పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

కరిముల్లా ఘంటసాల|| కన్న తల్లి!? ||


విమర్శకా!
కుక్కా అని పేరెట్టి మనిషిని కాల్చెయ్‌
బసుల్ని తగలెట్టిన పోరల్ని
ఉరేసి చంపెయ్‌
ఆకలిగొన్న తాచులాగ
ఈయమ్మ తన బిడ్డల్నే మింగేస్తోంది
గుడి కట్టి పూజలూ భజనలూ చేసెయ్‌!
కవీ!
బస్సు కళేబరంపై నువ్‌ కార్చిన కన్నీరు
తార్నాక రోడ్లను ముంచి ప్రవహిస్తోంది
నీ కవిత కాగితప్పడవలో పయనిస్తూ
ములిగేవు నువ్‌ జర భద్రం!
గ్లిజరిన్‌ కన్నీళ్ళు తాగి మత్తెక్కావ్‌
ఈలలూ చప్పట్లకు కొదవే లేదు
నాటకం రక్తి కడితేనేకదా
ఏడ్పుగొట్టు పాత్రలు ఆకట్టుకుంటాయ్‌!!
తల్లీ!
ముగ్గురు బిడ్డల యమ్మ మూలపుటమ్మ!
ముగ్గుర్నీ మూడ్రకాలుగా చూశావ్‌!
మనిషిని యాసతో, ఆహార్యంతో, బొందపెట్టే చోటుతో తూచావ్‌!
హస్తినలో అంగబలం, అసెంబ్లీ లో అంకెబలం ఉన్నవాడికీ,
హైదరాబాదును రింగురోడ్డై చుట్టినోడికీ,
అన్నీ అన్నీ ఉన్నోడికే
మిగతా అన్నీ దోచిపెట్టావ్‌!
' విగ్న్యానులనే అగ్న్యానుల్నీ'
' చదువుకుంటున్నామనుకుంటున్న మూర్ఖుల్నీ'
తొక్కుకుంటూ
పెంచుకున్న ఆశల్ని చిదిమేసి
ఆరు దశాబ్దాల్లో అరవై సార్లు
నువ్వే ఇచ్చిన మాటనీ, భరోసానీ
నువ్వే తుంచేసి
నమ్మకమనే పదాన్ని చరితలోంచే చెరిపేశావ్‌!
భవితపై ఆశను తుంచేశావ్‌!
అన్నీ కోల్పోయిన బిడ్డ
దిక్కులేని శవంగా మిగిలితే
' ఛ్ఛీ...ఛ్ఛా' అంటూ చావును వెటకారం చేశావ్‌!
తల్లీ!
నా తల్లీ!!
బస్సేగానీ మనిషి పట్టని తల్లి
డబ్బే గానీ ప్రాణానికి విలువివ్వని తల్లి
జీవితం కోసం పెనుగులాడే బిడ్డని
కష్టాల కడలిలో ఊపిరాడక కొట్టుకుంటున్న బిడ్డని
ఆ దారినే పోయే ప్రతివాడితో
రంకు కట్టే తల్లి
ఛీ నా తల్లీ!
థూ నా తల్లీ!!

03-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి