పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

వంశీ || పొక్కిలి ||


వాకిలంత దుబ్బ
పొద్మీకి సాన్పు సల్లి ఇల్లలికెగద
ఏం రోగం దీన్కి, కనవడ్తలే,
"ఓ ఈరముష్టోల్ల ఎంకటీ
మా లచ్చి కనవడ్డాదిర"
ఈన్కేమైంది శెప్పకుంట మర్లవట్టె
శేతులెందుకో వొన్కుతాన్నై,
సర్పంచెలక్షన్ల తక్లీఫ్ ఐతాని
ఎమ్మెల్యే గాడేమన్న ఇంట్ల సొచ్చెనా..

"నాయినా, అమ్మ మర్రిబాయి పొంటి ఉరుకుతాంది
బట్టలన్ని శినిగున్నై కంపలవడ్డట్టు"
బీడీల్చుట్టవోయిన మా బిడ్డె
గుడ్డేలుగు కండ్లవడ్డట్టు హైబతై,

ఉప్పరి పన్జేశిన కండలొక్కపారే ఉబ్బి
గడ్డపార దొర్కవట్టి,

-"లమ్డీకే,
దైర్నమేంద్రా ఎమ్మెల్యే ఇంటికి రానీకి,
ఇడువుర్రా కుక్కల,
మన్తోనే జగడం పెట్కుంటాడు, వీని జాతిన్.. "

సచ్చిన మా అవ్వ బొందను తవ్వినట్టైంది
సావుకున్న నా పెండ్లాం కడుప్మీద తన్నినట్టైంది,
దిమాగ్ తిరిగి, కోపం పెరిగి, గడ్డపార కుచ్చితె
మోరిల వడ్డ పందిలెక్క రక్తంవాగుల వాడు,
కుక్కలు పరార్, బైటికచ్చిన పేగుల్జూశి,

పెండ్లాం యాదికచ్చి బిరానింటికి పోంగ,
అలికినట్టు కొట్టె వాకిలంత
లచ్చి కండ్లు తెరవంగనె,

జెర్శేపటికె పోలీస్ బూట్లు
ఆకిలంత మల్ల పొక్కిలి జేస్కుంట,
శేత్ల గడ్డపార
పోలీసోల్లను అందాజ చూస్కుంట
ఎమ్మెల్యేగాని రక్తంతోని నడింట్ల ముగ్గుబొట్లు జారేస్కుంట...

3.9.12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి