పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

Kavi Yakoob కవిత

జయహో ! ****** కవిసంగమం - ఫేస్-బుక్ లో వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన,సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఈ సమూహం ఏర్పరచబడింది. కవిత్వసృజన,కవిత్వపఠనం,కవిత్వ సంబంధిత అంశాలు -ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా 'కవిసంగమం'సీరీస్ సభలు 'పోయెట్రీ వర్క్ షాపు'ల్లా జరుగుతున్నాయి..వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను కవిసంగమం గ్రూప్ వాల్ మీద పోస్టు చేయడం,నెలనెలా కార్యక్రమాల్లో ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' మార్గంలో సాగుతోంది . ***** కవిసంగమం గురించి రాసిన ఈ రెండు కవితలు చూడండి : Raghava Reddy రాసిన "నువ్వొక పచ్చని చెట్టువైతేను..'' అనే కవిత . రెండేళ్ళక్రితం ఇక్కడొక మొక్క మొలిచింది పచ్చని చెట్టై ఎదిగింది.. పిట్టలన్నీ వాటంతటవే వచ్చివాలాయి పాటలెన్నో పాడాయి పాడుతూనే వున్నాయి పాటలెన్నో విన్నాయి వింటూనే వున్నాయి పాటపాటకూ పదునెక్కుతోన్న గళాలు పదిమందికీ పంచుతోన్నకవన పరీమళాలు భావార్ద్ర మేఘాలై సంచలిస్తున్నాయంతటా.. ఉత్తమాభిరుచి గల ఏ శీతల పవనమో భుజం తట్టినపుడు ఎదురైన ఏ అనుభవమో అనుభూతి సాంద్రమై మెరిసినప్పుడు వ్యవస్థ చేసిన గాయమేదో ఓపలేనంతగా సలిపినప్పుడు.. ఆనందమో విషాదమో ఆవేశమో ఆగ్రహమో ఆలాపనో ప్రేలాపనో వెన్నాడినపుడు వేటాడినపుడు కదిలించినపుడు కరిగించినపుడు.. భావమేఘం బరువెక్కుతుంటేను కొత్తకవితై ఇల జారుతుంటేను.. సృజనదేవి పెదవులపై చిరుహాసమొచ్చేను.. నువ్వొక పచ్చని చెట్టువైతేను పిట్టలు వాటంతటవే వచ్చివాలేను- -(కవి సంగమం లో రాస్తున్నవాళ్ళకు,కవిసంగమాన్ని చూస్తున్నవాళ్లకు,కవిసంగమాన్నిలా చేస్తున్న వాళ్ళకు..) ***** వొరప్రసాద్‌ రాసిన మరో కవిత "కవి ఒక సమూహం అనే ఒక కవి సంగమం" ఫేస్‌బుక్‌ కవిసంగమంలో కవితాక్షరాల కవాతు తెలుగు అక్షరాలు అలవోకగా ఇంటర్నెట్‌లో ఒదిగిపోతూ వేలకోట్ల నక్షత్రాలను పుట్టించబోతున్నాయి అక్షరాలంటే ఐక్యతా ప్రతీకలు ఒంటరిగా ఏ అర్థాన్నీ ఇవ్వవు అక్షరాల కలయిక ఒక అనివార్యం అక్షరాలకు అర్థం కల్పించేవాడు కవి అక్షరాలతో ఆలోచనలను పండించేవాడు కవి అక్షరాలను ప్రేమతో ఆర్తితో అలంకరించి నెత్తిన పెట్టుకుని లోకమంతా తిరిగేవాడు కవి తను పరవశించి పలవరించి అందరిలో ఐక్యమయ్యేవాడు కవి ఈనాటి కవి సాంకేతికుడయ్యాడు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కవితా పతాకాన్ని ఎగరేస్తున్నాడు కవి సంగమం కొత్త ను హత్తుకుంటున్న తెలుగు కవితా సంతకం ఆధునిక కవితా యాత్ర నాగరికతా శిఖరాన మెరుస్తున్న తెలుగు అక్షర వెలుగు సంకేతం కవి ఒక సమూహం కవి సంగమం ఒక ప్రతిబింబం కవిత్వాన్ని పండించే ఆధునిక సంగమం కంప్యూటరూ... కవితా సేద్యం ఈనాటి సందర్భం అంతరంగాల సముద్రాలకు అనంతభావాల కలబోతకు ఆధునిక వేదిక ఫేస్‌బుక్‌ కవిసంగమాన్ని ఆనందంగా అందరం ఆలింగనం చేసుకుందాం! **** ఈ కవితల్లో 'కవిసంగమం ' ఉద్దేశించిన అనేక అంశాలు అవగతమవుతాయి. వారంలో ప్రతిరోజూ కవిత్వం గురించిన విభిన్న అంశాల గురించి 'శీర్షికలు' రాయించడం ; అలాగే గ్రూప్ లో రాస్తున్నవారికి ఇలా సూచనలు ఇస్తూ ,వారిని మరింతగా కవిత్వసృజన గురించి అవగాహన చేసుకోవడానికి పురికొల్పడం జరుగుతోంది.~ "మిత్రులారా !'కవిసంగమం'లో రాస్తున్న కవిత్వం చూస్తుంటే కొన్ని మాటలు చెప్పాలనిపించింది. # కవిత రాయగానే వెంటనే పోస్ట్ చెయ్యకండి.కొంచెం మరొక్కసారి చూసుకుని ,ఏమైనా మార్చాలనిపిస్తే లేదా ఎక్కడైనా భావం చెప్పేటప్పుడు అది పాఠకుడికి చేరే దశలో అర్థం సరిగా చేరుతుందా లేదా అని ఒకసారి ఆలోచించి తిరగారాయండి. # కవిత్వంలో గాఢత అవసరం. మనలోకి ప్రసరించిన అనేక విషయాలను వడపోసి ,చిక్కబరిచి చెప్పే ఒకానొక ప్రక్రియ. వ్యర్థపదాలు,పునరుక్తులు లేకుండా ఒక భావాన్ని అనుభూతిప్రధానంగా చెప్పే ప్రక్రియ.కాబట్టి కవిత్వనిర్మాణంలో అత్యంత శ్రద్ధ కనబరచండి. # కవిత్వం విరివిగా చదవండి. కవిత్వ సంకలనాలు సంపాదించి చదవండి.కవిత్వానికి సంబందించిన పుస్తకాలు చదవండి.అధ్యయనం చాలా అవసరం. # ఎవరైనా మీరు రాసే కవిత్వం పైన తగు సూచనలు చేస్తే,వాటిని వినమ్రంగా స్వీకరించండి. అది మీ ఉన్నతికి,కవిత్వ ఎదుగుదలకు ఉపకరిస్తుంది. [మేం ఏం రాసినా అదే గొప్ప, దీనిపై ఎవరూ ఏం చెప్పక్ఖర్లేదనే భావనను పెంపొందించుకోకండి .కవి ఎంత ముఖ్యుడో ,పాఠకుడూ అంతటి ముఖ్యుడే.పాఠకుడు లేకపోతే కవిత్వం చేరేదేక్కడికి? కవి ~కవిత్వం~ పాఠకుడు =ఇది గుర్తుంచుకోవాలి ] # కవికి తనదైన ఒక సొంత గొంతు,మార్గం ఉంటుంది.దానిని వీడకుండా మీదైన ఒకానొక ప్రత్యేక పద్ధతిలోనే మీరు రాయండి.మీరు మరొకరిలాగా రాయకండి. ఒకే వస్తువును ఏ ఇద్దరూ ఒకలా రాయరు. ప్రతి ఒకరికీ తమదైన శైలి ఉంటుంది. # ఫేస్ బుక్ లో 'కవిసంగమం' చేస్తున్న పని - ప్రతి ఒక్కరిలో ఉన్న కవిత్వం రాయాలన్న కాంక్షను గౌరవించి, వారి రాతలకు వేదికలా నిలబడటం. అలా రాస్తూ రాస్తూ కవిత్వసృజనలో పరిణతిని సాధిస్తూ ఉండటాన్ని ,నిండుమనసుతో స్వాగతించడం ,సంతోషించడం. 'కవిసంగమం' చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం కవిత్వం మీదున్న ఇష్టమూ, అభిమానం వల్లనే. ! అందువల్ల 'కవిసంగమం' నుండి ఏవైనా సూచనలు,అభిప్రాయాలు చెబుతున్నప్పుడు ,వాటిని గౌరవిస్తూ పాటించడానికి ప్రయత్నిచండి. ఇదంతా మనందరి కవిత్వం కోసం, కవిత్వం రాసే మీ కోసం ! జయహో ! 'కవిత్వం కావాలి కవిత్వం !! " కవిసంగమం ప్రయాణం -కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్ ................................................................. Feb'9,2012- కవిసంగమం మొదలయ్యింది.ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది. ఇవ్వాళ ఫేస్ బుక్ కవితావేదికగా నిలబడింది. అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాసున్నవాళ్ళు ఎందఱో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, సందోహాలు,-వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్ చేసుకున్నారు. చేసుకుంటున్నారు.ఆ మార్గంలో సాగుతున్నారు. కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది. ఆగష్టు2012 పదిహేనున ఇఫ్లూ లో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' ఒక గొప్ప ప్రయోగం.ఆంధ్రజ్యోతి,పాలపిట్ట,దక్కన్ క్రానికల్ ,హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి. అలాగే ఒక ప్రయత్నంగా,ఒక ప్రయోగంగా 144 కవితలతో 'కవిసంగమం-2012 ' కవితా సంకలనం వెలువడింది . ఇందులో తొట్టతోలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి. ఈ ప్రోత్సాహంతో ముందు ముందు ఇంకా మెరుగైన కవిత్వం రాస్తారని ఆకాంక్ష. *** బెంగాలీ కవి సుబోద్ సర్కార్ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్ ను చూసి ముచ్చటపడ్డాడు.గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు.అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆమధ్య వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం ;మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ' గా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' కు కొనసాగింపుగా 2013లో మొదలుపెట్టిన మూడుతరాల కవుల 'లామకాన్ లో కవిసంగమం' కార్యక్రమం.! ఆరు కార్యక్రమాలు అక్కడ ముగించుకున్నాక 'గోల్డెన్ త్రెషోల్డ్'లో మిగతా సీరీస్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం ~ * కొత్తగా రాస్తునవాళ్ళు ప్రత్యక్షంగా సీనియర్ కవులను కలవడం, * వారి కవిత్వానుభావాల్ని వినడం, కవిత్వ రహాస్యాలను తద్వారా అవగతం చేసుకోవడం ; * అలాగే తామూ చదవడం,రాయడం ,*కవిత్వం వినడం ,*కవిత్వం చదవడం *కవిత్వ తత్వాన్ని అవగాహన చేసుకోవడం * తమను తాము ఇంప్రూవ్ చేసుకోవడం , * పాల్గొంటూ,వింటూ నేర్చుకోవడం - ఇప్పటికే 2013 లో 'కవిసంగమం' కార్యక్రమాలు ప్రతినెలా రెండవ శనివారం జరిగాయి.*నెల నెలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఇతర కవులతో కలవడం,కవిత్వ వాతావరణంలో గడపడం - వంటి ఈ కవిసంగమం 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' కార్యక్రమంలో ఐదుగురు చొప్పున కవులు కవిత్వం విన్పించారు. 1. ఒక ప్రముఖ కవి. 2.ఇదివరకే కవిగా గుర్తింపు పొంది, 'కవిసంగమం'లోనూ రాస్తున్న కవి. 3.ముగ్గురు ప్రవర్థమాన కవులు. ఈ సంరంభంలో పాల్గొన్న కవులు ~ వేదిక :లామకాన్ జనవరి 27- నగ్నముని | వసీరా | కిరణ్ గాలి,మెర్సీ మార్గరెట్,చింతం ప్రవీణ్ . ఫిబ్రవరి 9 - నిఖిలేశ్వర్ | పులిపాటి గురుస్వామి | నందకిషోర్,జయశ్రీనాయుడు,క్రాంతి శ్రీనివాసరావు మార్చి 9 - విమల | బివివి ప్రసాద్ | యజ్ఞపాల్ రాజు,శాంతిశ్రీ ,చాంద్ ఉస్మాన్ ఏప్రిల్ 13 -వరవరరావు | కాసుల లింగారెడ్డి | అనిల్ డానీ,మెరాజ్ ఫాతిమా,నరేష్ కుమార్ మే 11 - దేవిప్రియ |కోడూరి విజయకుమార్ | సివి సురేష్,వనజ తాతినేని,బాలు వాకదాని జూన్ 8 - అమ్మంగి వేణుగోపాల్ | రెడ్డి రామకృష్ణ | మొయిద శ్రీనివాసరావు,రాళ్ళబండి శశిశ్రీ ,తుమ్మా ప్రసాద్ వేదిక : 'గోల్డెన్ త్రెషోల్డ్ ' జూలై 13 - శీలా వీర్రాజు | సత్యశ్రీనివాస్ | లుగేంద్ర పిళ్ళై,సొన్నాయిల కృష్ణవేణి,కృపాకర్ పొనుగోటి ఆగష్టు 10 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ |దాసరాజు రామారావు |కాశిరాజు,పూర్ణిమా సిరి,శ్రీకాంత్ కాన్టేకర్ సెప్టెంబర్ 14 -దీవి సుబ్బారావు |కుమారవర్మ|భాస్కర్ కొండ్రెడ్డి,భార్గవి జాలిగామ ,పోతగాని అక్టోబర్ 5 -[మొదటి శనివారం]-పాపినేనిశివశంకర్ | శ్రీ నివాస్ వాసుదేవ్ |వర్చస్వి, రమాసుందరి,నాయుడుగారి జయన్న నవంబర్ 9 -నందిని సిధారెడ్డి |జాన్ హైడ్ కనుమూరి |మోహన్ రావిపాటి ,కవితా చక్ర ,బాలసుదాకర మౌళి కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడంలేదనే దశనుంచి అనేక కొత్త గళాలతో 'కవిసంగమం'-'నువ్వొక పచ్చని చెట్టైతే ,పక్షులు వాటంతటవే వచ్చి వాలేను'అన్న మాటను నిజం చేసి చూపింది. గత సంవత్సరం 'ఇఫ్లూ' లో జరుపుకున్న 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్'లా 2013లో కూడా డిసెంబర్ 15 న జరుపుకుంది. ముఖ్యఅతిధిగా ప్రసిద్ధ గుజరాతీ కవి ప్రొ.శితాంషు యశస్చంద్ర గారు పాల్గొన్నారు.ప్రారంభసభలో సంపాదకులు కే.శ్రీనివాస్,ఎం.వి.ఆర్.శాస్త్రి,10tv సి.ఇ.వో అరుణ్ సాగర్,అనురాగ్ విద్యాసంస్థల రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొనగా ,ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. ** కవిత్వానికి ఒక వేదికగా 'కవిసంగమం' ఉండేలా, ఫేస్బుక్ లో రాస్తున్న ఔత్సాహిక కవులకు ఇదొక 'పోయెట్రీ వర్క్ షాప్'లా ఉపయోగపడేలా ఇన్నాళ్ళుగా ఇది పనిచేస్తూ వచ్చింది.. ఇలా నిర్మించడంలో ఎంతో ఓపిక, సమయమూ వెచ్చించి కష్టతరమైన పనిగానే ఇన్నాళ్ళలో అన్పించినా, కవిత్వానికి ఇదొక వేదికగా నిలబడాలి,ఎందరికో ఇదొక వేదికగా ఉండాలి.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eX524x

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి