాల్ని మీటుతూ.. శృతి చేస్తూ తోటంతా కలియ తిరుగుతూ ... తోటమాలి . . ఓ ఆకు పచ్చ రంగు చొక్కా.. ఆకు పాటలకూ ఆకుపచ్చ శ్వాసలకూ ఊపిరి పోస్తూ, ఆస్వాదిస్తూ చిరునవ్వుల బాసలతో బాసటగా నిలుస్తూ ఆప్యాయపు పలుకుల స్పర్శలో ఓ అన్న కొత్త పిలుపుల మాటున పాతబడిన పలకరింపులను తట్టిలేపుతూ ఓ తమ్ముడు మరచి పోయిన మమతల రాఖీలను మనసు చేతులకు కడుతూ ఓ చెల్లి ఆశయాల హుందాతనంతో నిరాడంబరత మూర్తీభవించిన విమలత్వం బాల్య స్మృతుల్ని గుర్తు చేస్తూ మనసును తాకిన అరుణారుణ స్నేహ కిరణం వాగుల్లో ఓలలాడించి.. కన్నీల్లు పెట్టించి.. ఓదార్చి మనిషికీ మనసుకూ మధ్య రోడ్డు వేస్తూ ఙ్ఞాపకాలు మూటగట్టి సాగనంపుతూ వీడ్కోలు చెప్పే రైల్వే స్టేషన్ అది.. అంతర్జాతీయ కవితా దినోత్సవమేనా ? అంతర్జాల కవిత్వ మహోత్సవమేమో... ఏమో.. నాకు మాత్రం శతాబ్ధాల సుషుప్తావస్త నుంచి పునర్జన్మించిన అంతరంగపు ఆవిష్కరణోత్సవం..!! Nirmalarani Thota [ 23.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Q4nTGu

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి