పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మార్చి 2014, శనివారం

Nirmalarani Thota కవిత

ఆనందం అంటే . . . ? ? ? తెరిచిన కనురెప్పల సోకిన తొలి ఉషా కిరణపు పలకరింత . . .! బీడు బారిన యెదపై కురిసిన తొలకరి జల్లు పులకరింత. . . ! తనువెల్లా పులకలు రేపే పిల్ల తెమ్మెర గిలిగింత. . ! వణికించే చలి రాతిరి వెచ్చని దుప్పటి కౌగిలింత. . ! మాయలెరుగని బోసినవ్వుల పసిపాపల కేరింత . . ! కన్నుల నిండే వెండి వెన్నెల . . మిన్నున మెరిసే చుక్కల మాల . . మరులు గొలిపే చిరుగాలి ఊయల . . మనసు నింపే రాగాల కోయిల. . ఏ మెటీరియలిస్టిక్ విజయం ఎల్ల కాలం ఆనందాన్నివ్వదు. . . ఒక లక్ష ... మరో లక్ష . . ఉద్యోగం . . ప్రమోషన్ . . పెళ్ళి . . పిల్లలు . . ఇల్లు . . ఒక విజయం . . మరో పెద్ద విజయం . . పొద్దున లేస్తే సవాలక్ష ఆశలు ఆనందాన్ని హత్య చేయడానికి . . అనంతంగా ఈ లోకంలో . . ?! ఒక అద్భుతమైన విజయం దాన్ని నిలుపుకునే ప్రయత్నంలోనో మరో పెద్ద విజయం సాధించే తాపత్రయంలోనో ఆవిరై పోతుంది . . ! మనిషి పోయిన బాధ కూడా మరుసటి నెలకో యేడాదికో మరుగున పడుతుంది . . ! శాశ్వతమైన ఆనందాలూ. . . బాధలేవీ . . సృష్టిలో లేవు. . ఈ క్షణమే నిజం . . ! ఒక మంచి పాట వినడంలో హాయి ఒక చినుకు స్పర్షలో హాయి ఒక పూవు పరిమళంలో హాయి ఒక పుస్తకం చదవడంలో హాయి . . ఒక మిత్రున్ని వాటేసుకోవడంలో హాయి . . అమ్మ కళ్ళలో తృప్తిని చూసే హాయి . . నిమిష మాత్రం హాయినిచ్చే చిన్న చిన్న ఆనందాలే నీవి . . ! ఇచ్చి పుచ్చుకునే చిన్ని చిన్ని ఆనందాలే అనుబంధాలు . . ! జీవితానికి పరాకాష్ట "ఆనందం" అయినపుడు ఆనందానికి పరాకాష్ట "ఆత్మీయత" పంచడమే . . ! సుడిగాలికి వంగి లేచే రెల్లు గడ్డిలా . . కష్టాలకి కుంగిపోక విజయాలకు పొంగిపోక ప్రతీ క్షణాన్ని మనసులోకి ఆహ్వానిస్తూ ఆస్వాదించడమే నిజమైన ఆనందం . . ! కనుమరుగై పోయిన "నిన్న" ని మోస్తూ . . కనిపించని "రేపు" లోకి తొంగి చూస్తూ . . కనుల ముందున్న "నేటి" ని కరిగించకు నేస్తం . . ! నిర్మలారాణి తోట [ తేది: 01.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eLrZrc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి