పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

Nirmalarani Thota కవిత

పెళ్ళంటే .. . .? తంతేనా . . ! పెళ్ళంటే పూల పందిళ్ళూ. . సందళ్ళూ మంత్రాలు... మంగళ వాద్యాలు విందులూ. . వినోదాలు అంతేనా . . ? ? ? ఇంకా . . సన్నికల్లు . . మూడు ముళ్ళూ ఐరేని కుండలూ . . ఏడు అడుగులు . . ఈ తంతేనా. . అంతేనా . . ? ? పెళ్ళంటే ఒక మహా యజ్ఞానికి ఆరంభం . . ! ప్రేమనురాగాలే ప్రమిదలు అహంకారాలే సమిధలు . . ! మగవాడికి . . . స్నేహాల్ని కుదించి బయటి సమయాన్ని కుచించి సంపాదన పెంచుకొని బరువు బాధ్యతలకై భుజాలను సమాయత్తం చేయాల్సిన సమయం . . ! తనువులో మనసులో మమతలో బ్రతుకులో అర్ధభాగం అర్ధాంగికి అంకితమివ్వాల్సిన తరుణం . .! ఆడదానికి . . . అమ్మ నాన్నల నీడని పుట్టి పెరిగిన పరిసరాల్ని వదలి ఇంటి పేరునూ ఇంటినీ మార్చుకొని ఇల్లాలయ్యే దక్షిణాయనం . . కాపురపు ముంగిట్లో మరుల ముగ్గుల్ని మగడి గుండె గుడిలో ప్రేమ దీపం పెట్టాల్సిన పర్వం . . అలసిన పతికి ఒడి తానై ఆలంబన అవ్వాల్సిన ఆత్మీయపు రస కావ్యాంకురం ..! ఒంటరి శిశిరపు "నా " అంతర్ధానమై " మా" అవతరించే నవ వసంతాగమనం . . ! ఒక సహనం ఒక సుగుణం సంసారం చేసినపుడే . . ఒక మార్దవం ఒక ధీరత్వం కలిసి కాపురమైనపుడే . . ఒకరు మండు వేసవైతే మరొకరు మల్లెల సౌరభమై . . ఒకరు ప్రచండ భానుడైతే మరొకరు మలయ సమీరమై. . ఒకరు మౌనపు పర్వతమైతే మరొకరు మాటల జలపాతమై . . జంట కన్నుల చూపు ఒకే వింటి శరమై . . పలికే గొంతుకలో ప్రతి స్వరమూ ఇద్దరిదై . . అవగాహన ఒరలో ఇమడలేని ఆత్మాభిమానాల కత్తుల్లా కాక . . ఆత్మీయపు పొదరింట్లో అద్వైతమై ఒకే గుండె గూటిలో ఒదిగిన గువ్వల్లా. . బాధ్యతల్ని భరించే వాడు భర్తగా. . భర్తను సర్వావస్థల్లో భరించేది భార్యగా . . సరాగాల సహజీవన యానం సాగిన నాడే " పెళ్ళి" కి సాకారం . . సు సృష్టికి శ్రీకారం . . ! ! ( ఈ రోజు ప్రపంచ వివాహ దినోత్సవం అటగా . . ? !! ) నిర్మలారాణి తోట [ తేది: 08. 02. 2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbWDPy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి