పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఈ రోజు గాలిబ్ కవితల్లో మొదటిది గాలిబ్ సంకలనం 9వ గజల్ లోని 4వ షేర్ దిల్ గుజర్ గాహ్ యే ఖయాలె మై వ సాగర్ హీ సహీ గర్ నఫ్స్ జాదా సరె మంజిలె తఖ్వా న హువా మద్యం మధుపాత్రల భావాల బాటే కావచ్చు నా మది మనసు సన్మార్గాన నడవకున్నా బాధలేదు ఉర్దూలో గాలిబ్ రాసిన పదాలకు అర్ధాలు చూద్దాం. గుజర్గాహ్ అంటే నడిచే దారి, ఖయాల్ అంటే ఆలోచనలు, భావాలు, మై అంటే మద్యం, సాగర్ అంటే మధుపాత్ర, నఫ్స్ అంటే జీవితం, మనసు, జాదా అంటే బాట, సరె మంజిల్ అంటే లక్ష్యం, తఖ్వా అంటే దైవభీతి, సన్మార్గం. ఈ కవితలో గాలిబ్ సరికొత్త పోలికలతో తన భావాలను ప్రకటించాడు. ప్రతి మనిషికి తన ప్రత్యేకత ఉంటుంది. కొందరి ఆలోచనల్లో ఎప్పుడు దైవభక్తి ఉంటుంది. సన్మార్గాన నడవాలన్న భావాలే ఉంటాయి. మరి కొందరి మనసులో ఎల్లప్పుడు మద్యం గురించిన ఆలోచనలే ఉంటాయి. కాని ఎవరి మనసు కూడా శూన్యం కాదు. గాలిబ్ మనసు దైవభీతితో సన్మార్గాన నడిచే ఆలోచనలతో నిండిలేదు, అయితేనేం మనసులో ఆలోచనలన్నీ మద్యం, మధుపాత్రల చుట్టే తిరుగుతున్నాయి. ధర్మపరాయణుడు ధార్మిక భావాల్లో మునిగిపోతే, గాలిబ్ లాంటి మనిషి మధుపాత్ర ఆలోచనల్లో మునిగిపోయాడు. ఎవరూ ఖాళీగా లేరు. ఈ కవితలో గాలిబ్ ఉపయోగించిన పదాలు కూడా గమనించదగ్గవి. ఆలోచనలు ఒక పరంపరగా కొనసాగుతూ ఉంటాయి. అంటే ఒకబాటలా అవి కొనసాగుతూనే ఉంటాయి. అది దైవభక్తికి సంబంధించిన ఆలోచనల బాట అయితే లక్ష్యం సన్మార్గాన నడవడం. అలా కాకుండా కేవలం ఐహిక కోరికల ఆలోచనల బాట అయితే ఆ దిశగానే సంబంధించిన లక్ష్యాన్ని చేరుకోవడం. ఆలోచనల ఎడతెగని పరంపర చుట్టు ఈ కవితను గాలిబ్ అల్లాడు. రెండవ కవిత గాలిబ్ సంకలనంలోని 9వ గజల్ 5వ షేర్ హూం తెరే వాదా న కర్నే మేం భీ రాజీ కభీ గోష్ మన్నత్ కషె గుల్బాంగె తసల్లీ న హువా నువ్వు వాగ్దానం చేయకపోయినా నాకు ఇష్టమే కదా నా చెవులు పూలస్వరం పిలుపు హాయి ఎన్నడూ కోరలేదు గాలిబ్ ఉర్దూలో వాడిన పదాలు గమనించదగ్గవి. వాదా అంటే వాగ్దానం, రాజీ అంటే ఇష్టపడడం, గోష్ అంటే చెవులు, మన్నత్ అంటే కోరిక, కషీదాన్ అంటే ఆకర్షణ, గుల్ అంటే పువ్వు, బాంగ్ అంటే పిలుపు, గుల్బాంగ్ అంటే పూలస్వరం, లేదా పూల పిలుపు, తసల్లీ అంటే సాంత్వన, ఇక్కడ నేను హాయిగా అనువదించాను. ఇది గాలిబ్ గజళ్ళలో ప్రసిద్ధిపొందిన వాటిలో ఒకటి. మనం ఎంతో ఇష్టపడే వ్యక్తి మనకు ఏదన్నా వాగ్దానం చేస్తే మనం చాలా సంతోషిస్తాము. ఆనందంతో నాట్యం చేస్తాము. కాని చాలా సందర్భాల్లో మాట ఇచ్చిన వారు మరిచిపోవడమో, మాట నిలబెట్టుకోకపోవడమో జరుగుతుంది. గాలిబ్ ఈ పరిస్థితిని ప్రస్తావిస్తూ, తన ప్రేయసి తనకు ఎలాంటి వాగ్దానం, కలుస్తానని మాట ఇవ్వడమూ చేయలేదు. అది గాలిబ్ కు ఇష్టమే. ఎందుకంటే పూలవంటి ఆమె స్వరం ఇచ్చే హామీ నెరవేరని పరిస్థితిని ఎదుర్కునే అవసరం ఉండదు. గాలిబ్ తన చెవులపై ఈ భారం పడకుండా అలవాటు చేసుకున్నాడు. మనకు అవసరమున్నప్పుడు ఎవరైనా ఊరడించడానికి ఏదన్నా వాగ్దానం చేయవచ్చు. అప్పటికి అది చాలా సాంత్వన కలిగించినా, తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చకపోతే మనకు చాలా బాధ కలుగుతుంది. అసలు అలాంటి వాగ్దానాలే వినకపోవడం, వినబడే పరిస్థితి లేకపోవడమే మంచిదంటాడు గాలిబ్. ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడని ప్రేయసి పట్ల గాలిబ్ కోపగించడం లేదు. అసలు వాగ్దానం చేయకపోయినా తనకిష్టమేనంటున్నాడు. ఇలాంటి వాగ్దానాల భారాన్ని చెవులు మోయకపోవడమే మంచిదంటున్నాడు. ఈ కవిత ఒకరకంగా అందని ద్రాక్షలు పుల్లన అన్న కథను గుర్తుకు తెస్తాయి. కాని గాలిబ్ తనకు అందని ద్రాక్షలను పుల్లవిగా భావించలేదు. కాస్త వ్యంగ్యంగా, వాగ్దానాలు వినకుండా ఉండే అలవాటు చెవులకు వేసుకున్నానని చెప్పాడు. మూడవ కవిత గాలిబ్ సంకలనం 9వ గజల్లోని 6వ షేర్ కిస్ సే మహ్రూమి ఖిస్మత్ కీ షికాయత్ కీ జె హమ్ నే చాహాథా కి మర్జాయె, సో ఓ భీ న హువా దురదృష్టానికి ఎవరిని నిందించాలి చావాలనుకున్నా అది కూడా దొరకలేదు చాలా సరళమైన పదాలతో ఉన్న కవిత ఇది. ఉర్దూలో పదాలను చూద్దాం. మహ్రూమ్ అంటే నిరాకరించబడడం, మహ్రూమి యే ఖిస్మత్ అంటే అదృష్టం నిరాకరించబడడం, దాన్ని దురదృష్టంగా నేను అనువదించాను. షికాయత్ అంటే ఫిర్యాదు. ఈ షేర్ గజల్ చివరి షేర్ అంటే మక్తాకు ముందు వస్తున్న షేర్. కాబట్టి భావపరంగా ఇందులో గాఢత ఎక్కువగా ఉండేలా రాశాడు. ఈ కవిత మొత్తం తీవ్రమైన వేదనను ప్రతిబింబిస్తోంది. జీవితంలో తీవ్రమైన బాధ, దుఃఖం, విషాదాలు ఇందులో కనబడుతున్నాయి. అందుకే అతి సరళమైన పదాలనే గాలిబ్ ఉపయోగించాడు. తనను నిరాకరించి, చిన్నచూపు చూసి కాదన్న ప్రేయసి, లేదా తన పట్ల అమానుషంగా వ్యవహరించిన ప్రపంచం ఏదన్నా కాని, ఇక్కడ బాధ అన్నది ముఖ్యమైన విషయం. అలాంటి పరిస్థితిలో మనిషి జీవితాన్ని వదిలి మరణాన్ని కోరుకుంటాడు. తాను కోరినంతనే మృత్యువు వచ్చి కౌగిలించుకుంటుందని గాలిబ్ అనుకున్నాడు. కాని దురదృష్టమేమంటే, మృత్యువు కూడా నిరాకరించింది. ఇక ఇలాంటి పరిస్థితికి ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలి. ఎవరిని నిందించాలి. నలువైపులా నిరాశలు క్రమ్ముకున్న పరిస్థితిలో మనిషి జీవితాన్ని చాలించాలని, మరణించాలని భావించడం సాధారణంగా మనం చూస్తాం. కాని మృత్యువు కూడా నిరాకరిస్తే ఎక్కడికి పోతామంటు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నలో ఒక వ్యంగ్యం ఉంది. అందరూ నిరాకరించిన వాడిని మృత్యువు ఎందుకు అక్కున చేర్చుకోవాలి. అంత చవకైనదా మరణం. ఎవరికి పనికిరానివాడు చావుకు పనికివస్తాడా? కాబట్టి మృత్యువును కోరుకునే ముందు కనీసం తాను మృత్యువుకైనా పనికివచ్చే స్థాయిలో ఉన్నది లేనిదీ చూసుకోమంటున్నాడు. ఉర్దూకే ప్రత్యేకమైన వ్యంగ్యం ఇది. తన విలువను గుర్తించడమే జరిగితే ఇక మనిషి చావాలని అనుకోడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 9వ గజల్లో చివరి కవిత. మర్గయా సద్మా ఎక్ జుంబిష్ లబ్ సే గాలిబ్ నాత్వానీ సె హరీఫ్ దమె ఈసా న హువా పెదాల నుంచి గాలి ఊదితే ప్రాణం పోయింది గాలిబ్ బలహీనత వల్ల ఏసు ఊదిన గాలిని తట్టుకోలేకపోయాడు ఈ కవితను అర్ధం చేసుకునే ముందు, ఉర్దూలో పదాలను చూద్దాం. సద్మా అంటే షాక్, దిగ్భ్రమ, జుంబిష్ అంటే తాకిడి, కదలిక, దూకడం వగైరా అర్ధాలున్నాయి. లబ్ అంటే పెదవి, సద్మ యే ఎక్ జుంబిషె లబ్ అంటే పెదాల కదలిక వల్ల వీచిన గాలి కలిగించిన దిగ్భ్రమ. అంటే నోటితో ఊదిన గాలి వల్ల కలిగిన షాక్, నా త్వాని అంటే బలహీనత (తవాం అంటే శక్తి), హరీఫ్ అంటే ప్రత్యర్ధి, దమ్ అంటే ఊపిరి, ఈసా అంటే ఏసు ప్రభువు, హరీఫె దమె ఈసా అంటే ఏసు ఊపిరికి, అంటే ఏసుప్రభువు ఊదిన గాలికి ప్రత్యర్ధిగా నిలబడడం. ఈ కవితను అర్ధం చేసుకోవాలంటే కాస్త నేపథ్యం వివరించాలి. క్రయిస్తవులే కాదు ముస్లిములు కూడా ఏసుప్రభువును ప్రవక్తగా గౌరవిస్తారు. ఏసుప్రభువుకు దైవం అనేక మహిమలు ప్రసాదించాడని ముస్లిములు కూడా నమ్ముతారు. ఏసుప్రబువు రోగులకు స్వస్థత కలిగించేవారు, చనిపోయిన మనిషిని బతికించారు. ఇవన్నీ ఆయన దేవుడిచ్చిన మహిమలతో చేశారు. ఏసు ప్రభువు మృతుడిని బతికించడానికి, లేదా రోగిని బాగుచేయడానికి అక్కడ నిలబడి, ’’దేవుని ఆజ్ఙతో లే‘‘ అని ఆదేశించేవారు. ఆ తర్వాత ఊపిరి పీల్చి రోగి శరీరంపై లేదా మృతదేహంపై ఊదేవారు. ఆ వెంటనే మృతుడు లేచినిలబడేవాడు. రోగి అయితే స్వస్థత లభించేది. ఈ మహిమ ప్రదర్శించడంలో ఏసుప్రభువు ఎన్నడూ విఫలం కాలేదు. క్రయిస్తవులే కాదు ముస్లిములు కూడా దీన్ని విశ్వసిస్తారు. గాలిబ్ కవితను అర్ధం చేసుకోడానికి ఈ నేపథ్యం గురించిన అవగాహన అవసరం. ఇప్పడు, ఇంకో నిత్యసత్యం చూద్దాం. ఎవరైనా బలంగా ఊదితే చీమలాంటి బలహీనప్రాణి ఎగిరిపోతుంది. అది గాయపడవచ్చు, మరణించవచ్చు, ఏమైనా జరగవచ్చు, మనకు తెలుస్తున్నది అది గాలికి ఎగిరిపోవడం, తద్వరా మరణించడం లేదా గాయపడడం. ఇక్కడ గాలిబ్ ఒక సన్నివేశాన్ని వర్ణించాడు. వ్యాధిగ్రస్తుడై, అత్యంత బలహీనంగా ఉన్నాడంట. బహుశా ప్రేయసి విరహంతో అన్నపానీయాలు మానేసి అలా తయారయ్యాడేమో, కారణమైమైనా గాని, చాలా బలహీనపడి, రోగ్రగస్తుడై ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆయన్ను బాగు చేయడానికి స్వయంగా ఏసుప్రభువు వచ్చారు. మృతుని సయితం బతికించే మహిమ ఆయనకుంది. ఏసుప్రభువు వచ్చి ’’ఖుమ్ బి ఇజ్నిల్లాహ్‘‘ (దేవుడి ఆజ్ఙతో లే) అని చెబుతూ గాలిబ్ పై తన ఊపిరి పీల్చి ఊదారు. కాని గాలిబ్ ఎంత బలహీనంగా ఉన్నాడంటే, ఆ ఊపిరిని కూడా తట్టుకోవడం అతడి వల్ల కాలేదు. అప్పటి వరకు రోగిగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఏసుప్రభువు మహిమ వల్ల రోగం తగ్గుతుందనుకున్నాడు. కాని ఆయన పెదాల నుంచి ఊదిన గాలిని కూడా తట్టుకోలేక ప్రాణం వదిలేశాడు. ఇదెలా ఉందంటే, రోగిని బాగుచేయడానికి డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ నొప్పి భరించలేక రోగి చచ్చిపోయాడు. ఇందులో సున్నితమైన వ్యంగ్యం కూడా ఉంది. రోగులను బాగు చేసే మహిమ పొందిన ఏసుక్రీస్తు కూడా విఫలం కావచ్చని, గట్టిగా ఊదితే కూడా తట్టుకోలేని రోగి వద్దకు వెళ్ళితే, ఆ రోగి ఊదిన గాలి దెబ్బకే చస్తాడని వ్యంగ్యంగా చెప్పాడు. ఇది ఒకరకమైన తిరుగుబాటు కవిత. గాలిబ్ తిరుగుబాటు కవి. నమ్మకాలను, విశ్వాసాలను ప్రశ్నించకుండా ఆయన వదల్లేదు. కాని చాలా సున్నితంగా, చాలా చాకచక్యంగా, చమత్కారంగా, విచిత్రమైన సన్నివేశాలను కల్పించి ఆయన అల్లిన ఈ కవితలపై ధర్హభ్రష్టత లేదా బ్లాస్ఫెమీ నింద ఎన్నడూ పడలేదు. ఒక సన్నివేశాన్ని కల్పించి, అతిశయోక్తులతో నింపేసి ఒక విశ్వాసాన్ని ప్రశ్నించాడు. కేవలం రెండు పంక్తుల్లో ఒక విశ్వాసాన్ని ప్రస్తావించడమే కాదు, ఇది కూడా విఫలం కావచ్చన్న చిత్రాన్ని గీసి చూపించాడు. తన బాధలు మామూలు బాధలు కాదని, ఏసుప్రభువు కూడా తన మహిమలతో వాటిని బాగుచేయలేడంటూ వాపోయాడు. ఇది ఈ రోజు గాలిబానా. వచ్చే శుక్రవారం మళ్లీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ccZhFa

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి